Pages

Thursday, February 13, 2014

ప్రేమంటే ఏమిటంటే... (కాముకుల పండుగ జరుపుకోవలసిన ఆగత్యం భారతీయులకు లేదు.)

         సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు మారని అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. జీవనం సజావుగా సాగడానికి, జీవన పరంపర ఎడతెగకుండా నడవడానికి కారణం ప్రేమ. ఏ దేశ చరిత్ర చూసినా, ఏ భాషలో కావ్యం పరిశీలించినా ప్రేమ లేకపోతే అది సంపూర్ణం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ వల్లనే ప్రపంచ చరిత్రలు తారుమారయ్యాయి. మొదటి ప్రపంచ యుద్దం మొదలవడానికి ఆస్ట్రియా రాజు ప్రేమ వృత్తాంతమే కారణమని కొందరి అభిప్రాయం. ఆనాటి కాళిదాసు నుండి నేటి దేవదాసు వరకు తమ కథలు, కావ్యాల నిండా ప్రేమ గుబాళింపులు నింపిన వారే. ఆమాట కొస్తే కావ్యాలలో ప్రేమ లేకపోతే ఉప్పు లేని కూరలాగా అవి చప్పగా ఉంటాయి. అందుకే నాటి నుండి నేటి వరకు సినిమాలలో సింహభాగం ప్రేమ చుట్టూ తిరిగే కథలే వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. ఆయా నటీనటులు, సన్నివేశాలు, నేపధ్యాలు మారవచ్చును గాక - మూల కథ మాత్రం ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతర్లీనంగా హృదయాల్ని రంజింపచేస్తూనే ఉంటుంది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆది ప్రేమికులు కూడా. పార్వతి తాను వలచిన శివుని వివాహమాడడానికి ఎన్నో సంవత్సరాలు వేచి చూసింది. ఆఖరికి శివుని త్రినేత్రాగ్నికి భస్మమైన మన్మధుని సాక్షిగా పార్వతీ కళ్యాణం జరిగింది. రాధా మాధవుల ప్రేమ కథ జగమంతా తెలిసిందే. సీతా రాముల అన్యోన్యత, వారి హృదయాల్లోని ప్రేమ తత్వం ఇప్పటికీ ఎప్పటికీ సమాజానికి నమూనాగా ఉంటుంది. వనవాస సమయంలో ఎన్నో కష్టాలు ఉంటాయని తెలిసినా కూడా, రాణి వాసపు సుఖాలు అసలు ఉండవని అర్థమైనా కూడా, కష్ట సమయంలో పతి వెంటే నడిచివెళ్ళిన సీతమ్మ కంటే మంచి ప్రేమికురాలు మనకు ఎక్కడ కనిపిస్తుంది. శకుంతల, దుష్యంతుల ప్రణయ వృత్తాంతమే లేకపోతే, కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలం మనకు దక్కేదే కాదు. రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి ఆయన కూతురు దేవయానికి ప్రేమ ద్వారా ఎర వేసి, ఆ విద్యను సాధించిన కచుని చరిత్ర కూడా మనకు తెలిసిందే. ఇలా మన సాహిత్యం నిండా ప్రేమ సువాసలు వెదజల్లుతూనే ఉంటాయి.

    ఆధునిక కాలంలో ప్రేమ కూడా ఒక వ్యాపార వస్తువైపోయింది. ప్రేమికుల రోజు కూడా త్వరలో వచ్చేస్తోంది. ఎన్నో దిగుమతి చేసుకున్న పండుగలలాగే ఈ రోజు కూడా మంచి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారులందరూ పోటీ పడుతున్నారు. ఎటుచూసినా ప్రేమికుల రోజు వ్యాపార ప్రకటనలు, ప్రత్యేక బహుమతులతో చెలికాని/ చెలికత్తె మనసుదోచుకోవడానికి మేమూ సాయం చేస్తామంటే ప్రకటనలు ఊదరగొడుతున్నారు. అసలు ప్రేమికులే లేని వాళ్ళు 'వట్టి వెధవాయిలోయ్‌' అనుకొనేట్టుగా చేస్తున్నారు. యువతీ యువకులు కూడా ఈ 'ప్రేమ మైకం'లో పడి ఆ రోజు ఖరీదైన బహుమతులు, పువ్వులు కొనడానికి, తమ నెచ్చెలులకు కానుకగా ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇదంతా వ్యాపారుల, కార్పొరేట్‌ సంస్థల మాయాజాలం. జనాన్ని కైపెక్కించి తమ పబ్బం గడుపుకోవడం మాత్రమే ఇందులో కనిపిస్తుంది.

    నిజమైన ప్రేమ కానుకలు ఆశించదు. విలువైన కానుకలు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. అలా వచ్చే ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు కూడా. కానుకలు ఇచ్చిపుచ్చుకున్నంత సేపు మాత్రమే నిలబడేది వ్యాపారం అవుతుందే గాని ప్రేమ ఎప్పటికీ కాదు. ప్రేమంటే హృదయాంతరాలలో నుండి అప్రయత్నంగా పొంగుకొచ్చే ప్రవాహం. దానికి కాల, స్థల పరిమితులు ఉండవు. ప్రేమ మనసులో ఎప్పటికీ గుబాళిస్తూనే ఉంటుంది. అంతే కాని, సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగ లాగా, చచ్చిపోయిన వాళ్ళకి పెట్టే తద్దినంలాగా, ప్రేమికుల 'దినం' అంటూ ఒకటి ఉండదు. ప్రేమ నిత్య నూతనమైనది. ప్రేమించిన వారికి, ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రతి రోజు పండుగే. ఏదో ఒకరోజు గుర్తుకు తెచ్చుకుని, తరువాత రోజు మరొకరి వెంట పడితే అది లవ్వు కాదు - కొవ్వు.

    ఇంకా చెప్పాలంటే, యువతీ యువకుల మధ్య యవ్వనకాలంలో అంకురించేది నిజమైన ప్రేమ కానే కాదు. అది కేవలం హర్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఆకర్షణ మాత్రమే అంటారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు. లేత ప్రాయంలో ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియక, స్నేహితుల ప్రభావం వల్లనో, సినిమాల్లో, సాహిత్యం చూపించే యువతీ యువకుల సాన్నిహిత్యాన్ని మాత్రమే ప్రేమ అనుకుంటూ తప్పటడుగులు వేసే యువతకు కొదవే లేదు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా అటువంటివి ప్రోత్సహిస్తూ ఉండడం వల్లనో, లేదా తెలిసినా ఏమవుతుందిలే అనే ధీమా వల్లనో ఈ ప్రేమ రుగ్మత సమాజంలో అంటు వ్యాధిలా వ్యాపిస్తూనే ఉంది. యుక్త వయసులోని పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంది. సైకాలజీ ప్రకారం, ప్రేమలో ఎన్నో రకాలున్నాయి. ప్రేమనేది యువతీ యువకుల మధ్యనే అంకురించనక్కర్లేదు. భార్యాభర్తల మధ్య జీవితాంతం ఒకరిపై ఒకరికి ఉండేది కూడా బాధ్యతతో కూడిన ప్రేమ కూడా. తల్లిదండ్రులకు పిల్లలపై ఉండేది మమకారంతో కూడిన ప్రేమ. పిల్లలకు అమ్మానాన్నపై ఉండేది అనురాగంతో కూడిన ప్రేమ. లోకంలో ఇన్ని రకాల ప్రేమలుండగా వెర్రి వేషాలు వేసేది మాత్రమే ప్రేమ అని లోకాన్ని నమ్మిస్తున్నారు. వంచన చేస్తున్నారు.

    ఇవన్నీ కాకుండా మరో రకం ప్రేమ కూడా ఉంది. అది ఎల్లలు ఎరుగనిది, అనంతమైనది. ఒకరి నుండి ఏదీ ఆశించకుండా, ప్రతిఫలం తీసుకోకుండా, కేవలం ప్రేమను పంచేవాళ్ళు కూడా ఉంటారు. వారిది పవిత్రమైన ప్రేమ. సూర్యుడు ఏవిధంగా అయితే ఎటువంటి బేధం లేకుండా అందరికీ వెలుగును, జ్ఞానాన్ని పంచుతాడో, చంద్రుడు ఏవిధంగా అయితే ప్రాణులన్నింటికీ తరతమ బేధం లేకుండా తన అమృత కిరణాలు కురిపిస్తాడో, అదే విధంగా తపశ్శక్తి సంపన్నులైన రుషులు, యోగులు తమ చుట్టూ ఉన్న వారికి ప్రేమను పంచుతారు. ఆ ప్రేమ నిష్కళంకమైనది. ఆ ప్రేమ అనుభవించే వారికే గాని బయటి వారికి తెలియదు. ఆ ప్రేమ మరింత విస్తృతమైనపుడు కేవలం మానవాళిని మాత్రమే కాకుండా విశ్వంలో ప్రతి ప్రాణిని ప్రేమించే తత్వం వస్తుంది. మహర్షుల సన్నిధిలో పులులు, సింహాలు సైతం తమ సహజ ప్రవర్తనని మాని, సాధు జంతువులుగా ప్రవర్తిస్తుంటాయి. అందరినీ బెంబేలెత్తించిన మద గజం సైతం గౌతమ బుద్దుని ప్రేమ పూర్వక భావానికి లొంగిపోయి, ఆయన ముందు మోకరిల్లింది. మనసులో అటువంటి ప్రేమను నింపుకున్న వారికి లోకంలో శత్రువులనే వారే ఉండరు. లోకాన్ని సంపదతో, కండబలంతో, అస్త్రశస్త్రాలతో భౌతికంగా జయించడం కన్నా, ప్రేమ ద్వారా అందరి మనసుల్ని గెలుచుకున్న వాడే నిజమైన లోక విజేత అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

    కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు తన రాజనీతిలో 'రాజు ప్రజల్ని కన్నబిడ్డల వలే ప్రేమించమని' చెప్పాడు. నేటి నాయకుల్లో లోపించింది అదే. ఒక నాయకుడు తన అనుచరుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటే, అవినీతికి తావుండదు - రాజ్యం సుభిక్షమవుతుంది. ఒక వ్యక్తి సమాజాన్ని ప్రేమిస్తే, ఆ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాడు. దానివల్ల కుల, మత, ప్రాంతీయ, భాషా బేదాలు సమసిపోతాయి. ఒక గురువు తన వద్ద విద్య నేర్చుకునే వారిని కన్న బిడ్డల్లా ప్రేమిస్తే, పిల్లలు నేర్చుకునే విద్య సార్థకమవుతుంది. అందుకే పరమహంస యోగానంద 'ప్రేమ మాత్రమే' పంచమని తన శిష్యులకు ఉద్భోదించాడు.

    భారతీయులకు ప్రేమ గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా వారు ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచుతూనే ఉన్నారు. కాని దురదృష్టవశాత్తూ, నేటి భారతీయ యువత తమ ఉజ్వల పరంపరని మరచిపోయి, పాశ్చాత్య పద్దతుల్ని, వారి అనాచారాల్ని ప్రచారం చేసే వారికి సులభంగా లొంగిపోయి, కాముకత్వాన్ని ప్రేమగా పొరపడుతున్నారు. నిజానికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు - పాశ్చాత్యుల కాముకుల రోజు. మహిళను ఆట వస్తువుగా, అంగడిబొమ్మగా పరిగణించే సమాజం నుండి వచ్చే పెనుపోకడలను వంటపట్టించుకోవలసిన అవసరం భారతీయ యువతకు లేదు. ప్రేమ అనేది శరీరానికి సంబంధించినది కాదు - మనసుకి సంబంధించినది. దానికోసం ప్రత్యేకంగా ఒక 'దినం' జరుపుకోవలసిన అసవరంలేదు, ఇది మంచిది కూడా కాదు. ప్రేమ బేహారుల వలలో పడకుండా నిజమైన ప్రేమని పంచితే భూమిపైనే స్వర్గాన్ని చూడవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.