1. మనుషులంతా ప్రాధమికంగా జంతువులే కాబట్టి ఏమి చేసినా ఎలా చేసినా తప్పులేదని ఈ మధ్యన ఒకాయన సెలవిచ్చారు. కాబట్టి, ఒక పనిచేస్తే సరి.. జంతువులన్నీ నాలుగు కాళ్ళమీద నడుస్తున్నాయి కాబట్టి, మనిషి కూడా ఒక రకమయిన జంతువే కాబట్టి, మనుషులు కూడా నాలుగు కాళ్ళ మీద నడిస్తే సరి. ఒక్క సారి ఊహించుకోండి.... అందరూ నాలుగు కాళ్ళ మీద నడిస్తే ఎలా వుంటుందో... ఇదేమిటి పైనున్న వాటిని చేతులంటారనికదా మీ అనుమానం.... లేదండి.. పూర్వం ఒకప్పుడు అవి కాళ్ళే... తరువాత మన సౌలభ్యం కోసం చేతులని పేరు పెట్టుకున్నాం... అంతే....
2. ఎప్పుడూ చేత్తోనే కంప్యూటర్ కీ బోర్డ్ మీద టైప్ చేస్తారెందుకు? అప్పుడప్పుడు వెరైటీగా కాలితో కూడా ప్రాక్టిస్ చెయ్యొచ్చుకదా.. కాలికి కూడా వేళ్ళు వున్నాయి కదా...
3. బైక్‌ని ఎప్పుడూ రోడ్ మీద మాత్రమే ఎందుకు నడపాలి? ఫుట్‌పాత్ మీద ఎక్కించి నడపొచ్చు కదా.. అలాగే రోడ్‌కీ ఎడమవైపునే ఎందుకు వెళ్ళాలి? కుడి వైపున వెళితే ఏమవుతుంది? అది ఇదీ కుడా రోడ్డే కదా... ఎవరయినా గుద్దితే వాళ్ళమీద లాజిక్ ప్రయోగిద్దాం. ఏదయినా రోడ్డే కదా... ఎవరు ఎటువైపు వెళితే ఏంటి? నేను వెరైటీ గా ఉంటాను కాబట్టి ఇలా వెళతాను అని చెప్పొచ్చు, ఎదుటి వాడి నోరు మూయించొచ్చు.
4. కూరగాయలు, బియ్యం, మాంసం అన్నీ వండుకు తినడం ఎందుకు దండగ? మనుషులు కూడా జంతువుల్లాంటి వాళ్ళే కాబట్టి వాటినలాగే, పచ్చిగా, పిచ్చిగా తినేస్తే నష్టమేంటంటా? అహ నష్టమేంటంటా అని?
5. పుస్తకాలని ముందు నుంచి వెనకకి చదువడమెందుకు? వెనకవైపు నుంచి ముందుకు చదవచ్చు కదా.. ఎందుకంటే ఏదయినా చదవడమే... అవే పేజీలు, అవే అక్షరాలు... అదే విషయం... అలా చదివితే అడిగేదెవడంట....
బాబోయ్... ఇప్పటికే చాలా చెప్పేసాను... ఇంక నాకు ఓపిక లేదు.. ఇంకా వెరైటీ ఆలోచనలుంటే మీరు కూడా రాయవచ్చండోయ్... అప్పుడు అందరూ కలిసి మరింత వెరైటీగా వుండొచ్చు కదా... మీరేమంటారు.. ఈ సంస్కృతి, సంప్రదాయాలు, పాత చింతకాయ పచ్చళ్ళు వల్ల ఉపయోగం ఏమిటి? ఇన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులంతా పిచ్చోళ్ళు కాబట్టి, వాళ్ళకి మతిలేదు కాబట్టి ఇలాంటి అర్ధం పర్ధం లేనివన్నీ పెట్టారు. మనం తెలివయినవాళ్ళం కాబట్టి, "ఆధునిక యుగంలో" వున్నాం కాబట్టి... ప్రశ్నించాలి కాబట్టి మనకి దొరికిన ప్రతీదాన్నీ తలా తోకా లేకుండా ఖండించి, వాదించి అవతల పారేద్దాం...
(గమనిక: పైవన్నీ నేనెప్పుడూ ట్రై చెయ్యలేదు... "వెరైటీ", "ఆధునికత" కోరుకునే వారికోసం ఈ పోస్ట్. పైవన్నీ ఎవరయిన ప్రయత్నించి, దానివల్ల ఏమయినా ఇబ్బంది పడితే నాకు సంబంధం లేదు... నన్నడగవద్దని మనవి)