Pages

Tuesday, April 8, 2014

అవతార్‌ సినిమాకి రామాయణం ఏ విధంగా ప్రేరణ కలిగించింది? ఒక విశ్లేషణ

    'టైటానిక్‌' సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌' సినిమా 2009 లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాలకు కూడా ఇంగ్లీష్‌ పేర్లు పెడుతుండగా ఒక హాలీవుడ్‌ చిత్రానికి భారతీయ భాషలో అందునా సంస్క ృత నామం 'అవతార్‌'ని పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అవతార్‌ సినిమాకు భారతీయ పురాణమైన 'రామాయణం' ప్రేరణ అని ప్రకటించాడు. దానితో రామాయణ కథనే అవతార్‌గా రూపొందించారని, భారతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాని సినిమా విడుదల అయ్యాక అందులో రామాయణ కథ లేకపోవడంతో భారతీయులు కొంత నిరాశ చెందారనే చెప్పాలి. రామాయణాన్ని యధాతథంగా తెరకెక్కించక పోయినా, ఆ కథలో ఉండే కొన్ని అంశాల్ని ఈ సినిమా కథలో దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నాడనే చెప్పాలి. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆయా అంశాల గురించి ఒక చిన్న విశ్లేషణని నాకు తోచినంత వరకు మీతో పంచుకుంటున్నాను.

    'అవతార్‌' సినిమా కథకు వస్తే, భూమికి ఎంతో దూరంలో ఉన్న 'పండోరా' అనే గ్రహం మీద ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి భూమి మీద నుండి కొందరు మనుషులు బయలుదేరి వెళ్ళి, అక్కడ నివాసం ఉండే 'నావి' అనే జాతి ప్రాణుల్ని నాశనం చేయడానికి ప్రయత్నించి, విఫలమై తిరిగి భూమికి వచ్చేయడం అనేది ప్రధాన కధాంశం.

    ఈ సినిమాలో కథానాయకుడు అంగ వైకల్యం ఉన్నవాడు. నడవలేడు. కాని, బ్రెయిన్‌ మేపింగ్‌ అనే ప్రక్రియ ద్వారా పండోరా గ్రహం మీద ఉన్న నావి జాతి ప్రాణాల్లాంటి శరీరాల్లోకి కథానాయకుని ఆత్మని పంపిస్తారు.  ఈ విధానం మన పురాణాల్లోని మహా విష్ణువు అవతార సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఒక సారి ఆ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అతనికి అంగవైకల్యం ఉండదు. అందరిలాగానే నడవగలుగుతాడు, ఎగరగలుగుతాడు. ఇక్కడ వైకల్యం అంటే మనసుకి కాదు, శరీరానికి మాత్రమే అని చూపించాడు దర్శకుడు. మన కర్మకు తగినట్టుగా ఇపుడున్న ఈ శరీరం శాశ్వతం కాదు. కర్మఫలం పూర్తి కాగానే, దానికి తగ్గ మరో శరీరం మనకు ఇవ్వబడుతుంది. భూమిమీద ఉండే మానవులతో పాటు ప్రతి జీవి కూడా భగవంతుని అవతారమే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడు సర్వాంతర్యామి. కాని అతని ఆత్మ ఏదైతే ఉందో అదే భూమిమీద జీవిగా ఉద్భవిస్తుంది. ఈ లోకంలో తన పని పూర్తి కాగానే తిరిగి తన నివాసానికి, స్వస్థితికి చేరిపోతుంది. కాని భూమి మీద ఉన్నంత కాలం, ఇదే దేహం నిజమని భావిస్తూ, రకరకాల పనులు (కర్మలు) చేస్తూ ఉంటాము. అవి పూర్తయిపోగానే, అవతారం చాలిస్తాము. ఇదే భావనని, అవతార్‌ సినిమాలో దర్శకుడు తన ప్రతిభ ద్వారా స్పేస్‌ షిప్‌లోని కథానాయకుడి ఆత్మని నావి జాతి శరీరంలో ప్రవేశపెట్టడంగా చూపించాడు. అందుకే ఈ సినిమాకి అవతార్‌ అని పేరు పెట్టాడు. రామాయణంలో రాముడిని కూడా మహా విష్ణువు అవతారంగానే మనం భావిస్తాము. అందుకే ఈ పేరు సార్థకమైంది.

    ఇక సినిమాలో ప్రధాన విషయానికొస్తే, 'నావి' జాతి ప్రాణులు ప్రకృతికి దగ్గరగా జీవించే వారు. వారికి పెద్ద తోక కూడా ఉంది. వారి పాత్ర చిత్రణ రామాయణంలో కనిపించే వానర జాతికి దగ్గరగా ఉంటుంది. వానరులు అంటే సంస్క ృతంలో నరులేనా? అని అర్థం. లేదా నరులు కాని వారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నావి జాతి వారు తమ తోక సహాయంతో ప్రకృతికి అనుసంధానమవుతారు (కనెక్ట్‌ అవుతారు). అక్కడ ఉండే చెట్టు, చేమలు, జంతువులు, మన పురాణాల్లోని గరుడ పక్షుల్ని పోలి ఉండే పక్షులతో కూడా తమ తోకతోనే సంభాషిస్తారు. తమ మనసులో ఏ భావం అనుకుంటారో మిగతా ప్రాణులు కూడా ఆ విధంగానే స్పందిస్తాయి.

    ప్రకృతితో ఇంత సాన్నిహిత్యం కేవలం రామాయణంలో మాత్రమే కనిపిస్తుంది. సినిమా ఆఖరున నావి  జాతి అంతమయ్యే పరిస్థితి ఏర్పడినపుడు ఆ గ్రహం మీద ఉండే ప్రతి జీవి కూడా యుద్ధానికి సన్నద్దమై, నావి జాతికి అండగా నిలిచి యుద్దం చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన సహకారం రామాయణంలో రాముడికి లభించడం చూడవచ్చు. ప్రపంచంలో మరే జాతి చరిత్రలో కూడా కథానాయకుడికి ప్రకృతి అంతా సహకరించడం చూడలేము. రాముడు అడవికి వెళ్ళిన తరువాత అక్కడ ఉండే అన్ని ప్రాణులు రాముడి ఆశ్రమం సమీపంలో తమ సహజ వైరాన్ని మరచి ఎంతో ప్రేమగా ప్రవర్తించేవట. సీతాపహరణం జరిగినపుడు జటాయువు అనే పక్షి రావణుడితో యుద్దం చేసింది. వారధిని నిర్మించేటపుడు ఉడుత చేసిన సహాయం కూడా ప్రపంచ ప్రసిద్దమైనదే. రామ రావణ యుద్దంలో వానరులు, ఎలుగుబంట్లు కూడా రాముడి తరపున పోరాటం చేసాయి. అంటే రామునికి సహాయం చేయడానికి ప్రకృతి యావత్తు కదలివచ్చింది. ఇది మనకు పైకి చిన్న విషయంలా కనిపించవచ్చు గాని, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, యోగులు, సత్పురుషులు తమ ఆలోచనలతో, తమ మానసిక బలంతో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలరనే విషయం తెలుస్తుంది.

    మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతి నుండి ఏ విధంగాను అతడు వేరు కాడు, అలా వేరుగా ఉండి అతడు జీవించలేడు కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండడం నేర్చుకోవాలి. అపుడే ప్రకృతి నుండి అతనికి సహకారం లభిస్తుంది. జీవితం సుఖమయమవుతుంది. అంతే గాని, అభివృద్ధి పేరుతోను, వ్యాపారం పేరుతోను ప్రకృతిని తన ఇష్టానుసారంగా కొల్లగొట్టి, మిగిలిన జంతువులన్నింటిని కేవలం తనకు ఆహారం అందించే వస్తువులుగానే భావించి, వాటిని ఆహారంకోసమే పెంచి, చంపడం ప్రకృతి ధర్మానికి విరుద్దమే అవుతుంది. అటువంటి ధర్మం తప్పి ప్రవర్తించే జీవులకి ప్రకృతి నుండి ఎటువంటి సహాయం అందదు సరికదా, అటువంటి వాటిని వదిలించుకోవడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అందుకే నేడు మనం ఎదుర్కొంటున్న కరువులు, తుఫానులు, సునామీలు,  భూకంపాలు తదితరాలన్నీ మానవ జాతి నిర్మూలనకు ప్రకృతి చేసే ప్రయత్నంలా అనిపిస్తున్నాయి. ఎప్పటికైనా మనం నేర్చుకోవలసిన ఈ అంతర్గత సూత్రాన్ని, ప్రకృతితో మానవుడికి గల అనుబంధాన్ని రామాయణ మహా కావ్యం ఆవిష్కరిస్తుంది. అయితే సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని మన కంటే ముందుగా పాశ్చాత్యులు అర్థం చేసుకుని, దాన్ని సినిమా రూపంలో తిరిగి మనకే చెబుతుంటే కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలని, మన కన్నా ఎక్కువగా ఇతర దేశీయులే బాగా అవగాహన చేసుకుంటున్నారు. వాటి లోతుల్ని, భావాల్ని తరచి చూస్తున్నారు. మనమేమో వాళ్ళు వదిలేసిన ఎండమావుల వెంట పరుగెడుతున్నాం. ప్రకృతి అంటే కేవలం మనం వాడుకుని వదిలేసే ప్రాణం లేని బొమ్మ కాదని, ప్రకృతితో మనం ఎపుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలని మన ధర్మం బోధిస్తుంది. ఈ ధర్మం విశ్వజనీనమైనది. సర్వ మానవాళి ఆచరించదగినది. ధర్మాన్ని రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత:

5 comments:

 1. Sir, mee sonthagaa rayachhu kadhaa..
  Deeni reference link TV9 telugu avatar ani youtube lo search cheyandi.

  meeru aa video chuse rasaarani telusthundhi.

  But copy chesinaa ref link ivvadamu maruvakandi.

  Copy rayudalani vethukaadaaniki memu eppudinaa sidhhame.

  ReplyDelete
  Replies
  1. Ayya mee peremito kuda cheppakunda copy gurinchi matladutunnaru. Nijam anedi eppudu okela untundi. Nenu Ippudu rasindi purthiga na alochane
   Copy kotti blogulu rayalsina paristitilo nenu lenu. Oka vela meeru cheppindi nijame ayina naku santoshame. Endukante na alochana idi varake okariki vachinanduku. Cheppinanduku dhanyavafamulu.

   Delete
 2. ఒకరి ఆలోచనలు ఒకరు కాపి కొట్టడం అని ఎందుకు అనాలి ? ఆ టీ.వి 9 వాళ్లకు వచ్చిన ఆలోచనలే ఇతరలుకు రాకుడదని రూలు ఏమి లేదు కదా ?

  ReplyDelete
 3. నాకు బ్లాగులు రాసే అలవాటు లేదు . కాని బ్లాగులు చదివే అలవాటు ఉంది. అవతార్ సినిమా గురించి నాకు ఒక ఆలోచన అది చూచిన 4 నెలలకు వచ్చింది. అవతార్ సినిమా లో భూలోక వాసులు చూపిన వాళ్ళు "ఐరోపా దేశాల వాళ్ళు" వారి తత్వం ప్రకృతి పిండి పిప్పి చేసే తత్వం. అవతార్ సినిమాలో పాంటోర గ్రహ వాసులు "భారత దేశం వాళ్ళు" ప్రకృతిని పూజించే తత్వం ఉన్న వాళ్ళు. భారత దేశానికి వచ్చిన ఐరోపా వాళ్ళు ప్రకృతి ని పూజించే మనుషులను చూసి ఒక వింత అనుభూతి పొంది. "మన బలాలు బలహీనతలు పసికట్టి". ఇదే మాట ఆ సినిమాలో కూడ పెట్టారు. మన బలం మన సనాతన ధర్మం (ప్రకృతిని ఆరాధించే ధర్మం) మన బలహీనత కూడా అదే సనాతన ధర్మం. భారత దేశం లో ఉన్న ప్రకృతిని పిండుకోవాలంటే ఆ రోజుల్లో మన దేశం బలవంతమైనది కాబట్టి రుజువు అనే వితండ వాదం ప్రచారం మొదలు పెట్టారు. కొద్దో గొప్పో వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద బల ప్రయోగం చేసి చంపి వేసారు. అదే విషయాన్ని ఆ "అవతార్" సినిమాలో కూడా చూపించారు. అక్కడ గ్రహాలూ (భూమి, పాంటోర) బదులు దేశాలు పెడితే చాల వివాదాలు రావచ్చు అని అతి తెలివి ప్రదర్శించాడు ఆ సినిమా కథకుడు. కాని మన అమాయక భారతియ్యులు మాత్రం ఆ సినిమాను భహు శ్రద్ధ వీక్షించారు.

  ReplyDelete
 4. ఎందుకీ పరశోధన ? పరి శోధన పర శోధనే. "స్వ"శోదనే ఉత్తమ శోధన. పరిశొధన "షో"-"ధన" నాసా,ఇస్రో, ICMR మొదలుగునవి అన్ని "షో" "ధన" కేంద్రాలే.

  ReplyDelete