Pages

Thursday, June 9, 2016

రిజర్వేషన్ల కోసం సిగ్గులేకుండా నడి రోడ్డుపై ధర్నాలు చేసే వారికి గుణపాఠం .... స్విస్‌ ప్రజల తీర్పు

    ప్రభుత్వం నుండి అప్పనంగా అన్నీ వచ్చేయాలనుకునే వారు స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన సందేశాన్ని చూసి తలదించుకోవాల్సిందే. దేశ ప్రజలందరికీ బ్రతకడానికి అవసరమైన కనీస మొత్తాన్ని ఉచితంగా ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ప్రపంచంలోనే ఇది మొదటిసారట. కాని, అనూహ్యంగా, తమకు అటువంటి ఉచితాలు ఏవీ వద్దంటూ స్విస్‌ ప్రజలు తమ నిరాకరణను ఓటింగ్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ ఒకటి. ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశం స్విట్జర్లాండ్‌. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అందరికీ తెలిసిన బ్యాంకింగ్‌ రంగమే. నల్లకుబేరులందరికీ ఈ దేశంలోని బ్యాంక్‌లలో అక్కౌంట్స్‌ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. భారత్‌, చైనాతో సహా అనేక వర్ధమాన దేశాల్లోని అవినీతి నేతలు, ప్రభుత్వ అధికారులు అందరూ తమ దేశ ప్రజల కడుపుకొట్టి సంపాదించిన పాపిష్టి సొమ్మును అక్కడే భద్రంగా దాచుకుంటారు. అలా కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేర ధనం స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతోందని అంచనా. ఇది కాకుండా ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం, చాక్లెట్స్‌, పాడి పరిశ్రమ. దీని వల్ల ఇప్పటికే అక్కడి ప్రజలు తమ కష్టానికన్నా ఎక్కువ మొత్తంలోనే ప్రతిఫలాన్ని జీతాల రూపంలో పొందుతున్నారు. తాజా ప్రతిపాదనతో దేశంలోని పౌరులెవ్వరు పనిచేయనక్కర్లేకుండానే జీతం పొందడానికి వీలవుతుంది. కాని ఇటువంటి అప్పనంగా వచ్చే జీతాన్ని పొందడానికి అక్కడి పౌరులు నిరాకరించడం స్వాగతించదగ్గ విషయం. వారిని చూసి మనలాంటి దేశాల్లో ప్రజలు ఎంతో నేర్చుకోవాలి.

    ప్రతి ఎన్నికల్లోను రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక ఉచిత వాగ్దానాలు చేయడం చూస్తూంటాం. రుణమాఫీ దగ్గర నుండి, ఉచిత పెన్షన్లు, ఉచిత ఆరోగ్యం, విద్య వంటి మౌలిక అవసరాల నిమిత్తం అయితే కొంతలో కొంత మేలు. అదే ప్రక్క రాష్ట్రంలో అయితే టి.వి.లు, వాషింగ్‌మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, డి.టి.హెచ్‌. కనెక్షన్లు, సెల్‌ఫోన్ల వంటివి ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హోరెత్తించారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒకటుంది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుండో దిగివచ్చింది కాదు, అది మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నదే. మనందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బుని పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడుతుంటే, అక్కడుండే యంత్రాంగం ప్రజలకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తుంది. దేశ రక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, రహదారులు, విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి వాటికి వేల కోట్ల రూపాయిలు అవసరమవుతాయి. అంత పెద్ద ఖర్చు ఏ ఒక్కరు వ్యక్తిగతంగా పెట్టలేరు కాబట్టి, దేశంలోని ప్రజలందరి నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మునే అభివృద్ధికి ఉపయోగిస్తారు. అలా కాకుండా అదే ప్రజల  సొమ్మును తిరిగి వారిలో కొందరికి ఉచితంగా ఇవ్వడం మొదలు పెడితే, కొంత మందికి కష్టపడకుండా, ప్రభుత్వం నుండి సొమ్ము లభిస్తుంది.  దానితో వాళ్ళు ఏ పనీపాటా లేకుండా సమాజానికి భారంగా మారతారు.  నిజంగా కష్టపడి సంపాదించి, పన్నులు కట్టే వాడికి కడుపు మండుతుంది.  కొంత కాలానికి సమాజంలో అసంతృప్తి బయలుదేరుతుంది. అందరూ కష్టపడడం మానేస్తారు. ఉత్పాదకత తగ్గిపోతుంది. మానవ వనరులు లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం తగ్గిపోతుంది. దానితో ప్రభుత్వాలు మరిన్ని ఎక్కువ పన్నులు విధిస్తాయి. దాంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది. సంక్షేమ పథకాలనేవి ప్రభుత్వ విధానంలో ఒక భాగం కావాలి గాని, ప్రభుత్వమే సంక్షేమ పథకాల సృష్టికర్త కారాదు. ప్రజలకు కష్టపడే తత్వాన్ని నేర్పాలిగాని, సోమరిపోతుల్ని తయారుచేయకూడదు.

    భారతదేశంలాంటి చోట్ల మరో రకమైన సోమరులు తయారవుతున్నారు. అవే రిజర్వేషన్లు. భారతీయ సామాజిక స్థితిగతుల రీత్యా, కుల వ్యవస్థ వేళ్ళూనుకుని ఉన్న రోజుల్లో కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు కేటాయించారు. అది కూడా కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉండేలా నిబంధన చేసుకున్నారు. కాని, తరువాతి కాలంలో వచ్చిన రాజకీయ పార్టీలు తమ ఓట్ల స్వలాభం కోసం రిజర్వేషన్లను ప్రోత్సహించారు. దీనివల్ల కుల వ్యవస్థ రూపుమాపకపోగా మరింత బలంగా తయారయింది. కులాల పేరిట రాజకీయ పార్టీలు కూడా ఏర్పాటయ్యాయి. చివరికి పరిస్థితి ఎలా దాపురించిందంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత ఆర్థికంగా స్థిరపడిన ఎన్నో కులాల వారు కూడా తమను వెనుకబడిన కులాల కింద పరిగణించి, తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సిగ్గులేకుండా డిమాండ్‌ చేస్తున్నారు.

    ప్రపంచీకరణ నేపథ్యంలో కులానికన్నా, మతానికన్నా, భాషకన్నా ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను బట్టి, అతనికి లభించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంతే కాని, ఒక కులం వారికో, ఒక మతం వారికో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. ఈ రోజు మనం అనుభవిస్తున్న అనేక సదుపాయాలు, పరికరాలు ఏ కులం వారు కనిపెట్టారో, ఏ మతం వారు తయారుచేసారో ఎప్పటికీ ఆలోచించం. ఆ పరికరాలు నాణ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. నాణ్యతకు పెద్దపీట వేసి, తక్కువ రేటులో ఇచ్చారు కాబట్టే, అమెరికా, జపాన్‌ వంటి పెద్ద దేశాల పరికరాలను కాదని, కొరియన్‌ కంపెనీలయిన శాంసంగ్‌, ఎల్‌జి వంటి సంస్థల ఉత్పత్తుల్ని ప్రోత్సహించాం. ఇది అన్ని ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది.

    ప్రతిభావంతుల్ని కాదని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెడితే, రెండు రకాలుగా నష్టం కలుగుతుంది. మొదటిది ప్రతిభ లేనివాడు అందలం ఎక్కి, దేశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తాడు. కనీసం ఒక తెలుగు పేపర్‌ను తప్పులు లేకుండా చదడం రాని ప్రభుత్వ టీచర్లని నేను చూసాను. సంధుల్ని ఎలా విడదీయాలో, సమాసాలు అంటే అర్థం ఏమిటో కూడా పూర్తిగా చెప్పలేని తెలుగు ఉపాధ్యాయుల్ని నేను స్వయంగా చూసాను. చాలా బాధ అనిపించింది. ఇటువంటి వారు ఉపాధ్యాయులైతే, విద్యార్థులకు ఏం నేర్పగలరు? టీచర్‌కి 200% ప్రతిభ ఉంటేనే విద్యార్థిని 100% ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దగలడు. టీచర్‌కే 35 మార్కులు వస్తే, ఇక విద్యార్థి పరిస్థితి ఏమటి? దీని గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరు? ఒక ఉద్యోగి చేతగాని వాడయితే ఆ శాఖ మాత్రమే ఇబ్బంది పడుతుంది. కాని ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడు కాకపోతే కొన్ని విలువైన జీవితాలు, పూర్తి కొన్ని తరాలు అజ్ఞానపు అంచుల్లోకి జారిపోతాయి. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం.

    అందుకే విజ్ఞులైన దేశ ప్రజలు అయాచితంగా ఇచ్చే వాటిని తిరస్కరించాలి. రిజర్వేషన్లను వ్యతిరేకించాలి. ఊరికే వస్తున్నాయి కదా అనుభవించడానికి ప్రయత్నిస్తే, భవిష్యత్తు తరాలు అంధకారంలో బ్రతకాల్సి వస్తుంది. స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా మేలుకుని, సంక్షేమ పధకాల్ని, రిజర్వేషన్లని తిరస్కరిస్తే, మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో సమయం పట్టదు. అది మన చేతుల్లోనే ఉంది.

Sunday, May 29, 2016

బైబిల్‌ కాలం నాటి దేవుడిని చంపేసిన హాలీవుడ్‌.... ఎక్స్‌మెన్‌ మూవీ విశ్లేషణ

    హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా వాస్తవిక ఆలోచనల మీద ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో విడుదలయిన 'ఎక్సోడస్‌' బైబిల్‌లోని నిర్గమ కాండను బేస్‌ చేసుకుని తీసిన సినిమా. అయినప్పటికీ ఎక్కడా మహిమలు, మహత్యాల జోలికి పోకుండా ఉన్నదున్నట్టుగా తీసారు. ఎక్స్‌మెన్‌ అపోకలిప్స్‌ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇంతకు ముందు ఈ సిరీస్‌లోని సినిమాల్లో లాగానే జన్యుపరంగా మార్పు పొందిన మనుష్యులు తమకున్న అతీత శక్తుల ద్వారా మానవాళికి మేలు చేయడమే ముఖ్య కథాంశం. అయితే తమకున్న అపార శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, తాము మాత్రమే ప్రయోజనం పొందాలా లేదా సమస్త మానవాళికోసం పోరాడి, తమ శక్తులకు ఒక సార్థకత చేకూర్చుకోవాలా అనే పాయింట్‌ చుట్టూ కధ తిరుగుతుంటుంది.

    ప్రస్తుత సినిమా విషయానికొస్తే, అపోకలిప్స్‌ అనేది బైబిల్‌ చేత నిషేధితమైన పుస్తకాల సంకలనం. అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలన్నిటినీ ఆకాలం నాటి చర్చి గంపగుత్తగా నిషేధించి వాటిని సైతాను వ్రాతలుగా నిర్ధారించింది. అలా 3500 సంవత్సరాల క్రితం బైబిల్‌ (అపోకలిప్స్‌) లో వర్ణించబడిన ఒక దేవుడు ఈజిప్ట్‌ను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. తనకున్న అతీంద్రియ శక్తుల సాయంతో మనుష్యులను బానిసలుగా చేస్తాడు. తన మాట వినని వారికి ఒకటే శిక్ష.. అదే మరణం. తనకు ఎదురు చెప్పిన ప్రజలుండే నగరాల్ని, దేశాల్ని కూడా వదలడు. వాటిలో ఎన్నో ప్రకృతి విలయాల్ని సృష్టించి, అక్కడున్న ప్రజలందరినీ మృత్యు వాతకు గురిచేస్తాడు. ఆ దేవుడికి తెలిసిన ఒకే ఒక పరిపాలనా విధానం... భయ పెట్టి దారిలోకి తెచ్చుకోవడం. అయితే, అతని దుర్మార్గాన్ని సహించలేని అప్పటి ప్రజల్లో కొందరు తిరుగుబాటు చేసి, ఆ దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అనుకోని విధంగా అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు. తిరిగి 1983లో కొందరు ఆ దేవుడిని మరలా ఈ లోకంలోకి తీసుకువస్తారు. స్పృహలోకి వచ్చిన ఆ దేవుడికి ఈ లోకం తీరు నచ్చదు. మరలా ఈ భూమిని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలని మరికొందరు ఎక్స్‌మెన్‌లను తన వైపు తిప్పుకుని, ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని, ఎక్స్‌మెన్‌లు తమ తప్పుని తెలుసుకుని, ఆ దేవుడిని చంపి, మానవాళిని ప్రళయం నుండి కాపాడుతారు. ఇదీ స్థూలంగా కథ.

    దేవుడికి చంపడమనే భావన భారతీయులకి కొత్తగా అనిపించవచ్చు. కాని, పాశ్చాత్య కోణం నుండి ఆలోచిస్తే, వారి బాధ మనకు అర్థం అవుతుంది. హిందువుల ఆలోచన ప్రకారం దేవుడికి రూపం లేదు, ఆయన సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే సృష్టిలోని ప్రతి అణువులోను ఆయనే నిండి వున్నాడు. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతమయిపోతుంది. కాని పాశ్చాత్య మతాల దృష్టిలో దేవుడు కూడా ఒక భౌతిక రూపమే. ఆయన స్వర్గం అనే ఒక 'ప్రదేశం'లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అక్కడి నుండి ఈ లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఈ భూమిమీదకి వచ్చి పోతూ ఉంటాడు. తన మాట వివని వారిని బాధలకు గురి చేస్తూ ఉంటాడు. ఒక వేళ ఇప్పుడు తప్పించుకున్నా, తన స్వర్గం పక్కనే ఒక నరకాన్ని కూడా సృష్టించి ఉంచుతాడు. ఎప్పటికీ ఆరని మంటలు అక్కడ ఉంటాయి. దానిలో పడేస్తాడు. అటువంటి సాడిస్ట్‌ దేవుడు ఇప్పటి ప్రపంచానికి అవసరంలేదు. ఒకవేళ పొరపాటున వచ్చి తమ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా, ఇప్పటి మనుష్యులు ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అతడిని తన లోకానికి పంపేస్తారు. ఇదీ పాశ్చాత్య ప్రపంచం తీరు.

    ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా సేపు ఆలోచించాను. పాశ్చాత్య క్రైస్తవంలో వచ్చిన ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి. బైబిల్‌ని ప్రస్తుత సమాజం అంగీకరించే దశలో లేదని అర్థమయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలేని సమాజాల్లో నుండి ప్రపంచానికి అందివ్వబడిన దుర్మార్గమైన కానుక 'బైబిల్‌'. ప్రత్యేకించి ఓల్డ్‌ టెస్టిమెంట్‌ చదివితే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అన్నీ ఆటవిక ఆలోచనలు, అర్థం పర్థం లేని సంఘటనలతో కలగలిసిపోయి ఉంటుంది. రెండు ప్రపంచ యుద్దాలకి కారణమైనది కూడా ఆ పుస్తకమే. అటువంటి పుస్తకం మీద ఆ మతాన్ని అనుసరించే వారే తిరుగుబాటు చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడి కన్నా మానవత్వమే గొప్పదని, మానవత్వానికి హాని కలిగించేలా ఉంటే దేవుడినయినా తిరస్కరించవచ్చును అనేది ఇప్పటి పాశ్చాత్య దృక్పధంగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ ఆలోచన భారతీయ తాత్విక చింతనకు దగ్గరగా ఉంటుంది. సర్వ ప్రాణుల్లోను భగవంతుని రూపాన్ని దర్శించమని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కేవలం మానవ జాతి మాత్రమే కాక, పక్షులు, జంతువులు, జలచరాలు వంటి వాటిలో కూడా భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అవసరాన్నిబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనేది మన సిద్ధాంతం. దశావతారాలు ఆ కోవలోకి చెందినవే. ''ఈ సమస్త ప్రకృతిని మానవుడు వాడుకోవడం కోసమే దేవుడు సృష్టించాడు'' అనే బైబిల్‌ మాటలు మన ఆలోచనకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప మతమైనా, ఎన్ని మహిమలున్న దేవుడైనా, మానవత్వాన్ని మరచిపోతే, మనం ఉనికికి కారణమైన ఈ ప్రకృతిని గౌరవించకపోతే నామరూపాల్లేకుండా చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.

Thursday, March 10, 2016

మగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. ఎందుకో తెలుసా? పూర్తిగా చదవండి.

సామాజిక మాధ్యమాలలో అకౌంట్‌ కలిగి ఉండడం ఇపుడు ఒక అవసరంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌లలో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కలిసి తమ ఆలోచనలు పంచుకోవడానికి, బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే, కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు వీటివల్ల ఎన్నో లాభాలతో పాటుగా అంతకు మించి నష్టాలు కూడా ఉంటున్నాయి. ఎంతో మంది జీవితాలు వీటివల్ల నాశనం అయిపోతున్నాయి. ముందు కేవలం సరదాగా మొదలయ్యి, చివరికి విషాదంతో ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాల్లో ఇవి కలకలం రేపుతున్నాయి. మా బంధువులో ఒకమ్మాయి కేవలం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్‌తో మొదలుపెట్టి, పెళ్ళి వరకు వెళ్ళి, అతని చేతిలో మోసపోయి, నరకం అనుభవించి, ఆత్మహత్య చేసుకుంది. తన చివరి వీడియోను ఫేస్‌బుక్‌లోనే షేర్‌చేసి, ఆత్మహత్య చేసుకుంది. ఎంతో బాధగా అనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర కొంత ఉన్నప్పటికీ, ముందు, వెనుక చూసుకోకుండా, ఒక అపరిచిత వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచన వల్ల ఆ అమ్మాయి జీవితం కోలుకోలేనంతగా దెబ్బతింది. అందుకే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలు వాడే చిట్టితల్లులకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను.

1. కొత్త వారి నుండి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అనుమతించకండి. అలా పంపిన వారు మీ ఫ్రెండ్‌ కి ఫ్రెండ్‌ అయినా సరే మొహమాటం లేకుండా నో చెప్పేయండి. అలాగే మీరు కూడా అబ్బాయి ప్రొఫైల్‌ ఫోటో మహేష్‌బాబులా ఉందనో, రామ్‌చరణ్‌ని మించిపోయాడనో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపకండి. మేక వన్నె పులులు, ఆవు తోలు కప్పుకున్న తోడేళ్ళకీ ఫేస్‌బుక్‌లో కొదవ లేదు. గుర్తుంచుకోండి.

2. మీ వ్యక్తిగత ఫోటోలను ఎట్టి పరిస్థితులలోను షేర్‌ చేయకండి. ఒకవేళ అంతగా షేర్‌ చేయాలనుకుంటే, పబ్లిక్‌ షేర్‌ కాకుండా, కేవలం మీ ఫ్రెండ్స్‌కి మాత్రమే కనబడేలా షేర్‌ చేయండి (మీరు షేర్‌ చేసేముందు పబ్లిక్‌ లేదా ఓన్లీ ఫ్రెండ్స్‌ అని ఆప్షన్స్‌ ఉంటాయి, చూడండి). దాని వల్ల అనవసరమైన పబ్లిసిటీ నుండి తప్పించుకోవచ్చు. మీ ఫోటోలను కూడా ఫోటోషాప్‌ చేసి, మీకు తెలియకుండా అసభ్యంగా మార్చి, వివిధ వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేసే శాడిస్టులు ఉంటారు జాగ్రత్త.

3. లైకుల పిచ్చిలో పడి, మీ సెల్ఫీలు, వ్యక్తిగత విషయాలు షేర్‌ చేయకండి. ఎక్కువ లైక్‌లు వచ్చినంత మాత్రాన అదేం పెద్ద గొప్ప విషయం కాదు. జీవితంలో విజయాలు సాధిస్తే, అప్పుడు వచ్చే అభినందనల కిక్కే చాలా బాగుంటుంది.

4. ఛాటింగ్‌ చేసేటపుడు ఎట్టి పరిస్థితులలోను, ఎవరి మీదా మీ అభిప్రాయాలు చెప్పడంగాని, మీ ఫోటోలు షేర్‌ చేయడం గాని, మీ చిలిపి ఊహలు పంచుకోవడం గాని చేయకండి. ఎక్కువ మంది అబ్బాయిలు మీరు వ్యక్తిగతంగా పంచుకున్న వాటిని తమ ఫ్రెండ్స్‌కి చూపించి, పైశాచిక ఆనందం పొందుతారని మరువకండి. దాన్ని అలుసుగా తీసుకుని, వాళ్ళు కూడా మీ కేరక్టర్‌ని లోకువ చేసి చూస్తారు, వారు కూడా మీ నుండి 'ప్రయోజనం' పొందడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, మీ లిమిట్స్‌లో మీరు ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని లోకువ చేయలేరు. మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంటుంది.

5. ఎవరైనా హద్దులు దాటితే, వెంటనే వారిని బ్లాక్‌ చేయండి. మీ అకౌంట్‌లో బ్లాక్‌ యూజర్‌ ఆప్షన్‌ ఉంటుంది. అది వాడుకోండి. అప్పటికీ ఎవరైనా హద్దుమీరితో వెంటనే మీ అమ్మానాన్నలతోగాని, పెద్దలతో గాని ఈ విషయాన్ని షేర్‌ చేసుకోండి. వాళ్ళు తప్పక సహాయ పడతారు. ప్రేమ, పెళ్ళి వంటివి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు ఎప్పటికీ మీ మంచినే కోరుకుంటారు అనేది మరువకండి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటపుడు వారి సమక్షంలోనే తీసుకోండి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని బాధపడేకంటే, ముందే మన మంచిని కోరేవారికి చెప్పడం వలన, విష పురుగుల బారిన పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకున్నవారవుతారు.

మరో ముఖ్య విషయం... ఇదంతా చదివిన తరువాత మీకో సందేహం రావచ్చు. ఇదేమిటి? ఈయన ఇలా రాస్తున్నారు... అబ్బాయిలు అందరూ అంతేనా... నా ఫ్రెండ్‌ మాత్రం మంచివాడేలే. లోకంలో చాలా మంది చెడ్డవాళ్ళుండవచ్చు. కాని, నా స్నేహితుడు మాత్రం అలాంటివాడు కాదు అనుకోవచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది.

మనం ప్రకృతిని పరిశీలించినట్లయితే, జీవ జాతుల్లో ఉన్న ఆడ, మగ వ్యత్యాసాలను ప్రకృతే ముందుగా ప్రోగ్రామ్‌ చేసింది. దీనికి ఒప్పుకుంటారు కదా. ప్రతి జీవ జాతిలోను ఆడ జీవి ఎప్పుడూ అణకువగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఎటువంటి పైత్యానికి, వికారాలకి లోను కాదు. కాని, అటువంటి ఆడ జీవిని తన వైపు ఆకర్షించుకుని, ఏదో విధంగా సృష్టికార్యం వైపు మొగ్గు చూపేలా చేయడానికి మగ జీవి ప్రోగ్రాం చేయబడింది. అందుకే మగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. మగ కోకిల మాత్రమే శ్రావ్యంగా పాడుతుంది. మగ జింకకు మాత్రమే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. మగ సింహానికి మాత్రమే సివంగిని ఆకర్షించడానికి వీలుగా పెద్ద జూలు ఉంటుంది. ఇటువంటి ఆకర్షణలన్నీ మగ జీవికి ఉండడం అంటే... వాటి అంతిమ లక్ష్యం ఆడ జీవిని ఆకర్షించడమే. అందుకే 'మగ బుద్ది' అంటారు. ఈ మగ బుద్ది సాధారణంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని, కొందరిలో అది హద్దుమీరి, సామాజిక కట్టుబాట్లని లెక్కచెయ్యకుండా ఆడపిల్లల్ని హింసించే స్థాయికి వెళుతుంది. అప్పుడే నేరం అవుతుంది. 99 శాతం మంది మగవారిలో ఈ 'మగ బుద్ది' నేను చెప్పినట్లుగానే ఉంటుంది. అందుకు సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రకృతే ఆ విధంగా ప్రోగ్రామ్‌ చేసింది. అటువంటి వాళ్లని హద్దులో పెట్టడానికే సామాజిక కట్టుబాట్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సామాజిక కట్టుబాట్లని అతి పురాతన కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహిళలచేత మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే మొట్టమొదటి సమాజాలు మహిళాధిక్య సమాజాలుగా రూపుదిద్దుకున్నాయి. తరువాతి కాలంలో పురుషాధిక్య మతాలు ఏర్పడ్డ తరువాత, మహిళలకి ప్రాధాన్యాన్ని తగ్గించి, తమ మాట వినేలా చేసుకున్నారు పురుషులు. అప్పటి నుండి, సామాజిక కట్టుబాట్లు సడలడం మొదలయ్యి, అవి మహిళల పట్ల గుదిబండలుగా మారాయి. 

మరి మంచి వారు ఎవరూ ఉండరా అంటే... ఉంటారు. ఎంతో ఆలోచనా పరిణితి కలిగి, తమకు ఎదురు పడ్డ ప్రతి ఆడపడుచును, తమ తల్లిలా, దేవతలా భావించి, గౌరవించే వారు కూడా ఉంటారు. సనాతన సాంప్రదాయాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణా ఆచరిస్తారో (అలాగని, స్వామీజీలు, బాబాలు గొప్పవారని నేను అనడం లేదు, వారిలో కూడా 'మగ బుద్ది' బయట పడడం చాలా సార్లు చూస్తూంటాం.) అటువంటి వారు తమ మనసులో ఎటువంటి వికారం లేకుండా ఉంటారు. వారు నిజంగానే ఇబ్బందల్లో ఉన్న ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా సహాయం చేయడం చూస్తూంటాం. వారి ప్రేమకు ఎటువంటి హద్దులు ఉండవు. అటువంటి వారు మీ నుంచి భౌతికంగా గాని, వస్తురూపంగాగాని ఎటువంటి ప్రతిఫలం ఆశించరు. అదొక్కటే వారి ఆలోచనా పరిణితికి గుర్తు. మీకు సహాయం చేసి, ప్రతిఫలంగా మీ నుంచి ఏదైనా ఆశించారంటే, వారి ప్రేమలో ఏదో స్వార్థం ఉన్నట్లే లెక్క. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను. ఆడపిల్లలు ఎవరికీ ఎందులోను తీసిపోరు. మీకు ఎవరి ప్రేమా అవసరం లేదు. మీరే పదిమందికి ప్రేమను పంచగలరు. బిడ్డకు తల్లిగా, తోబుట్టువులకు సోదరిగా, భర్తకు భార్యగా మీరే అందరికీ ప్రేమను పంచగలరు. అటువంటి మీరు ఎవరి ప్రేమనో ఆశించి, అవతలి వారికి లోకువ కాకండమ్మా. వారి స్వార్థానికి బలవ్వకండి. మీ ప్రేమను పొందే అదృష్టం అవతలి వారికి లేదని బాధ పడండి. అంతే తప్ప మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదని మీ మీద మీరే సానుభూతి పెంచుకోకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కన్నవారికి, మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకునే వారికి మీ ప్రేమను పంచండి. మీతో పాటుగా వారిని కూడా సంతోషపెట్టండి. మీ.. ఎస్పీ జగదీష్‌