కాని, ఇటీవలి కాలంలో ప్రకృతిని వ్యాపార ధృక్పధంతో నాశనం చెయ్యడం ఎక్కువయిపోయింది. మనిషి తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా తన అవసరాల కోసం ప్రకృతిని కొల్లగొడుతూనే వున్నాడు. ప్రకృతి సహిస్తూనే ఉంది. కాని ఇటీవలి కాలంలో ప్రకృతిని వ్యాపారం పేరుచెప్పి కొల్లగొట్టడం ఎక్కువయింది. 18వ శతాబ్దిలో పారిశ్రామిక విప్లవం మొదలయినప్పటి నుండి ఈ ప్రకృతి వినాశనం పెద్ద ఎత్తున జరుగుతుంది. మన అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని అవసరం వున్నా లేకపోయినా అదేపనిగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇదివరకు బజారుకి వెళ్ళేటప్పుడు చేతిలో తప్పనిసరిగా ఒక చేతిసంచి వుండేది. కాని ఇప్పుడో... చేతులూపుకుంటూ మార్కెట్‌కి వెళ్ళి కావలసినవి అన్నీ కొనుక్కుని, దుకాణదారుడిచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ చేతపుచ్చుకుని రావడం అలవాటు చేసుకున్నాము. దీనివలన ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయి, పర్యావరణపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం ఒక్కసారి సరుకు తెచ్చుకుని ఆ ప్లాస్టిక్ సంచిని బయట పడెయ్యడం వలన అవి భూమిలో త్వరగా కరగక, డ్రైనేజీలకి అడ్డుపడడం వల్ల, అవి భూమిలో వున్నచోట చెట్లు పెరగక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనం తిని పారేసే చిరుతిండి రేపర్ దగ్గర నుండి, ఒక సారి వాడి పారేసే థంసప్ సీసా దగ్గర నుండి, షాంపూ ప్యాకెట్ కవర్, ప్లాస్టిక్ బొమ్మలు, ఇలా ప్రతీదీ ప్రకృతి మీద భారాన్ని పెంచేదే. ఒకే సారి ఎక్కువగా కొనుక్కుని వాడుకునే రోజులు పోయి ఇప్పుడు ఇన్నీ చిన్న చిన్న పరిమాణాల్లో వాడుకోవడాబ్నికి వీలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వుదాహరణకి ఇదివరకు షాంపూ కొనాలంటే ఒకేసారి ఒక పెద్ద బాటిల్ కొనేవాళ్ళం. కాని ఇప్పుడు మాత్రం అన్నీ రూపాయి ప్యాకెట్లే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఒక రూపాయి ప్యాకెట్ కొనుక్కుని అప్పటి అవసరం తీరిన తరువాత ఆ ఖాళీ సంచి బయట పడెయ్యడమే. బిస్కట్లు, చాక్లెట్లు, ఆట బొమ్మలు, చిరుతిళ్ళు ఇలా ప్రతీదీ ప్లాస్టిక్ మయం అయిపోయాయి. అందరూ యధాలాపంగా వీటిని వాడి పారేసే వారే గాని దీనివల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుంది, అసలు ఇంత ప్లాస్టిక్ వుత్పత్తి చెయ్యాలంటే ఎంత మేరకు గనుల్ని తవ్వాల్సి వస్తుంది, ఎన్ని భూగర్భ జలవనరులు కలుషితం అయిపోతున్నాయి, వీటిని వాడి పారేసిన తరువాత ఎక్కడికి వెళుతున్నాయి, మరలా వీటివల్ల ఎంత నష్టం వాటిల్లుతుంది అని ఆలోచించేవాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే. పారిశ్రామికీకరణ వెర్రి తలలు వేస్తుంది అనడానికి ఇది ఒక వుదాహరణ మాత్రమే. భూమి మీద మనిషి పుట్టిన ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఇంతటి వినాశనాన్ని ప్రకృతి ఎప్పుడూ ఎరగదు. అన్నిటికన్నా బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇవన్నీ మనం వ్యాపారం అనే ముసుగులో చేస్తున్నాము. పారిశ్రామికీకరణ అంటే అదేదో గొప్ప అని తలచి మనమున్న చెట్టుని మనమే నరుక్కుంటున్నాము.
చిన్నప్పుడు చందమామ లో ఒక కధ చదివాను. అదిప్పటికీ గుర్తు. ఒక వూళ్ళో ఇద్దరు స్నేహితులుంటారు. ఇద్దరికీ ఏదయినా వ్యాపారం చెయ్యాలని బుద్ది పుడుతుంది. ఒక రోజు వారి భార్యలు చెరికో ముంతలో మజ్జిగ కలిపి వారికి ఇచ్చి పట్నంలో జరిగే సంతలో అమ్మి డబ్బు సంపాదించమని పంపిస్తారు. వారిద్దరూ పట్నానికి నడిచి వెళుటూండగా వారిలో ఒకరికి దాహం వేస్తుంది. వాడు తన స్నేహితుడితో "ఒరేయ్, నాకు చాలా దాహంగా వుంది. నేను నా మజ్జిగ తాగలేను కదా... మనం వ్యాపారం కోసం వెళుతున్నాం కాబట్టి నాతోనే బోణి చెయ్యి. ఇంద, ఈ పావలా తీసుకుని నాకు కొంచెం మజ్జిగ పొయ్యి" అని అడిగాడట. ఆ స్నేహితుడు ఆ డబ్బుని తీసుకుని మజ్జిగ పోసాడట. కాస్సేపటికి రెండో స్నేహితుడికి దాహం వేసిందట. వాడు మొదటి స్నేహితుడికి తనదగ్గరున్నా పావలా ఇచ్చి దాహం తీర్చుకున్నాడట. కొంతసేపటికి మళ్ళీ మొదటి స్నేహితుడికి దాహంవేసి పావలా ఇచ్చి దాహం తీర్చుకున్నాడట. ఇలా పట్నం చేరే లోపుగా ఇద్దరికీ చాలాసార్లు దాహం వేయ్యడం ఒకరికొకరు పావలా ఇచ్చి మజ్జిగ తాగడం జరిగింది. ఒక పావలాయే ఇద్దరి మధ్యా చేతులు మారింది. కాని ఇద్దరి దగ్గరా మజ్జిగ ఖాళి అయిపోయింది. ఇద్దరూ వ్యాపారం చేసారు. కాని డబ్బులు కనబడలేదు. మజ్జిగా కనబడలేదు. ఈ కధని సరదా కోసం రాసినా, ఇప్పుడు ప్రకృతి వనరుల్ని వ్యాపారం కోసం నాశనం చేస్తున్న తీరు చూస్తే ఈ కధే గుర్తుకు వస్తుంది. అందరమూ వ్యాపారమే చేస్తున్నాము. వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలు కోట్ల కొద్దీ డబ్బుని టర్నోవర్ చేస్తున్నాయి. డబ్బు చేతులు మారుతోంది. అవసరం లేని చెత్తతో మనం వుండే ఈ భూగోళాన్ని నింపేస్తున్నాము. ప్రకృతి వనరులన్నీ హరించుకు పోతున్నాయి. కొన్నాళ్ళకి ఈ కధలోలాగా మనదగ్గర ఈ మట్టి కుండలు, రంగు కాగితాలు (కరెన్సీ నోట్లు) మిగులుతాయి. తరువాతి తరాల వారికి అందించడానికి ఏమీ మిగలదు. కనీసం మనం బ్రతకడానికి తిండిగాని, దాహం తీర్చుకోవడానికి గుక్కెడు మంచి నీళ్ళు మిగలకుండా పోతాయి.
నిజమయిన అభివృద్ది, వ్యాపారం అంటే ప్రకృతిని నాశనం చెయ్యడం కాదు, దాన్ని పరిరక్షించడం. మనం ఇప్పుడు ఎంత విలాసవంతంగా విచక్షణ రహితంగా బ్రతుకుతున్నాం అనిగాక, ఈ ప్రకృతిని మన భావి తరాలవారికి ఎంత భద్రం అందించగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. మనకి తిండి పెట్టే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, శ్రమించి పనిచేసే రైతన్నకి విలువలేకుండా చేసి, అందరూ ఇంజినీర్లు కావాలని గంగ వెర్రులెత్తడం చూస్తూంటే చాలా బాధేస్తుంది. అందరూ పల్లకీ ఎక్కేవారయితే, దాన్ని మోసే బోయీలెవరన్నట్లుగా అందరూ ఇంజినీర్లయిపోయి కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఇంక మనకి తిండి పెట్టేదెవరంట? చివరికీ అందరూ తిండికి లేక చావాల్సి వస్తుంది. ప్రాచీన గ్రీకు దేశం లో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే పరిస్తితి వుత్పన్నమయిందంట. అక్కడ చదువుకున్నవారికి, మేధావులకి సమాజంలో గొప్ప స్తానం లభించేదట. వేదికలెక్కి వుపన్యాసాలిచ్చేవారిని అందరూ గౌరవించేవారట. క్రమేణా ఆ దేశంలో అందరూ మేధావులయిపోయారు. అందరూ వుపన్యాసాలిచ్చేవాళ్ళే. పనిచేసేవాళ్ళూ, పంట పండించే వాళ్ళూ కనబడలేదు. చివరికి అందరూ ఆకలతో అలమటించి అంతటి గొప్ప గ్రీకు నాగరికత కూడా నామరూపాల్లేకుండా పోయిందట. ఇది ఎంతవరకూ నిజమయినప్పటికీ ప్రస్తుతమున్న సమాజ పరిస్తితిని, ఆర్ధిక వ్యవస్తని చూస్తూంటే ఆ రోజు మనకి ఎంతో దూరంలో లేదనిపిస్తుంది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.