ఇక హాష్టళ్ళలో పిల్లలు పడుతున్న బాధల విషయానికి వస్తే అవన్నీ రాయాలంటే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. పిల్లలకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఎన్నో పేరుగొప్ప కాలేజిలు వున్నాయి. నలుగురికి కూడా ఇరుగ్గా వుండే ఒక్కో గదిలో పదేసి మందిని కుక్కేయడం, అందరికీ ఒకే బాత్ రూం ఏర్పాటు చెయ్యడం వంటివే కాకుండా, వారికి కనీసం నాణ్యమయిన తిండి కూడా పెట్టకుండా, విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.
ఒకసారి కార్పోరేట్ కాలేజ్ హాష్టల్లో అడుగుపెడితే ఏ నేరమూ చెయ్యకుండా, సెంట్రల్ జైల్లో అడుగుపెట్టినట్టే. తెల్లవారు జామునే నాలుగ్గంటలకి జైలు సెంట్రి... సారీ... హాష్టల్ వార్డెన్ వచ్చి నిద్ర లేపుతాడు. 4:30 నుంచి స్టడి హవర్స్ వుంటాయి. ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయ్యడానికి కలిపి మద్యలో ఒక గంట కేటాయిస్తారు. ఆ తక్కువ టైంలోనే అన్ని కార్యక్రమాలూ కానిచ్చేయ్యాలి. విజయవాడలో ఒక కాలేజ్ లో అయితే ఆడ పిల్లలు పది మందికి కలిసి ఒకే ఒక గది, దానికి అటాచ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేసారట. పదిమందికి కాలకృత్యాలు తీర్చుకోవడనికి లేట్ అవుతుంది కాబట్టి అందరు కలిసి ఒకేసారి స్నానం చేసెయ్యండి, టైం కలిసి వస్తుంది కదా అని యాజమాన్యం జవాబు చెప్పిందట. మన ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు ఒకేసారి అలాంటి పరిస్తితి తట్టుకోలేక ఆ కాలేజ్ నించి పారిపోవడనికి ప్రయత్నిస్తున్నారు. నేను స్వయంగా అటువంటి పిల్లలతో మాట్లాడి, తెలుసుకున్న సంఘటనలనే రాస్తున్నాను. అసలే తెల్లవారు జాము,... చలి, దానికి తోడు చన్నీటి స్నానం, ఎలా వుంటుందో పరిస్తితి వూహించండి..
ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత... వుదయం 6 గంటల నుంచి "క్లాస్" లు మొదలవుతాయి. అంత పొద్దున్నే మ్యథ్స్, కెమిస్ట్రీ వంటి సబ్జక్టులు చెపుతారు. నిద్ర వస్తున్నా, బుర్రకి ఎక్కకపోయినా, చచ్చినట్లు వినాల్సిందే. లేకపోతే శిక్షలు ఎలాగో తప్పవు. అలా మొదలయ్యే "శిక్ష"ణా కార్యక్రమం రాత్రి 10, 11 గంటలయ్యే వరకు జరుగుతూనే వుంటుంది. ఇక శెలవులు, వీకేండ్స్ అనేవి ఎలా వుంటాయో కూడా తెలియని పరిస్తితి. పండగలొచ్చినా శెలవులు వుండవు. ఇవి కాక మధ్య మధ్యలో విద్యార్ధికి అవమానాలు, శిక్షలు ఎలాగో తప్పవు. ఒక సారి కార్పోరేట్ కాలేజీలో చేరితే ఒకటి, ఆత్మ హత్య చేసుకోవాలి లేదా, ఎంత బండ బ్రతుకయినా బ్రతకడానికి సిద్దపడే సిగ్గులేని జీవితం ప్రాప్తిస్తుంది... ఇది నిజం.
ఈ కాలేజీల దగ్గర వుండే మంచి టెక్నిక్ ఏమిటంటే, కాలేజ్ లో చేరే విద్యార్ది దగ్గర ముందే పెద్ద మొత్తంలో ఫీజుని వసూలు చేసేస్తారు. దానితో ఎన్ని ఇబ్బందులున్నా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సర్దుకు పోవాల్సి వస్తుంది. ఎవరయినా హాష్టల్లో ఇమడ లేక ఇంటికి ఫోన్ చేసి, "నాన్నా, నాకిక్కడ బాగో లేదు, నేను నరకం అనుభవిస్తున్నాను, నేను చదవలేను నాన్నా." అనగానే అటువైపునుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం,, "ఫీజు మొత్తం కట్టేసాం కదమ్మా, ఈ ఒక్క సంవత్సరానికే అడ్జస్ట్ అవ్వు.. వచ్చే సంవత్సరం మానేద్దువు గాని" అంటారు. కాని ఇప్పుడు కేవలం కొన్ని వేల రూపాయల ఫీజు గురించి చూసుకుంటే, తరువాత కొడుకో, కూతురో లేకుండా పోతున్నారు. దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి.. దయచేసి మీ పిల్లలు చెప్పేది వినండి, వారి ఆవేదనని అర్ధం చేసుకోండి.. వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయ పడటంలో తప్పు లేదు కాని, దాన్ని సాధించే ప్రయత్నంలో, మీరు, పిల్లలు ఏమి కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ గొప్ప చాటుకోవడానికో, మీ స్టేటస్ చూపించుకోవడానికో పిల్లల ప్రాణాల్ని బలి పెట్టకండి. కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడయినా మంచి మార్కులు వస్తాయి. అందరూ ఇంజినీర్లు, డాక్టర్లూ అయిపోనవసరం లేదు.. కనీసం మనిషిగా బ్రతకగలిగితే అదే పది వేలు. వ్యాపారం చేసేవాళ్ళని ఎలాగో మార్చలేము... కనీసం మనమయినా మారితే, అంటే ఈ టపా చదివిన ఒక్క తండ్రి మనసులో అయినా మార్పు తీసుకురాగలిగితే, ఒక్క చిట్టి తల్లి ప్రాణన్నయినా నిలబెట్టగలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే.