Pages

Thursday, June 9, 2016

రిజర్వేషన్ల కోసం సిగ్గులేకుండా నడి రోడ్డుపై ధర్నాలు చేసే వారికి గుణపాఠం .... స్విస్‌ ప్రజల తీర్పు

    ప్రభుత్వం నుండి అప్పనంగా అన్నీ వచ్చేయాలనుకునే వారు స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన సందేశాన్ని చూసి తలదించుకోవాల్సిందే. దేశ ప్రజలందరికీ బ్రతకడానికి అవసరమైన కనీస మొత్తాన్ని ఉచితంగా ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ప్రపంచంలోనే ఇది మొదటిసారట. కాని, అనూహ్యంగా, తమకు అటువంటి ఉచితాలు ఏవీ వద్దంటూ స్విస్‌ ప్రజలు తమ నిరాకరణను ఓటింగ్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ ఒకటి. ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశం స్విట్జర్లాండ్‌. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అందరికీ తెలిసిన బ్యాంకింగ్‌ రంగమే. నల్లకుబేరులందరికీ ఈ దేశంలోని బ్యాంక్‌లలో అక్కౌంట్స్‌ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. భారత్‌, చైనాతో సహా అనేక వర్ధమాన దేశాల్లోని అవినీతి నేతలు, ప్రభుత్వ అధికారులు అందరూ తమ దేశ ప్రజల కడుపుకొట్టి సంపాదించిన పాపిష్టి సొమ్మును అక్కడే భద్రంగా దాచుకుంటారు. అలా కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేర ధనం స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతోందని అంచనా. ఇది కాకుండా ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం, చాక్లెట్స్‌, పాడి పరిశ్రమ. దీని వల్ల ఇప్పటికే అక్కడి ప్రజలు తమ కష్టానికన్నా ఎక్కువ మొత్తంలోనే ప్రతిఫలాన్ని జీతాల రూపంలో పొందుతున్నారు. తాజా ప్రతిపాదనతో దేశంలోని పౌరులెవ్వరు పనిచేయనక్కర్లేకుండానే జీతం పొందడానికి వీలవుతుంది. కాని ఇటువంటి అప్పనంగా వచ్చే జీతాన్ని పొందడానికి అక్కడి పౌరులు నిరాకరించడం స్వాగతించదగ్గ విషయం. వారిని చూసి మనలాంటి దేశాల్లో ప్రజలు ఎంతో నేర్చుకోవాలి.

    ప్రతి ఎన్నికల్లోను రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక ఉచిత వాగ్దానాలు చేయడం చూస్తూంటాం. రుణమాఫీ దగ్గర నుండి, ఉచిత పెన్షన్లు, ఉచిత ఆరోగ్యం, విద్య వంటి మౌలిక అవసరాల నిమిత్తం అయితే కొంతలో కొంత మేలు. అదే ప్రక్క రాష్ట్రంలో అయితే టి.వి.లు, వాషింగ్‌మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, డి.టి.హెచ్‌. కనెక్షన్లు, సెల్‌ఫోన్ల వంటివి ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హోరెత్తించారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒకటుంది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుండో దిగివచ్చింది కాదు, అది మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నదే. మనందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బుని పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడుతుంటే, అక్కడుండే యంత్రాంగం ప్రజలకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తుంది. దేశ రక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, రహదారులు, విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి వాటికి వేల కోట్ల రూపాయిలు అవసరమవుతాయి. అంత పెద్ద ఖర్చు ఏ ఒక్కరు వ్యక్తిగతంగా పెట్టలేరు కాబట్టి, దేశంలోని ప్రజలందరి నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మునే అభివృద్ధికి ఉపయోగిస్తారు. అలా కాకుండా అదే ప్రజల  సొమ్మును తిరిగి వారిలో కొందరికి ఉచితంగా ఇవ్వడం మొదలు పెడితే, కొంత మందికి కష్టపడకుండా, ప్రభుత్వం నుండి సొమ్ము లభిస్తుంది.  దానితో వాళ్ళు ఏ పనీపాటా లేకుండా సమాజానికి భారంగా మారతారు.  నిజంగా కష్టపడి సంపాదించి, పన్నులు కట్టే వాడికి కడుపు మండుతుంది.  కొంత కాలానికి సమాజంలో అసంతృప్తి బయలుదేరుతుంది. అందరూ కష్టపడడం మానేస్తారు. ఉత్పాదకత తగ్గిపోతుంది. మానవ వనరులు లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం తగ్గిపోతుంది. దానితో ప్రభుత్వాలు మరిన్ని ఎక్కువ పన్నులు విధిస్తాయి. దాంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది. సంక్షేమ పథకాలనేవి ప్రభుత్వ విధానంలో ఒక భాగం కావాలి గాని, ప్రభుత్వమే సంక్షేమ పథకాల సృష్టికర్త కారాదు. ప్రజలకు కష్టపడే తత్వాన్ని నేర్పాలిగాని, సోమరిపోతుల్ని తయారుచేయకూడదు.

    భారతదేశంలాంటి చోట్ల మరో రకమైన సోమరులు తయారవుతున్నారు. అవే రిజర్వేషన్లు. భారతీయ సామాజిక స్థితిగతుల రీత్యా, కుల వ్యవస్థ వేళ్ళూనుకుని ఉన్న రోజుల్లో కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు కేటాయించారు. అది కూడా కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉండేలా నిబంధన చేసుకున్నారు. కాని, తరువాతి కాలంలో వచ్చిన రాజకీయ పార్టీలు తమ ఓట్ల స్వలాభం కోసం రిజర్వేషన్లను ప్రోత్సహించారు. దీనివల్ల కుల వ్యవస్థ రూపుమాపకపోగా మరింత బలంగా తయారయింది. కులాల పేరిట రాజకీయ పార్టీలు కూడా ఏర్పాటయ్యాయి. చివరికి పరిస్థితి ఎలా దాపురించిందంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత ఆర్థికంగా స్థిరపడిన ఎన్నో కులాల వారు కూడా తమను వెనుకబడిన కులాల కింద పరిగణించి, తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సిగ్గులేకుండా డిమాండ్‌ చేస్తున్నారు.

    ప్రపంచీకరణ నేపథ్యంలో కులానికన్నా, మతానికన్నా, భాషకన్నా ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను బట్టి, అతనికి లభించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంతే కాని, ఒక కులం వారికో, ఒక మతం వారికో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. ఈ రోజు మనం అనుభవిస్తున్న అనేక సదుపాయాలు, పరికరాలు ఏ కులం వారు కనిపెట్టారో, ఏ మతం వారు తయారుచేసారో ఎప్పటికీ ఆలోచించం. ఆ పరికరాలు నాణ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. నాణ్యతకు పెద్దపీట వేసి, తక్కువ రేటులో ఇచ్చారు కాబట్టే, అమెరికా, జపాన్‌ వంటి పెద్ద దేశాల పరికరాలను కాదని, కొరియన్‌ కంపెనీలయిన శాంసంగ్‌, ఎల్‌జి వంటి సంస్థల ఉత్పత్తుల్ని ప్రోత్సహించాం. ఇది అన్ని ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది.

    ప్రతిభావంతుల్ని కాదని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెడితే, రెండు రకాలుగా నష్టం కలుగుతుంది. మొదటిది ప్రతిభ లేనివాడు అందలం ఎక్కి, దేశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తాడు. కనీసం ఒక తెలుగు పేపర్‌ను తప్పులు లేకుండా చదడం రాని ప్రభుత్వ టీచర్లని నేను చూసాను. సంధుల్ని ఎలా విడదీయాలో, సమాసాలు అంటే అర్థం ఏమిటో కూడా పూర్తిగా చెప్పలేని తెలుగు ఉపాధ్యాయుల్ని నేను స్వయంగా చూసాను. చాలా బాధ అనిపించింది. ఇటువంటి వారు ఉపాధ్యాయులైతే, విద్యార్థులకు ఏం నేర్పగలరు? టీచర్‌కి 200% ప్రతిభ ఉంటేనే విద్యార్థిని 100% ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దగలడు. టీచర్‌కే 35 మార్కులు వస్తే, ఇక విద్యార్థి పరిస్థితి ఏమటి? దీని గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరు? ఒక ఉద్యోగి చేతగాని వాడయితే ఆ శాఖ మాత్రమే ఇబ్బంది పడుతుంది. కాని ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడు కాకపోతే కొన్ని విలువైన జీవితాలు, పూర్తి కొన్ని తరాలు అజ్ఞానపు అంచుల్లోకి జారిపోతాయి. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం.

    అందుకే విజ్ఞులైన దేశ ప్రజలు అయాచితంగా ఇచ్చే వాటిని తిరస్కరించాలి. రిజర్వేషన్లను వ్యతిరేకించాలి. ఊరికే వస్తున్నాయి కదా అనుభవించడానికి ప్రయత్నిస్తే, భవిష్యత్తు తరాలు అంధకారంలో బ్రతకాల్సి వస్తుంది. స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా మేలుకుని, సంక్షేమ పధకాల్ని, రిజర్వేషన్లని తిరస్కరిస్తే, మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో సమయం పట్టదు. అది మన చేతుల్లోనే ఉంది.

5 comments:

  1. బాగా వ్రాసారు !! చదువులకి రిజర్వేషన్ లు పరవాలేదు. కానీ ఉద్యోగాలలో, ఆఖరికి ప్రమోషన్ లలో కూడా రిజర్వేషన్ ఉండటం దారుణం. గోల్డ్ మెడల్ వచ్చిన దగ్గరికే వైద్యం చేయించుకుంటాం కానీ బొటాబొటి మార్కులతో పాసయిన వాడి దగ్గర వైద్యం చేయించుకుంటామా ? రిజర్వేషన్స్ అడిగేవారు ఇలా కొంచం ఆలోచించుకోవాలి

    ReplyDelete
  2. స్నేహానికీ, పెళ్ళికీ, బంధుత్వానికీ, ఆఖరికి అర్చకత్వానికీ కులాలను పరికించే మనం. వర్ణవ్యవస్థను (అనగా బ్రాహ్మణ రిజర్వేషన్లను) నిస్సిగ్గుగా సమర్ధించే సంస్కృతిని సమర్ధించే మనం. దళితులను గుడ్డలూడదీసికొడితే ఒక్క పోస్టైనా రాల్చని మనం, వాళ్ళకు దన్నుగా ఉన్న రిజర్వేషన్లను మాత్రం ఖండిస్తాం!

    నీతులు మీదగ్గరే నేర్చుకోవాలి.

    విద్యను భ్రాహ్మణులకుమాత్రమే పరిమితంచేసి, మాలామాదిగలను చెప్పులుకుట్టడానికిమాత్రమే పరిమితం చేస్తే అది అర్షసంస్కృతి & "మన" సంస్కృతి. దాన్ని ప్రతిపాదించిన వేదాల వైజ్ఞానికతమీద మోకున్న అ రకొర తెలివితో వ్యాసాలు రాసి ఎచ్చులుపోయే మీరు రిజర్వేషన్లను వ్యతిరేకించడం. హవ్వ!! సిగ్గు కాదుటయ్యా? తెలుగు సినిమాలు కులాభిమానులవల్లే ఆడుతున్నాయన్న నిజము తెలిసీ, కులం ప్రభావం హిందూమతంలో ఎంత బలీయమో తెలిసీ, అవకాశాల్లో ఒకింత వాళ్ళకిస్తే, మీరు నోరు నొక్కుకుంటారా? దమ్ముంటే? చేవుంటే? కులరక్కసికి మూలాధారమైన ఈ బ్రాహ్మణ మతంపైన ఒక్క పోస్టు రాల్చి చూడు.

    ReplyDelete
    Replies
    1. ALL RELIGIONS ARE HAVING CASTE/SECT LIKE DIVISIONS..NOT ONLY IN HINDU ALL OVER THE WORLDS THERE ARE THOUSANDS OF DIVISIONS ARE STILL EXISTING. OORIKE HINDUVULA GURINCHI NORU CHINCHUKONAKKARALEDU

      Delete

  3. కులరక్కసికి మూలాధారమైన ఈ బ్రాహ్మణ మతంపైన ఒక్క పోస్టు రాల్చి చూడు.

    @ Grey hat,

    ఈ కొబ్బరి చిప్పల బ్యాచ్ మీద వందలపోస్టులు వ్రాయవచ్చు,ఉపయోగం ఏవిటట ?ఖురాన్,బైబిల్,భగవద్గీత వ్రాసినవాళ్ళూ మనుషులే ..దేవుళ్ళు కారు అంటే వినిపించుకునే కెవ్వు కేక బ్యాచ్ దొరకాలి కదా ?

    ReplyDelete
  4. thought provoing situation
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.