Pages

Friday, October 15, 2010

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తినిపించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది?

పిల్లలకి దసరా సెలవులు వచ్చేసాయి. ఆటలు, పాటలు, కేరింతలు, తుళ్ళింతలు... అమ్మమ్మ ఇంటికి ప్రయాణాలు.... కొత్త స్నేహితులు, పాత బందువుల పలకరింతలు... నిజానికి శెలవులొచ్చాయంటే పిల్లలకంటే ఎక్కువ ఆనంద పడే వాళ్ళు ఎవరుంటారు? చిన్నతనంలో శెలవుల్లో చేసిన అల్లరి, కోతికొమ్మచ్చి ఆటలు ఎవరైనా మరచిపోగలమా? కొత్త కొత్త పిండివంటలు, కొత్త బట్టలు, కొత్త బొమ్మలతో, ఆత్తయ్యలు, మావయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, తాతమ్మలు, తాతయ్యలతో ఎంత సందడిగా ఉంటుంది? ఇంతటి అపురూపమైన ఆనందాలు పిల్లలకు దక్కకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది ఇప్పటి స్కూళ్ల పరిస్థితి చూస్తుంటే...

అసలు విషయానికి వస్తే మా పెద్దమ్మాయి సత్య రెండవ తరగతి చదువుతుంది. దసరా శెలవులిచ్చారు. తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మగారింట్లో దింపేసి వచ్చాను. నాలుగురోజులు అక్కడ సరదాగా గడిపేరు. నిన్ననే అక్కడి నుండి తీసుకువచ్చాను. తీసుకు వచ్చినప్పటి నుండి దాని గదిలోకి దూరిపోయి మరలా కనబడలేదు. నేనూ పని వత్తిడిలో పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అది కనబడక, దాని అల్లరి చెవిలో వినబడక ఇల్లంతా బోసిపోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళి చూద్దును కదా.... చుట్టూ చిందరవందరగా పుస్తకాలతో, పెన్ను, పెన్సిళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అల్లరి చేస్తూ ఉండే లక్ష్మీదేవిలా ఉండే మా సత్య అపర సరస్వతి అవతారంలా కనిపించింది. ముఖం పీక్కుపోయి ఉంది. చాలా సీరియస్‌గా ఏదో రాసేసుకుంటా ఉంది. నాకు తండ్రి మనసు ఆగలేదు. ఆడుకోకుండా ఇప్పుడు కూడా వర్క్‌ ఏమిటి నాన్నా. ఇంకా శెలవులు ఉన్నాయికదా. రేపు రాసుకుందువుగానిలే అన్నాను. వెంటనే సత్య నా వైపు ఓ సీరియస్‌ లుక్‌ ఇచ్చి, మరలా రాసుకోవడం మొదలుపెట్టింది. కాసేపు ఉన్నాకా, బేల ముఖం పెట్టి, ''నాన్నా... నాకు చాలా హోమ్‌వర్క్‌ ఉంది. చాలా చాలా ఎక్కువ. అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను కదా... అందుకే పూర్తి కాలేదు'' అంది. ''ఎంత ఉంది నాన్నా, నన్ను చూడనివ్వు'' అని దాని స్కూల్‌ డైరీ తీసుకుని చూసాను. గుండె ఆగినంత పనయ్యింది.



''ఇంగ్లీష్‌: ఎ నుండి జడ్‌ వరకు అక్షరాలు, ప్రతి అక్షరానికి ఒక్కొక్క పదం చొప్పున అన్ని లెటర్స్‌కి రాయాలి.

తెలుగు: అ నుండి ఱ వరకు అన్ని అక్షరాలు, క నుండి ఱ వరకు అన్ని గుణింతాలు, క నుండి ఱ వరకు అన్ని వత్తులు.

హిందీ: అ నుండి జ్ఞ వరకు అన్ని అక్షరాలు, క నుండి జ్ఞ వరకు అన్ని గుణింతాలు,

మేథ్స్‌: 1 నుండి 1000 వరకు అన్ని అంకెలు, 1 నుండి 20 వరకు అన్ని టేబుల్స్‌

సైన్స్‌ & సోషల్‌: 3,4,5 లెసన్స్‌ నుండి అన్ని క్వశ్చన్స్‌ & ఆన్సర్స్‌ మరియు ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌

జి.కె.: ఇప్పటి వరకు చెప్పిన అన్ని క్వశ్చన్స్‌ ''

ఇవన్నీ నోట్స్‌ రాసి చూపించాలట. దాని హోమ్‌వర్క్‌ ఏమిటో చూసిన తరువాత నాకిక నోటిమాట రాలేదు. ''నాన్నా, నాకు చెయ్యి నొప్పిగా ఉంది. రాయలేకపోతున్నాను'' అంది. జాలిగా నాకు చెయ్యి చూపించింది. ప్రొద్దుట నుండి ఏకథాటిగా రాయడం వల్ల దాని లేత అరచెయ్యి ఎర్రగా కందిపోయి ఉంది. నాకయితే ఒళ్ళు మండిపోయింది. టీచర్‌ని తిడదామని ఫోన్‌ చేసాను. ఆ అమ్మాయి ఫోన్‌ కట్టేసి ఉంది. సరే నేను చూసుకుంటాను అని చెప్పి కొంత హెAమ్‌ వర్క్‌ నేను సొంతంగా ఇచ్చి, అది మాత్రమే చెయ్యమని చెప్పి మా అమ్మాయిని ఊరుకోబెట్టాను. ఈ మాత్రం దానికి శెలవులివ్వడం ఎందుకో? పండుగ పేరు చెప్పి బండెడు హెAమ్‌వర్క్‌లిచ్చి పిల్లల ఆనందాన్ని కాలరాయడమెందుకో?

ఇంత దారుణమైన హోమ్‌ వర్క్‌ నా చిన్నతనంలో ఎప్పుడూ నేను చేసినట్టు గుర్తులేదు. నేనూ ఒక కాలేజ్‌ సెక్రటరీ / కరస్పాండెంట్‌ అయినప్పటికీ మా ప్రిన్సిపాల్‌కి, లెక్చరర్స్‌కి ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాను. పిల్లల్ని అనవసర హింసకు గురిచేయకండి. వారిలో సహజసిద్దంగా ఉండే నేర్చుకోవాలని అనే తపనని చిదిమేయకండి. మానసికంగా / శారీరకంగా ఒత్తిడికి గురిచేస్తే ఫలితాలు పాజిటివ్‌గా రావడం మాట అటుంచి నెగిటివ్‌గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ స్వేచ్చగా నేర్చుకోవాలి. స్వేచ్చగా ఆలోచించగలగాలి. ఎప్పుడూ పుస్తకాల్లో ఉండే విషయాల్నే బట్టీ పట్టి వాటిని మాత్రమే నేర్చుకుంటూ ఉంటే మనిషి ఆలోచన ఇక అక్కడితో ఆగిపోతుంది. మన పూర్వీకులు కూడా అలాగే చేసి ఉంటే, ఒక నిప్పు కనిపెట్టడం, ఒక చక్రం కనిపెట్టడం, ఒక న్యూటన్‌ గమన సూత్రం, ఒక ఐన్‌స్టీన్‌ రిలేటివ్‌ థియరీ వంటివి మనకు అందకుండా పోయేవి. కొత్తగా కనిపెట్టబడేవి ఇంతకు ముందు పుస్తకాల్లో లేనివే కదా. అంటే పుస్తకాలు చదవాలి. తరువాత ఆలోచించాలి. పుస్తక పరిథుల్ని దాటగలగాలి. అప్పుడే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు సాధ్యమవుతాయి. అలా కాకుండా అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టాలని ప్రయత్నిస్తే, జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. ఇదే విషయాన్ని రేపు ఆ స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడుదామని సిద్దమయ్యాను.

9 comments:

  1. completely agree with you... vallaki 3-idiots cinema choopinchandi konthanna artham avuthundhemo.

    ReplyDelete
  2. In India specially in AP, education means, keep the information in text books into brains and dump them on the paper. The 'kid' in kids are gone long back because of intense competition.

    ReplyDelete
  3. Jagadeesh Jee, Sorry for typing in english.

    I can relate to your child. I was the same girl in childhood.I studied in an english convent.You won't believe me after 2nd class, that too in holidays, the teacher gave so much homework to write all matter in text books taught so far for 50 times !

    No one could complete that homework,but they went to school.I remembered the teacher would beat students a lot if they didn't do HW, so I was very afraid to go to school ( Though I was first in class).

    For 1 month, I did not go to school and lied to my parents that I went.I used to spend my time in an neighbour aunty's home,begging her not to tell my parents.

    She let me stay in her house trying to let my fears go, but day by day my fears only increased, so she thought she must tell them.My parents came to know and asked me coolly why I'm afraid of school.I told them and cried. They talk to my teacher.

    I also told the teacher who asked me, why I bunked classes. She too started laughing, and said no one did the homework, and she did not beat anyone for it, 'coz she too knows it's very hard. But then,imagine the torture we all faced out of fear those 10 days regarding the pending homework. Isn't it very harsh ?

    If the convent education system was like that,20 yrs back, when I was in 2nd class, no wonder it's the same or worse now.

    Most parents like to see their kids busy with homework or studies these days.My neighbour makes her 7 yr old study for 5-6 hours a day, no playing for him ! He has to study even in summer holidays, for hours and hours !!! I began to dislike parents of this generation, 'coz I saw many others like that.

    Glad to know you're a kind parent.Sorry for a long comment.

    ReplyDelete
  4. పిల్లల చదువు విషయంలో మీలాగా ఆలోచించే తల్లిదండ్రులు ఇంకా కొందరు వున్నారని తెలిసి ఆశ్చర్యానందాలు కలిగాయండి.

    నా స్పందన ఉమాగారిదిలాంటిదే. మాకూ ప్రతి దసరా, సంక్రాంతి సెలవుల్లో త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షాపత్రాలు, తప్పుతప్పు, వాటికి జవాబులు మూడులేదా ఐదుసార్లు వ్రాయాలనిచ్చేవారు. మేం మటుకు పరీక్షలయిపోయిన రోజునుండే మొదలుపెట్టి ఒకటి-రెండురోజుల్లో గీకిపడేసేవాళ్ళం. ఇంటికివచ్చిన తాతయ్యలు, చుట్టాలు, "ఏంట్రా, భారతం రాస్తున్నారా?" అని అడిగేవాళ్ళు. కానీ మేం కొంచెం ఎంజాయ్ చేస్తూనే వ్రాసేవాళ్లం - ఎందుకంటే తెలీనివాటికి జవాబులు కనుక్కోవడం మాకే హెల్ప్ చేస్తుందిగా.

    పరిమితంగా, అంటే రోజుకు అరగంటా గంటవుండే హోమ్‌వర్క్‌‌కి నేను మద్దతిస్తా.

    ReplyDelete
  5. @ ఉమ గారి ఆవేదన అక్షర సత్యం. చిన్నప్పుడు అంతటి వత్తిడి భరించలేని చిన్నారులు, పెద్దయ్యాక స్వంత ఆలోచన లేనివాళ్ళుగా తయారవుతారు. ప్రతీదీ మెటీరియలిస్టిక్ దృక్పధంతోనే చూస్తారు. మానవ సంబంధాల విలువల పట్ల నమ్మకం కోల్పోతారు. ఈ పరిస్తితి మారాలని ఆశిద్ధాము.

    @ జే-బీ గారు... మితంగా వుండేది ఏదయినా స్వాగతించదగ్గదే.. పరిమితి దాటితేనే ఇబ్బంది. హోం వర్క్ విషయానికి కూడా అదే వర్తిస్తుంది. నేను కూడా చిన్నపుడు హోం వర్క్ చేసినవాడినే. కాని నాకు గుర్తున్నంత వరకు ఒక అరగంట లేదా గంటలో పూర్తయి పోయేది.

    @ అనానిమస్ గారు... పైన ప్రభుత్వంలో వున్నది అందరూ ఇడియట్స్ అయినప్పుడు వారికి మరలా 3 ఇడియట్స్ చూపిస్తే వచ్చే లాభం ఏమిటంటారు

    @ స్వప్న గారు... కృతజ్ఞతలు...

    ReplyDelete
  6. చాలా సంతోషమేసింది మీరు ఒక కాలేజీ కరస్పాండెంట్ అయ్యుండి ఇలా ఆలోచించగలుగుతున్నందుకు. మీ లాంటి వారందరూ కలిసి మీ అమ్మాయి స్కూలు ప్రిన్సిపాల్ ని కలిసి విన్నవించండి. కానీ ఫలితం ఉంటుందంటారా? ఎందుకంటే,హోంవర్క్ ఇవ్వాలి,పిల్లలు అల్లరి చెయ్యకుండా అలా టీవీ ముందు కూర్చుని రాస్కుంటే బాగుమంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా.

    ReplyDelete
  7. oops!!ఇప్పుడే చివరి పేరా మళ్ళీ చదివాను,ఇంతకీ ప్రిన్సిపాల్ ఏమన్నారు? మన విద్యా విధానం అనలైటికల్ థింకింగ్ ని ఎంకరేజ్ చేసేలా మారనంత వరకూ పాపం పిల్లలకి ఈ బాధ తప్పదేమో

    ReplyDelete
  8. హోమ్ వర్క్ ఎంత ఎక్కువిస్తే ,పిల్లల్ని ఎంతహింసించి వాల్ల మొహాల్లో నవ్వులు లేకుండా చేయగలిగితే అది అంత గొప్పస్కూల్ గా భావించే తల్లిదండ్రులున్న కాలమిది . ఏం చేద్దాం ? పిల్లలుగా పుట్టడమే వాళ్ళుచేసుకున్న పాపం .

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.