Pages

Saturday, October 10, 2009

బాల్యాన్ని హరించే హక్కు మీకెవరిచ్చారు?

విద్య పేరిట వెర్రి మొర్రి వేషాలెయ్యడం ఈ మద్యన బాగా ఎక్కువయిపోయింది. ఎంత పట్టించుకోకుండా వుందామన్నా ఈ టపా రాయక మనసు ఆగడం లేదు. మోడల్ స్కూల్స్, మోడర్న్ స్కూల్స్, ఐడియల్ స్కూల్స్ అయిపోయాయి.. ఇక టెక్నో సూల్స్ మిగిలాయి. నేను ఈ రోజు ఒక స్కూల్ వారు పంపించిన టెక్నో స్కూల్ పుస్తకాలు చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఆరో తరగతి పిల్లల కోసం తయారు చేసిన పుస్తకాలంట... I.I.T Foundation course అని వాటి మీద రాసి వుంది. చూస్తే అవి ఇంజినీరింగ్ కాలేజ్ పుస్తకాల్లాగా అనిపించాయి. నేను చిన్నపుడు ఆరో తరగతిలో అటువంటి సిలబస్ చదివిన గుర్తు లేదు. ఆఖరికి నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నపుడు కూడా అటువంటి పుస్తకాలు చదివిదిన గుర్తు లేదు (1990 లలో). అసలు ఆరో తరగతి నుంచే I.I.T ఏమిటో నాకయితే అర్ధం కావడం లేదు. (నేను బాగా వెనుకబడి వున్నానని మీరెవరయినా భావిస్తే నాకేమీ అభ్యంతరం లేదు).

మారుతున్న ప్రపంచం బట్టి మనం కూడా మారాల్సిందే. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెరగాల్సిందే. కాని తమ లక్ష్యమేమిటో కూడా సరిగా ఎన్నుకోలేని లేత వయసులో పి.జి. స్థాయి పుస్తకాలతో ఆరో తరగతి చదివే పిల్లల్ని హింసించడం ఎంతవరకూ సబబు? ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే, అప్పుడే పుట్టిన వారికి కూడా I.I.T, EAMCET కోచింగ్ మొదలు పెట్టేసేలా వున్నారు ఈ సో కాల్డ్ విద్యావేత్తలు. అమ్మా, నాన్న ఎందుకు అని నేర్పించడం ఎందుకు దండగ? ఆ రెండు పదాల బదులు, గురుత్వాకర్షణ సిద్దాంతం నేర్పిస్తే పోలా? అనుకునేలా వుంది పరిస్థితి. ఒక చిన్న వుదాహరణ చూస్తే మీకే తేలికగా అర్ధమయిపోతుంది. ఆ టెక్నో బుక్ (sorry.. I.I.T Book) లోంచి ఒక ప్రశ్నని మీకు రుచి చూపిస్తాను చూడండి. నిజం చెప్పాలంటే నా కంటికి కనబడ్డ వాటిల్లో ఇదే చిన్న ప్రశ్న. ఇంతకన్నా చాలా క్లిష్టమయిన విషయాలే వున్నాయి అందులో..

Q. The level of water in a measuring cylinder is 12.5 ml. When a stone is lowered in it, the volume is 21.0 ml. Then the volume of the stone is...
option A) B) C) D)

అసలే బుర్ర తక్కువ ప్రభుత్వాలు విద్యని ఎప్పుడో నాశనం చేసేసాయని బాధ పడుతుంటే, మళ్ళి ఈ కొత్త ముప్పొకటి. విద్యలో ప్రమాణాలు పెంచాలని అందరూ గొడవ చేస్తుంటే, పి.జి.లో లెసన్స్ తీసుకు వచ్చి ఆరో తరగతి సిలబస్ లో కలిపేసి, చేతులు దులుపుకుంటున్నారు. ఎంత ఎక్కువ సిలబస్ పిల్లలకి ఇస్తే అంత ఎక్కువ స్టాండర్డ్స్ పాటిస్తున్నట్టన్న మాట. పిల్లకి మనం చెప్పేది అర్ధం అవుతుందో లేదో, వారికసలు అర్ధం చేసుకునే వయసు వుందో లేదో ఎవరూ అలోచించడం లేదు.

ఇక స్కూల్స్ గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఒకళ్ళు ఏది మొదలెడితే ఇక అందరూ ఫాలో అయిపోవడం. అది పిల్లలకి ఎంత వరకూ అవసరమో అలోచించరు. ఎవరయినా స్కూల్ వాళ్ళు పుణ్యం కట్టుకుని, చంద్రమండలం వెళ్ళడానికి అవసరమయిన కోర్స్ నాలుగో తరగతి నుంచే చెపుతామంటే, ఇక తెల్లారే సరికి మరొక స్కూల్ వాళ్ళు రెడీ అయిపోతారు. మేము అదే కోర్స్‌ని మూడో తరగతి నుంచే చెపుతాము అని. వెంటనే పబ్లిషర్లు రంగం లోకి దిగితారు. నాలుగో తరగతి పిల్లలకి చంద్ర మండలం వెళ్ళడానికి అవసరమయిన కోర్స్ మెటీరియల్ మార్కెట్ లో రెడీ.

ఇక పేరెంట్స్... వాళ్ళు ఈ విషవలయంలో భాగస్వాములే కాబట్టి, అటువంటి స్కూల్స్ లో పిల్లల్ని చేర్పించడానికి రెడీ. ఎందుకంటే ఫలానా చంద్ర మండలం మీదకి పంపే కోర్స్ చెప్పే స్కూల్ లో తమ పిల్లల్ని చదివిస్తున్నామంటే వాళ్ళకి అదో స్టేటస్ సింబల్. పిల్లలు ఎంత ఏడుస్తున్నా వినకుండా, పొద్దున్న ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆటపాటలు లేకుండా, తిండి కూడా సరిగా తినకుండా అదే పనిగా చదువుతున్నా, రోజుకి నాలుగ్గంటల పాటు స్కూల్ బస్సులలోనే బాల్యం హరించుకు పోతున్నా, తల్లిదండ్రులకి పట్టదు. ఇలా బాల్యం లేకుండా పెరిగి పెద్దయిన పిల్లలు ఏమి సాధించగలరని ఆశించగలం? శాడిస్టులగానా, లేక కార్పోరేట్ సంస్తల్లో డబ్బులు సంపాదించే యంత్రాల్లాంటి వుద్యోగులు గానా?

నాకు తెలీక అడుగుతానూ.. ఇప్పటి వరకూ మానవ నాగరికతలో శాస్త్ర విజ్ఞాన పరంగా ఎన్నో మహత్తర పరిశోధనలు చేసిన సైంటిస్టులు అందరూ ఇలాగే చదివారా? ఎవరయినా గొప్ప వాళ్ళవ్వలన్నా, ఏదయినా అద్బుతం సాధించాలన్నా, ఇంత హింస అనుభవించాల్సిందేనా? ఇంతటి మానసిక హింస భరించలేక ఆత్మ హత్యే శరణ్యమనుకుని జీవితాన్ని ముగించే పరిస్థితి ఏర్పడితే, ఆ చిన్నారి చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు... బుద్దిలేని ప్రభుత్వాలా?.... కాసులకి కక్కుర్తి పడే విద్యా సంస్తలా?.. గొప్పలకి పోయే తల్లిదండ్రులా? బాధ్యత ఎవరిదయినా గాని ఈ చదువనే యజ్ఞంలో బలిపశువులుగా మారుతున్నది మాత్రం అమాయక బాల్యమే...

4 comments:

  1. ౧. అసలు అందఱికీ ఒకే విధమైన చదువెందుకు ?
    ౨. ఈ బళ్ళకీ, కళాశాలలకీ ప్రభుత్వగుర్తింపు దేనికి ?


    అనే ప్రశ్నల్ని ప్రజలు వేసుకుంటే గానీ ఇందులోంచి బయటపడలేరు. విద్యాసంస్థల యజమానులు తమంతట తాము ఈ ఓవర్యాక్షన్ లు చెయ్యడం లేదు. ఈ తిక్కలన్నిటికీ మన తెలివితక్కువ ప్రజల మద్దతు ఉంది. ఆదరణా ఉంది. దాన్ని వాళ్ళు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు.

    ReplyDelete
  2. good topic.....

    deeniloa thalli thandrula thappu koodaa chaalaa undandi

    ReplyDelete
  3. మీ gmail id కొంచెం ఇస్తారా?? సివిల్స్ గురించి కొంచెం మాట్లాడాలి....

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.