సామాజిక మాధ్యమాలలో అకౌంట్ కలిగి ఉండడం ఇపుడు ఒక అవసరంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్ లేదా వాట్సాప్‌లలో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కలిసి తమ ఆలోచనలు పంచుకోవడానికి, బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే, కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు వీటివల్ల ఎన్నో లాభాలతో పాటుగా అంతకు మించి నష్టాలు కూడా ఉంటున్నాయి. ఎంతో మంది జీవితాలు వీటివల్ల నాశనం అయిపోతున్నాయి. ముందు కేవలం సరదాగా మొదలయ్యి, చివరికి విషాదంతో ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాల్లో ఇవి కలకలం రేపుతున్నాయి. మా బంధువులో ఒకమ్మాయి కేవలం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్‌తో మొదలుపెట్టి, పెళ్ళి వరకు వెళ్ళి, అతని చేతిలో మోసపోయి, నరకం అనుభవించి, ఆత్మహత్య చేసుకుంది. తన చివరి వీడియోను ఫేస్‌బుక్‌లోనే షేర్‌చేసి, ఆత్మహత్య చేసుకుంది. ఎంతో బాధగా అనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర కొంత ఉన్నప్పటికీ, ముందు, వెనుక చూసుకోకుండా, ఒక అపరిచిత వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచన వల్ల ఆ అమ్మాయి జీవితం కోలుకోలేనంతగా దెబ్బతింది. అందుకే ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు వాడే చిట్టితల్లులకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను.
1. కొత్త వారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అనుమతించకండి. అలా పంపిన వారు మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినా సరే మొహమాటం లేకుండా నో చెప్పేయండి. అలాగే మీరు కూడా అబ్బాయి ప్రొఫైల్ ఫోటో మహేష్‌బాబులా ఉందనో, రామ్‌చరణ్‌ని మించిపోయాడనో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపకండి. మేక వన్నె పులులు, ఆవు తోలు కప్పుకున్న తోడేళ్ళకీ ఫేస్‌బుక్‌లో కొదవ లేదు. గుర్తుంచుకోండి.
2. మీ వ్యక్తిగత ఫోటోలను ఎట్టి పరిస్థితులలోను షేర్ చేయకండి. ఒకవేళ అంతగా షేర్ చేయాలనుకుంటే, పబ్లిక్ షేర్ కాకుండా, కేవలం మీ ఫ్రెండ్స్‌కి మాత్రమే కనబడేలా షేర్ చేయండి (మీరు షేర్ చేసేముందు పబ్లిక్ లేదా ఓన్లీ ఫ్రెండ్స్ అని ఆప్షన్స్ ఉంటాయి, చూడండి). దాని వల్ల అనవసరమైన పబ్లిసిటీ నుండి తప్పించుకోవచ్చు. మీ ఫోటోలను కూడా ఫోటోషాప్ చేసి, మీకు తెలియకుండా అసభ్యంగా మార్చి, వివిధ వెబ్‌సైట్లలో పోస్ట్ చేసే శాడిస్టులు ఉంటారు జాగ్రత్త.
3. లైకుల పిచ్చిలో పడి, మీ సెల్ఫీలు, వ్యక్తిగత విషయాలు షేర్ చేయకండి. ఎక్కువ లైక్‌లు వచ్చినంత మాత్రాన అదేం పెద్ద గొప్ప విషయం కాదు. జీవితంలో విజయాలు సాధిస్తే, అప్పుడు వచ్చే అభినందనల కిక్కే చాలా బాగుంటుంది.
4. ఛాటింగ్ చేసేటపుడు ఎట్టి పరిస్థితులలోను, ఎవరి మీదా మీ అభిప్రాయాలు చెప్పడంగాని, మీ ఫోటోలు షేర్ చేయడం గాని, మీ చిలిపి ఊహలు పంచుకోవడం గాని చేయకండి. ఎక్కువ మంది అబ్బాయిలు మీరు వ్యక్తిగతంగా పంచుకున్న వాటిని తమ ఫ్రెండ్స్‌కి చూపించి, పైశాచిక ఆనందం పొందుతారని మరువకండి. దాన్ని అలుసుగా తీసుకుని, వాళ్ళు కూడా మీ కేరక్టర్‌ని లోకువ చేసి చూస్తారు, వారు కూడా మీ నుండి 'ప్రయోజనం' పొందడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, మీ లిమిట్స్‌లో మీరు ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని లోకువ చేయలేరు. మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంటుంది.
5. ఎవరైనా హద్దులు దాటితే, వెంటనే వారిని బ్లాక్ చేయండి. మీ అకౌంట్‌లో బ్లాక్ యూజర్ ఆప్షన్ ఉంటుంది. అది వాడుకోండి. అప్పటికీ ఎవరైనా హద్దుమీరితో వెంటనే మీ అమ్మానాన్నలతోగాని, పెద్దలతో గాని ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. వాళ్ళు తప్పక సహాయ పడతారు. ప్రేమ, పెళ్ళి వంటివి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు ఎప్పటికీ మీ మంచినే కోరుకుంటారు అనేది మరువకండి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటపుడు వారి సమక్షంలోనే తీసుకోండి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని బాధపడేకంటే, ముందే మన మంచిని కోరేవారికి చెప్పడం వలన, విష పురుగుల బారిన పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకున్నవారవుతారు.
మరో ముఖ్య విషయం... ఇదంతా చదివిన తరువాత మీకో సందేహం రావచ్చు. ఇదేమిటి? ఈయన ఇలా రాస్తున్నారు... అబ్బాయిలు అందరూ అంతేనా... నా ఫ్రెండ్ మాత్రం మంచివాడేలే. లోకంలో చాలా మంది చెడ్డవాళ్ళుండవచ్చు. కాని, నా స్నేహితుడు మాత్రం అలాంటివాడు కాదు అనుకోవచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది.
మనం ప్రకృతిని పరిశీలించినట్లయితే, జీవ జాతుల్లో ఉన్న ఆడ, మగ వ్యత్యాసాలను ప్రకృతే ముందుగా ప్రోగ్రామ్ చేసింది. దీనికి ఒప్పుకుంటారు కదా. ప్రతి జీవ జాతిలోను ఆడ జీవి ఎప్పుడూ అణకువగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఎటువంటి పైత్యానికి, వికారాలకి లోను కాదు. కాని, అటువంటి ఆడ జీవిని తన వైపు ఆకర్షించుకుని, ఏదో విధంగా సృష్టికార్యం వైపు మొగ్గు చూపేలా చేయడానికి మగ జీవి ప్రోగ్రాం చేయబడింది. అందుకే మగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. మగ కోకిల మాత్రమే శ్రావ్యంగా పాడుతుంది. మగ జింకకు మాత్రమే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. మగ సింహానికి మాత్రమే సివంగిని ఆకర్షించడానికి వీలుగా పెద్ద జూలు ఉంటుంది. ఇటువంటి ఆకర్షణలన్నీ మగ జీవికి ఉండడం అంటే... వాటి అంతిమ లక్ష్యం ఆడ జీవిని ఆకర్షించడమే. అందుకే 'మగ బుద్ది' అంటారు. ఈ మగ బుద్ది సాధారణంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని, కొందరిలో అది హద్దుమీరి, సామాజిక కట్టుబాట్లని లెక్కచెయ్యకుండా ఆడపిల్లల్ని హింసించే స్థాయికి వెళుతుంది. అప్పుడే నేరం అవుతుంది. 99 శాతం మంది మగవారిలో ఈ 'మగ బుద్ది' నేను చెప్పినట్లుగానే ఉంటుంది. అందుకు సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రకృతే ఆ విధంగా ప్రోగ్రామ్ చేసింది. అటువంటి వాళ్లని హద్దులో పెట్టడానికే సామాజిక కట్టుబాట్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సామాజిక కట్టుబాట్లని అతి పురాతన కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహిళలచేత మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే మొట్టమొదటి సమాజాలు మహిళాధిక్య సమాజాలుగా రూపుదిద్దుకున్నాయి. తరువాతి కాలంలో పురుషాధిక్య మతాలు ఏర్పడ్డ తరువాత, మహిళలకి ప్రాధాన్యాన్ని తగ్గించి, తమ మాట వినేలా చేసుకున్నారు పురుషులు. అప్పటి నుండి, సామాజిక కట్టుబాట్లు సడలడం మొదలయ్యి, అవి మహిళల పట్ల గుదిబండలుగా మారాయి.
మరి మంచి వారు ఎవరూ ఉండరా అంటే... ఉంటారు. ఎంతో ఆలోచనా పరిణితి కలిగి, తమకు ఎదురు పడ్డ ప్రతి ఆడపడుచును, తమ తల్లిలా, దేవతలా భావించి, గౌరవించే వారు కూడా ఉంటారు. సనాతన సాంప్రదాయాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణా ఆచరిస్తారో (అలాగని, స్వామీజీలు, బాబాలు గొప్పవారని నేను అనడం లేదు, వారిలో కూడా 'మగ బుద్ది' బయట పడడం చాలా సార్లు చూస్తూంటాం.) అటువంటి వారు తమ మనసులో ఎటువంటి వికారం లేకుండా ఉంటారు. వారు నిజంగానే ఇబ్బందల్లో ఉన్న ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా సహాయం చేయడం చూస్తూంటాం. వారి ప్రేమకు ఎటువంటి హద్దులు ఉండవు. అటువంటి వారు మీ నుంచి భౌతికంగా గాని, వస్తురూపంగాగాని ఎటువంటి ప్రతిఫలం ఆశించరు. అదొక్కటే వారి ఆలోచనా పరిణితికి గుర్తు. మీకు సహాయం చేసి, ప్రతిఫలంగా మీ నుంచి ఏదైనా ఆశించారంటే, వారి ప్రేమలో ఏదో స్వార్థం ఉన్నట్లే లెక్క. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను. ఆడపిల్లలు ఎవరికీ ఎందులోను తీసిపోరు. మీకు ఎవరి ప్రేమా అవసరం లేదు. మీరే పదిమందికి ప్రేమను పంచగలరు. బిడ్డకు తల్లిగా, తోబుట్టువులకు సోదరిగా, భర్తకు భార్యగా మీరే అందరికీ ప్రేమను పంచగలరు. అటువంటి మీరు ఎవరి ప్రేమనో ఆశించి, అవతలి వారికి లోకువ కాకండమ్మా. వారి స్వార్థానికి బలవ్వకండి. మీ ప్రేమను పొందే అదృష్టం అవతలి వారికి లేదని బాధ పడండి. అంతే తప్ప మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదని మీ మీద మీరే సానుభూతి పెంచుకోకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కన్నవారికి, మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకునే వారికి మీ ప్రేమను పంచండి. మీతో పాటుగా వారిని కూడా సంతోషపెట్టండి. మీ.. ఎస్పీ జగదీష్
Super, chaalaa baaga chepparu..
ReplyDeleteThank you ma...
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletevery good post "FACTS"
ReplyDeleteThank you andi...
Delete