Pages

Tuesday, May 11, 2010

విశ్వ వర్ణన - కొన్ని సందేహాలు... సమాధానాలు.

విశ్వ వర్ణన - ఆధునిక పరిశొధనలకి, విష్ణు సహస్ర నామానికి పోలిక గురించి నాకు అనేకమంది అభినందనలు తెలిపారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కొద్దిమంది స్నేహితులు కొన్ని సందేహాలు కూడా అడిగారు. వాటిలో మొదటిది: విష్ణు సహస్ర నామంలో వర్ణించినట్టుగా విష్ణువు ప్రత్యేకంగా వుండడా? ఆయనకి ఒక రూపం అంటూ లేదా? అని. నిజమే విష్ణువు కి రూపం లేదు. ఆయన విశ్వ స్వరూపుడు. ఈ లోకంలోని ఏ రూపం తీసుకున్నా అది ఆయన రూపమే. ఏ పేరు పలికినా అది ఆయన నామమే. మన కంటికి కనబడని ఆ మహా శక్తికి ఒక రూపం అంటూ లేదు. మనం ఎలా ఊహించుకుంటే అలాగే దర్శనమివ్వగల మహాశక్తి రూపం. మన ఊహలకి అందని అనంత శక్తి స్వరూపం. ఆ మహా శక్తికే మనం విష్ణువు అని పేరు పెట్టుకున్నాము.

సహస్ర నామంలో వాసుదేవ అనే పదానికి అర్ధం ఇదే. "వాసనాత్ వాసుదేవస్య వాసితం భువన త్రయం.. సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే" అని వుంటుంది. ఎంత అద్భుతమయిన వర్ణన. మూడు లోకాల్లో వుండేది ఆయన రూపమే. ఏ లోకాన్ని తీసుకున్నా ఆయన రూపమే. అన్ని లోకాలూ ఆయన నివాస స్తానాలే. అలాగే అన్ని లోకాలు, సర్వ ప్రాణులు ఆయన అందే నివసిస్తూ వున్నాయి అని దీనర్ధం. ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలో వున్న ప్రతీ అణువూ ఈ విశ్వంలోని అణువులతో తయారయిందే. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. అలాగే ప్రతీ అణువులోనీ ఆ మహాశక్తి ప్రకటితమవుతుంది. ఏ మతానికి చెందిన వారయినా, ఏ కులానికి చెందిన వారయినా, అది ఏ ప్రాణి అయిన, ఏ మొక్కయినా, ఏ చెట్టయినా వాటన్నిటిలో వుండేది ఆ మహా విష్ణు స్వరూపమే. ఇక ఇందులో సందేహాలకు తావు లేదు. ఇలా ప్రతి దానిలోనూ, ఆఖరికి వీచే గాలిలోను, ప్రవహించే నీటిలోనూ, మండే అగ్నిలోనూ, నివసించే భూమిలోనూ ఆ పరమాత్మని చూడగలిగారు కాబట్టే, భరత భూమి ఆధ్యాత్మిక భూమి అయింది. అదే ఇప్పటి వ్యాపార నాగరికతలాగా నదులన్నిటినీ కలుషితం చేసేసి, పచ్చటి చెట్లని కొట్టివేసి, కొండల్ని పిండిచేసి, పీల్ఛే గాలిని కూడా విషంతో నింపేసి, మన చావుని మనమే కొనితెచ్చుకునేవాళ్ళుగా మన పూర్వీకులు వుండుంటే ఇప్పుడు మనం వుండే వాళ్ళం కాదనుకుంటాను. అది వేరే సంగతి.

ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో దేవుని గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఎక్కువ మంది చెప్పేది ఒకటే. దేవుడు ఒక పరలోకంలో (అదెక్కడుందో ఎవ్వరూ చెప్పరు. చెపుదామన్నా వాళ్ళకీ తెలియదు) ఒక బంగారు సింహాసనంపై కూర్చుని వుంటాడు. ఆయన మనిషి రూపం ధరించి వుంటాడు. తెల్లని గెడ్డంతో, బంగారు కిరీటం పెట్టుకుని వుంటాడు. ఇవీ వాళ్ళు చెప్పే వర్ణన. కానీ వైదిక సారస్వతంలో దేవునికి ప్రత్యేకించి రూపం లేదు. ఆ మహాశక్తిని మనం కళ్ళతో చూడాలేము. మనకున్న పంచేంద్రియాల జ్ణానం సరిపోదు. అంతకుమించిన బౌద్దిక జ్ఞానం కావాలి. అది తపస్సు లేదా ధ్యానం ద్వారా మాత్రమే సిద్దిస్తుంది.

ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది. అలాగయితే దేవుడి చిత్రపటాలు, ఈ విగ్రహాలు ఏమిటి? దేవుడు విశ్వరూపంలో వుండేట్టయితే, ఈ అందమయిన బొమ్మలెందుకు? ఇది రెండవ ప్రశ్న. అదీ నిజమే. ఇది గతంలో సంగతి. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. మహర్షులు దర్శించిన దానిని సామాన్య ప్రజలకు తెలియజేయాలి. మార్గం ఏమిటి? ఈ విశ్వం గురించి, ధ్యానం వారు దర్శించిన వున్నత తెజోమయ లోకాల గురించి సామాన్య ప్రజలకి చెప్పేదెలా? అది కూడా అందరికీ అర్ధమయ్యేలా చెప్పేదేలా? ఆ లోకం ఇలా వుంటుంది అని చెప్పేందుకు వాళ్ళ దగ్గర ఫోటోలు లేవు.. హబుల్ టెలెస్కోప్ అంతకన్నా లేదు. మరేమిటి మార్గం? అదికూడా చదువు రాని వాల్లకి కూడా అర్ధం కావాలి. మనకు తెలిసిన మనకు అర్ధమయ్యే పద్దతిలోనే ఆ వర్ణన సాగాలి. అలా పుట్టిందే ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహ రూపం. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్న దేవుళ్ళ రూపాల వెనుక చాలా పెద్ద కధే వుంది. అది యోగులకి, జిజ్ఞాసా పరులకి సులభంగానే తెలుస్తుంది. మనం ఇతర దేశాల వాళ్ళు చెప్పింది విని విని, మన దేశ జ్ఞానాన్ని మనమే చేతులారా పాడు చేసుకుని, వాళ్ళకి మానసికంగా బానిసల్లాగా బ్రతుకుతున్నాము. ఇవన్నీ చెప్పాలంటే అదో పెద్ద గ్రంధం అవుతుంది. అది చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. మరో టపాలో దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

1 comment:

Note: Only a member of this blog may post a comment.