Pages

Wednesday, May 4, 2011

పైసా ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. కావాలనుందా?

మీరు చదివింది నిజమే. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయట. అది సహజం. ప్రతీ సంవత్సరం వేసవిలో వేడి గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటున్నది. ఓజోన్‌ పొరకు తూట్లు పడుతున్నాయి. మరి వేడి తగ్గించే మార్గం లేదా? లేకేం? ఉంది... సింపుల్‌గా ఒక ఎ.సి. కొనుక్కోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎ.సి. కొనుక్కుంటాం. దానికి బిల్లు కట్టుకుంటాం.  మరో గదిలో ఎ.సి. కావాలంటే? మళ్ళీ డబ్బు కావాలి. అలా కాకుండా ఇల్లంతా ఒక్కసారిగా ఎ.సి. చేస్తే వదిలిపోతుంది కదా? అమ్మో చాలా డబ్బు కావాలి. కరెంట్‌ బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మన సంపాదనంతా ఎ.సి.కే సరిపోతుంది కదా. ఇప్పుడెలా? అక్కడికే వస్తున్నా... ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. చెయ్యాలంటే...

    దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళండి... అదేనండి.. మొక్కలు అమ్మే చోటు... వాటిలో నుండి బాగా గుబురుగా పెరిగే  చక్కటి మొక్కల్ని తీసుకోండి. పసుపు రంగు పువ్వులు ఉండే మొక్కలు గాని, వేప, రావిచెట్లు గాని, త్వరగా, దట్టంగా పెరిగే ఏ మొక్కల్నయినా నాలుగు తీసుకోండి. ఇంటికి నాలుగువైపులా, వీలు కాకపోతే, మీ యింటి ముందు రోడ్డు వారనయినా నాటండి. ఒక్క సంవత్సరం కష్టపడి, మొక్కకి రెండు పూటలా నీరు పోయండి. దీనితో రెండు పనులు అవుతాయి. ఒకటి - పైసా ఖర్చులేకుండా, ఆ మొక్క చల్లదనంతో ఇల్లంతా ఎ.సి.గా మారుతుంది. రెండు - సన్నబడడానికి స్కైషాప్‌కి వెళ్ళి ఎక్సర్‌సైజ్‌ పరికరాలు కొనుక్కోనవసరం లేకుండా ఒంట్లో అనవసరంగా పేరుకున్న కొవ్వంతా కరిగిపోతుంది. వావ్‌... గ్రేట్‌ ఐడియా కదా...

మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని ఎంత నష్టపరిస్తే అంత అభివృద్ధి అనుకుంటున్నాం. ఫలితం.... విధ్వంసం. ఇంటికి చల్లబరుచుకోవడానికి ఎ.సి. కావాలనుకుంటున్నామే గాని... ఒక పచ్చటి మొక్క కూడా అంతే చల్లదనాన్ని ఇస్తుందని మరచిపోతున్నాం. ఇంటి ముందు పచ్చగా ఒక చెట్టు ఉంటే, గాలికి దాని ఆకులు రాలి, గుమ్మంలో చెత్త పేరుకుపోతుందని, చెట్టుని నరికేస్తున్నాం. మళ్ళీ మనమే ఎ.సి.ల కోసం వెంపర్లాడుతున్నాం. ఒక చెట్టుని కొట్టివేస్తే ప్రకృతికి ఎంత నష్టమో మనకీ అంతే నష్టం. మనం పీల్చే గాలిలలోని ఆక్సిజన్‌ పెరగాలంటే చెట్లు కావాలి. మనం తాగే నీళ్ళు వర్షం కురవాలంటే చెట్టు ఉండాలి. మనకు చల్లటి నీడ కావాలంటే చెట్టు ఉండాలి. చెట్టు మన తల్లి లాంటిది. అది మరచిపోయి, తల్లిని కాదని, మరొకరి వెంట పడుతున్నాం. అందరూ మొక్కలు నాటితే... అవి చెట్లుగా మారితే... మ ఇల్లు మాత్రమే కాదు... మన ఊరంతా ఎ.సి. అవుతుంది. అందరూ హాయిగా ఉంటారు.. సర్వే జనాస్సుఖినోభవంతు..

Tuesday, May 3, 2011

ఆధునిక ప్రపంచపు హీరో... మన "గాంధేయవాదులకి" మార్గదర్శి... ఒబామా...

    ఎప్పుడూ గాంధీ సిద్ధాంతాల్ని వల్లెవేసే అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను అంతమొందించడం ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసారు. బిన్‌లాడెన్‌ మరణం తరువాత అమెరికన్‌ టి.వి.లలో ఒబామా ప్రసంగించినపుడు ఆయన మాటల్లో ప్రపంచానికి ఒక మంచి జరిగిందనే విషయం, అది అమెరికన్ల ద్వారా జరిగిందనే గర్వం తొణికిసలాడింది. నిజానికి 9/11 తేదీన బిన్‌లాడెన్‌ చేసిన పని అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది.  అది వారి జాతికి జరిగిన అవమానంగా భావించారు. అటువంటి పరాభవానికి కారణమైన ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితులలోను శిక్షించి తీరాలన్న వారి ఆకాంక్ష నేటికి నెరవేరింది. జూనియర్‌ బుష్‌ అమెరికా అధ్యక్షుడి ఉన్న కాలంలోను లాడెన్‌ గురించి ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కాని ఒబామా ఒక చక్కటి వ్యూహంతో, పాకిస్థాన్‌ ప్రభుత్వానికి కూడా తెలియకుండా, దేశం కాని దేశంలో లాడెన్‌ను మట్టుబెట్టారు.

    అమెరికన్లు ఈ రోజు చేసిన పని ప్రపంచ దేశాలన్నిటికీ, ముఖ్యంగా ఇండియా వంటి దేశాలకు కనువిప్పు కావాలి. తప్పు చేసింది ఎవరైనప్పటికీ, వారు ఏ మతానికి లేదా ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ వారిని శిక్షించి తీరాల్సిందే. సాక్షాత్తు భారత పార్లమెంటుపై దాడి చేసిన వారిని, దేశ ఆర్థిక రాజధానిపై దాడి చేసిన వారిని తీసుకుని వచ్చి (అదేలెండి.. అరెస్ట్‌చేసి), ముప్పొద్దులా మేపి, వారిని విచారణ పేరుతో కొత్త అల్లుడి మర్యాదలు చేస్తూ, దేశ ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకోవడం మన నేతలకే చెల్లింది. నేరానికి పాల్పడిన వ్యక్తి ఒక మతానికి చెందినవాడనే ఒకే ఒక్క కారణంతో అతడిని శిక్షించడానికి వెనుకాడడం... న్యాయ విచారణ పేరిట కాలయాపన చేయడం... ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెట్టడమే అవుతుంది.  ఇది మన నాయకులకు, రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు. కాని, ఓటు బ్యాంకు రాజకీయాల ముందు దేశ ప్రతిష్టగాని, ప్రజల భద్రత గాని గాలికి కొట్టుకుపోతాయి. తరువాతి పరిణామాలు ఎటు దారి తీసినప్పటికీ, తమ పదవులు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగాని, ప్రజల దృష్టిలో వారు ఎంత చులకన అవుతారో, ఎవరికీ అక్కరలేదు.

    అన్నిటికన్నా విచిత్రమైన విషయం... మే 2వ తేదీన రాత్రి జెమిని టి.వి.లో ఒక చర్చావేదిక ఏర్పాటు చేసారు. దానిలో ఒక మానవ హక్కుల కార్యకర్త (?) అనుకుంటా... పేరు గుర్తు లేదు... బిన్‌లాడెన్‌ను చంపి అమెరికా చాలా తప్పు చేసిందట... అతన్ని పట్టుకుని, చట్ట ప్రకారం విచారణ చేసి, శిక్ష వేయాల్సిందట... ఇలా సాగింది అతని వాదన. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించడానికి కారణమైన వ్యక్తిని, మతం పేరిట మారణ కాండను సాగించిన ఒక నరరూప రాక్షసుడిని... పట్టుకుని, విచారించడం, శిక్షించడం సాధ్యమవుతుందా? మానవ హక్కులు అటువంటి వారికి అసలు వర్తిస్తాయా?

    ఇక్కడ విషయం హింసని సమర్థించమని కాదు... హింసకు హింసే సమాధానం కాకపోవచ్చు. కాని, కరుడు కట్టిన నేరగాళ్ళని, తప్పు చేస్తున్నామని తెలిసి, ప్రణాళికా బద్దంగా, తాము అనుకున్న దానిని అమలు జరపడం కోసం ఎంతో మంది అమాయకుల్ని చేరదీసి, వారికి శిక్షణ ఇచ్చి, వారి మనసుల్ని మార్చి, ప్రపంచం పట్ల విరక్తి కలిగించి, రక్తపుటేర్లు పారిస్తున్న వారు మారతారనుకోవడం, వారిని న్యాయబద్దంగా శిక్షించాలను కోవడం ఎప్పటికీ జరగని పని. ఏదో ఆవేశంలోనో, తెలియకో ఒకసారి నేరం చేసిన వారిని స్వల్ప శిక్షల ద్వారా, మానసిక పరివర్తన ద్వారా మార్చాలనుకోవడం మంచిదే. చాలా సార్లు అది మేలు చేస్తుంది కూడా. కాని బిన్‌లాడెన్‌ వంటి, ఇంకా మత ఛాందస వాదం ద్వారా, హింస ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకొనే వారిని, వారు పాకిస్థాన్‌లో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. అప్పుడే ఒక భద్రతతో కూడిన ప్రపంచాన్ని మన భావి పౌరులకి అందించగలుగుతాం. లేదా ఇప్పటిలాగే తాత్సారం చేస్తూ ఉంటే... చేతగాని ధర్మపన్నాలు వల్లిస్తూ కూర్చుంటే, భారత దేశం ఆటవిక మనుషులు, చట్టాలతో కూడిన భయంకర తాలిబన్ల పాలనలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.