Pages

Friday, November 13, 2009

ప్రపంచానికి ఆఖరు ఘడియలు... 2012 సినిమా రివ్యూ..


ఈ ప్రపంచానికి ఆఖరి రోజు వచ్చి, వినాశనం కళ్ళ ముందు జరుగుతూంటే, ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోతే, ఎలా వుంటుంది అనే అంశాలతో తీసిన చిత్రమే ఈ 2012. ఈ సినిమా దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిక్ కి జనాలని భయపెట్టడం ఇదేమి కొత్త కాదు. ఇది వరకు ఇండిపెండెన్స్ డే, 10,000 బి.సి., డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. వినాశనం, ప్రళయం వంటి సబ్జక్టులతో సినిమాలు రావడం హాలీవుడ్ లో కొత్త కాకపోయినా, 2012 లో నిజంగానే భూమి వినాశనం అవుతుందనే అంచనాలతో రూపొందించిన సినిమాగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్‌లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్‌గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్‌కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్‌లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్‌తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.

ఈ సినిమాలో హీరో జాక్సన్‌కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్‌లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.

అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్‌ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.

నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్‌లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.

3 comments:

  1. జగదీశ్ గారు, ౨౦౧౨ సినిమా గురించి చక్కని రివ్యూ రాసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ అమెరికాలో ఈరోజే ఈ సినిమా విడుదల అవుతుంది. మీ రివ్యూ చదివాక సినిమా చూడాలన్న కోరిక మరింత ఎక్కువ అయింది.

    ReplyDelete
  2. అయితే చూడాలి ఈ సినిమాని.

    ReplyDelete
  3. @ శ్రీనివాస్ గారూ.. భవానీ గారూ... మీకు రివ్యూ నచ్చినందుకు సంతోషం...

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.