Pages

Monday, October 25, 2010

పేరు మార్పు: ఇకపై 'రాజీవ్‌ హైదరాబాద్‌' ఇంకా 'సోనియా సికిందరాబాద్‌'

తెలుగు వారి లలిత కళా తోరణం కాస్తా 'రాజీవ్‌ తెలుగు లలిత కళాతోరణం' అయిపోయింది. 'మన వాళ్ళు వట్టి వెధవాయిలోయ్‌' అన్నట్లుగా మన తెలుగు రాష్ట్రంలో ప్రతీదీ 'రాజీవ్‌', ఇందిర, సోనియాల మయమైపోయింది, అయిపోతుంది, అవ్వబోతున్నది. ఇంకెలాగో దీన్ని మనం కాపాడుకోలేము కాబట్టి, నా ప్రధాన డిమాండ్‌ ఏమిటంటే... హైదరాబాద్‌ నగరాన్ని 'రాజీవ్‌ హైదరాబాద్‌' గా మార్చాలని, సికిందరాబాద్‌ నగరం పేరును 'సోనియా సికిందరాబాద్‌' గా మారిస్తే బాగుంటుందని.... రెండూ జంట నగరాలు కాబట్టి, రాజీవ్‌, సోనియాల పేర్లు చక్కగా నప్పుతాయనుకుంటున్నాను. ఇక హుసేన్‌ సాగర్‌ పేరు కూడా 'ఇందిరా సాగర్‌' గా, ఛార్మినార్‌ను 'రాహుల్‌ మీనార్‌'గా మార్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి అసలు ఆత్మాభిమానం లేదని ఎవరైనా అన్నా సరే గాని, తెలుగు వాళ్ళలో అసలు గొప్పవాళ్ళెవరూ లేరని అందరూ ఈసడించినాగాని, పక్కనున్న తమిళ తంబిలను చూసైనా గాని ఏ మాత్రం సిగ్గుపడకుండా మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టయినా సరే, తెలుగు వాళ్ళందరం ఒక్క మాటపై నిలబడి 'అమ్మ భజన' చేద్దాం... అప్పటి వరకు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. గత మెంతొ ఘన కీర్తి కలవోడా....

Friday, October 15, 2010

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తినిపించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది?

పిల్లలకి దసరా సెలవులు వచ్చేసాయి. ఆటలు, పాటలు, కేరింతలు, తుళ్ళింతలు... అమ్మమ్మ ఇంటికి ప్రయాణాలు.... కొత్త స్నేహితులు, పాత బందువుల పలకరింతలు... నిజానికి శెలవులొచ్చాయంటే పిల్లలకంటే ఎక్కువ ఆనంద పడే వాళ్ళు ఎవరుంటారు? చిన్నతనంలో శెలవుల్లో చేసిన అల్లరి, కోతికొమ్మచ్చి ఆటలు ఎవరైనా మరచిపోగలమా? కొత్త కొత్త పిండివంటలు, కొత్త బట్టలు, కొత్త బొమ్మలతో, ఆత్తయ్యలు, మావయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, తాతమ్మలు, తాతయ్యలతో ఎంత సందడిగా ఉంటుంది? ఇంతటి అపురూపమైన ఆనందాలు పిల్లలకు దక్కకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది ఇప్పటి స్కూళ్ల పరిస్థితి చూస్తుంటే...

అసలు విషయానికి వస్తే మా పెద్దమ్మాయి సత్య రెండవ తరగతి చదువుతుంది. దసరా శెలవులిచ్చారు. తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మగారింట్లో దింపేసి వచ్చాను. నాలుగురోజులు అక్కడ సరదాగా గడిపేరు. నిన్ననే అక్కడి నుండి తీసుకువచ్చాను. తీసుకు వచ్చినప్పటి నుండి దాని గదిలోకి దూరిపోయి మరలా కనబడలేదు. నేనూ పని వత్తిడిలో పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అది కనబడక, దాని అల్లరి చెవిలో వినబడక ఇల్లంతా బోసిపోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళి చూద్దును కదా.... చుట్టూ చిందరవందరగా పుస్తకాలతో, పెన్ను, పెన్సిళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అల్లరి చేస్తూ ఉండే లక్ష్మీదేవిలా ఉండే మా సత్య అపర సరస్వతి అవతారంలా కనిపించింది. ముఖం పీక్కుపోయి ఉంది. చాలా సీరియస్‌గా ఏదో రాసేసుకుంటా ఉంది. నాకు తండ్రి మనసు ఆగలేదు. ఆడుకోకుండా ఇప్పుడు కూడా వర్క్‌ ఏమిటి నాన్నా. ఇంకా శెలవులు ఉన్నాయికదా. రేపు రాసుకుందువుగానిలే అన్నాను. వెంటనే సత్య నా వైపు ఓ సీరియస్‌ లుక్‌ ఇచ్చి, మరలా రాసుకోవడం మొదలుపెట్టింది. కాసేపు ఉన్నాకా, బేల ముఖం పెట్టి, ''నాన్నా... నాకు చాలా హోమ్‌వర్క్‌ ఉంది. చాలా చాలా ఎక్కువ. అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను కదా... అందుకే పూర్తి కాలేదు'' అంది. ''ఎంత ఉంది నాన్నా, నన్ను చూడనివ్వు'' అని దాని స్కూల్‌ డైరీ తీసుకుని చూసాను. గుండె ఆగినంత పనయ్యింది.



''ఇంగ్లీష్‌: ఎ నుండి జడ్‌ వరకు అక్షరాలు, ప్రతి అక్షరానికి ఒక్కొక్క పదం చొప్పున అన్ని లెటర్స్‌కి రాయాలి.

తెలుగు: అ నుండి ఱ వరకు అన్ని అక్షరాలు, క నుండి ఱ వరకు అన్ని గుణింతాలు, క నుండి ఱ వరకు అన్ని వత్తులు.

హిందీ: అ నుండి జ్ఞ వరకు అన్ని అక్షరాలు, క నుండి జ్ఞ వరకు అన్ని గుణింతాలు,

మేథ్స్‌: 1 నుండి 1000 వరకు అన్ని అంకెలు, 1 నుండి 20 వరకు అన్ని టేబుల్స్‌

సైన్స్‌ & సోషల్‌: 3,4,5 లెసన్స్‌ నుండి అన్ని క్వశ్చన్స్‌ & ఆన్సర్స్‌ మరియు ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌

జి.కె.: ఇప్పటి వరకు చెప్పిన అన్ని క్వశ్చన్స్‌ ''

ఇవన్నీ నోట్స్‌ రాసి చూపించాలట. దాని హోమ్‌వర్క్‌ ఏమిటో చూసిన తరువాత నాకిక నోటిమాట రాలేదు. ''నాన్నా, నాకు చెయ్యి నొప్పిగా ఉంది. రాయలేకపోతున్నాను'' అంది. జాలిగా నాకు చెయ్యి చూపించింది. ప్రొద్దుట నుండి ఏకథాటిగా రాయడం వల్ల దాని లేత అరచెయ్యి ఎర్రగా కందిపోయి ఉంది. నాకయితే ఒళ్ళు మండిపోయింది. టీచర్‌ని తిడదామని ఫోన్‌ చేసాను. ఆ అమ్మాయి ఫోన్‌ కట్టేసి ఉంది. సరే నేను చూసుకుంటాను అని చెప్పి కొంత హెAమ్‌ వర్క్‌ నేను సొంతంగా ఇచ్చి, అది మాత్రమే చెయ్యమని చెప్పి మా అమ్మాయిని ఊరుకోబెట్టాను. ఈ మాత్రం దానికి శెలవులివ్వడం ఎందుకో? పండుగ పేరు చెప్పి బండెడు హెAమ్‌వర్క్‌లిచ్చి పిల్లల ఆనందాన్ని కాలరాయడమెందుకో?

ఇంత దారుణమైన హోమ్‌ వర్క్‌ నా చిన్నతనంలో ఎప్పుడూ నేను చేసినట్టు గుర్తులేదు. నేనూ ఒక కాలేజ్‌ సెక్రటరీ / కరస్పాండెంట్‌ అయినప్పటికీ మా ప్రిన్సిపాల్‌కి, లెక్చరర్స్‌కి ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాను. పిల్లల్ని అనవసర హింసకు గురిచేయకండి. వారిలో సహజసిద్దంగా ఉండే నేర్చుకోవాలని అనే తపనని చిదిమేయకండి. మానసికంగా / శారీరకంగా ఒత్తిడికి గురిచేస్తే ఫలితాలు పాజిటివ్‌గా రావడం మాట అటుంచి నెగిటివ్‌గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ స్వేచ్చగా నేర్చుకోవాలి. స్వేచ్చగా ఆలోచించగలగాలి. ఎప్పుడూ పుస్తకాల్లో ఉండే విషయాల్నే బట్టీ పట్టి వాటిని మాత్రమే నేర్చుకుంటూ ఉంటే మనిషి ఆలోచన ఇక అక్కడితో ఆగిపోతుంది. మన పూర్వీకులు కూడా అలాగే చేసి ఉంటే, ఒక నిప్పు కనిపెట్టడం, ఒక చక్రం కనిపెట్టడం, ఒక న్యూటన్‌ గమన సూత్రం, ఒక ఐన్‌స్టీన్‌ రిలేటివ్‌ థియరీ వంటివి మనకు అందకుండా పోయేవి. కొత్తగా కనిపెట్టబడేవి ఇంతకు ముందు పుస్తకాల్లో లేనివే కదా. అంటే పుస్తకాలు చదవాలి. తరువాత ఆలోచించాలి. పుస్తక పరిథుల్ని దాటగలగాలి. అప్పుడే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు సాధ్యమవుతాయి. అలా కాకుండా అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టాలని ప్రయత్నిస్తే, జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. ఇదే విషయాన్ని రేపు ఆ స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడుదామని సిద్దమయ్యాను.

Tuesday, October 12, 2010

అమ్మాయిలంటే అంత లోకువా?

కాలేజీకెళుతుంటే  కాలరెత్తి కన్నుకొడతాడే ఒకడు....
పౌడర్లు, అత్తర్లు పూసుకుని రాసుకెళతాడే ఒకడు....
సిటీ బస్‌లో పోతే భుజాలే తాకుతుంటరే
సినేమా చూస్తుంటే చేతులు పాముతుంటరే.
అయ్యో రామ మా అక్క మొగుడు ఒంటరిగుంటె వెర్రెక్కుతాడే
ఎదురింట్లోన బాబాయిగాడు ఏదో వంకతో తాకుతాడు
వయసులు వరసలు తెలియని సరసులు సన్నాసులు
వీధుల్లోకెళుతుంటే ఏక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో...
టైపింగూ సెంటర్లో వేలు పెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ...
టైలరింగ్‌ షాపోడు టేపుతో కొలతలంటడే..
గాజుల వ్యాపారి తేరగా నిమురుతుంటడే...

నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలోనిది ఈ పాట. ఈ పాటలోని ప్రతి పదంలో నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అనేక కష్టాల్ని చక్కగా వారిచేతనే చెప్పించాడు రచయిత / దర్శకుడు. అదేమి విచిత్రమో తెలియదు కాని, ఆడపిల్లలు రోడ్‌ మీద నడిచి వెళుతుంటే ఎప్పుడూ చూడని వింతజంతువుని చూసినట్లు ఫీలయిపోతారు మగవారు. ఇక అక్కడి నుండి వారు వేసే వెర్రి మొర్రి వేషాలకు అంతే ఉండదు. జుట్టు దువ్వుకునే వాడొకడు, బట్టలు సరిచేసుకునే వాడు ఒకడు, ముఖం అందంగా ఉందా లేదా అని తడుముకొనే వాడు మరొకడు. అబ్బాయికి చెలగాటం అమ్మాయికి ఇబ్బంది అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. ‘అందగత్తెలను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేల, కొందరు పిచ్చిన పడనేలా’ అన్నట్లు కొందరు మగవారు ఇలాంటి పాట్లు, ఫీట్లు చేస్తూ ఉంటే, వారినెలా ఏడిపించి ఆనందించాలా అని ఆలోచిస్తూంటారు కొంతమంది శాడిస్టులు. లవ్‌ లెటర్‌ ఇద్దామా, రాసుకు పూసుకు తిరుగుదామా, బ్లేడ్‌ పట్టుకు కోద్దామా, గొడ్డలితో నరుకుదామా లాంటి వన్నమాట. మరో విషయం. ఆడపిల్లల్ని రాసుకుంటూ వెళుతూ మగవాళ్ళు పొందే ఆనందానికి ఒక పేరుంది. దాని పేరు ‘శునకానందం’. దీనికాపేరు ఎందుకొచ్చిందో మీకు తెలుసా? శునకాలు... అదేనండి... కుక్కలు తమ యజమాని కనిపించగానే వెంటనే తోకాడిరచుకుంటూ వచ్చి కాళ్ళకి అడ్డంపడిపోతూ, ఒళ్ళంతా రాసుకుని, పూసుకుని తిరిగేస్తూ ఉంటాయి కదండి. అదన్నమాట. అలాగ ఆడపిల్లలు కనబడగానే ...... కార్చుకుంటూ, వాళ్లని తినేసేలా చూస్తూ, వీలువెంబడి తగులుకుంటూ వెళ్ళే వాళ్ళ ఆనందాన్ని శునకానందం అంటారన్నమాట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంచెం అఫీషియల్‌గా లైన్‌ వేసే వాళ్ళు మరికొందరు. పై పాటలో చెప్పినట్లు రకరకాల పేర్లతో ఏదో పని ఉందనే వంకతో అమ్మాయిల్ని తాకుతూ ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఫ్యాన్సీ షాపుల్లోను, బట్టలషాపుల్లోను, టైలరింగ్‌ షాపుల్లో చూడవచ్చు. విద్యాసంస్థల్లో కూడా ఇటువంటి మాయరోగం చాలా మందిలో గమనించవచ్చు. చదువుకుంటున్న / గతంలో చదివిన ఆడపిల్లల్ని ఎవరినైనా కదిపి చూడండి. ఖచ్చితంగా వాళ్ళ చదువు పూర్తయ్యేలోగా కనీసం ఒకరిద్దరు చిత్తకార్తె శునకాల్ని చూసే ఉంటారు. వీరు పైకి చాలా పెద్దమనుషుల్లా ఉంటారు. అలాగే లోకాన్ని నమ్మిస్తారు. కాని పుస్తకాలు, పెన్నులు ఇచ్చే నెపంతో చేతులు తాకడం, రకరకాల మాటలతో మనసును గాయపరచడం, రకరకాల కారణాలతో ఒళ్ళంతా తడమటం, బల్లమీద వంగి ఏదైనా రాస్తుంటే, వెనక నుంచి ‘ఏదైనా’ కనబడుతుందని తొంగి చూడడం వంటివి ప్రతి అడపిల్ల జీవితంలో ఒకసారైనా జరిగుంటాయి. ఇవి గాక సిటీ బస్సుల్లోను, జనం ఎక్కువగా ఉన్నపుడు రైళ్లలోను ఎక్కితే ఇక ఆ చిట్టితల్లికి నరకం చూపించేందుకు పదుల సంఖ్యలో మానవ మృగాలు సిద్దంగా ఉంటారు. పనిచేసే చోట్ల, కార్యాలయాల్లో కూడా ఈ వికృత చేష్టలు ప్రతి క్షణం కనబడుతూనే ఉంటాయి.

అమ్మాయిలు చేసుకున్న పాపమేమిటో తెలియదు గాని, పేపర్లలో, మ్యాగజైన్లలో, టి.వి.ల్లో, వాల్‌పోస్టర్లలో, హోర్డింగుల్లో, సినిమాల్లో ఇలా ఎక్కడ చూసినా ఆడపిల్లలు సగం సగం బట్టలేసుకుని అవి కొనండి, ఇవి తినండి, ఇది చూడండి, అది వినండి అంటూ చిత్ర విచిత్ర విన్యాసాలతో బొమ్మలుంటాయి. అదేం చిత్రమో అర్థం కాదు. అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి వారి ఫోటో వేసి పబ్లిసిటీ చేయడంలో తప్పులేదు. కాని, అలా సగం సగం బట్టలు వేసి, వారి అభిమానాన్ని అలా నడి బజార్లో నిలబెట్టాల్సిన అవసరం ఉందంటారా? సినిమాల్లో పాటలు చూడండి. మంచు ప్రాంతాల్లో పాటలుంటాయి. చుట్టూ ఎటు చూసినా మంచు కురుస్తూంటూంది. హీరోకేమో పైనుంచి కింద దాకా సూటు, బూటు, కళ్ళకి జోడు. మరి హీరోయిన్‌ సంగతి... పాపం ఆ అమ్మాయి మాత్రం అంత చలిలో కూడా జానా బెత్తెడు బట్టలేసుకుని గంతులేస్తుంది. లేదా వర్షం పాటలో బట్టలన్నీ తడిసిపోయేలా డ్యాన్స్‌ చేస్తుంది. ఎంత డబ్బు తీసుకుంటే మాత్రం... ఆ అమ్మాయికి అభిమానం ఉండదా... మనకు మల్లే సిగ్గు వేయదా అని ఎవరైనా ఆలోచిస్తారా? ఈలలు, కేకలు, థియేటర్‌ దద్దరిల్లిపోతుంది. అందులో మహిళా ప్రేక్షకులు కూడా ఉండొచ్చు. చెప్పలేం.

ఇవన్నీ చదువులేని వారో, మంచి చెడు తెలియని వారో చేస్తున్నారంటే వారిని మార్చడానికి ప్రయత్నించవచ్చు. కాని, చదువుకున్న సంస్కార హీనుల్లో కూడా ఈ నీచత్వం బయటపడుతుంది. అదీ ఎక్కువ మోతాదుల్లో. ఆన్‌లైన్లో చాటింగ్‌ చేసేపుడు గమనించండి. ఎదురుగా ఆడపిల్ల ప్రొఫైల్‌ కనబడగానే స్నేహం పేరు చెప్పి వెంటనే లైన్‌ కలపడం, తరువాత అసభ్యకర పదాలతో వారిని ఏడిపిస్తూ ఆనందించడం. ఈ మద్యన ఒక సర్వేలో తేలిందేమిటంటే... ఆన్‌లైన్‌లో చాట్‌ చేసేటపుడు తమకు పరిచయం లేని ఆడపిల్లలు చాటింగ్‌ మొదలుపెడితే ఒక నిముషంలో లోపలే వారిని అసభ్యకర మాటలతో రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తారట అబ్బాయిలు. ఇదంతా ఒక ఎత్తు. ఈ మధ్య వచ్చిన సెల్‌ఫోన్‌ కెమెరాలు, పెన్‌ కెమెరాలతో అమ్మాయిలకి ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఏ షాపింగ్‌ మాల్‌లో, ఏ హోటల్‌లో, ఏ బాత్‌రూమ్‌లో కెమెరాలు ఉంటాయో, ఎక్కడ తమ వ్యక్తిగత జీవితం నెట్‌ పాలవుతుందోనని ప్రతీ క్షణం అమ్మాయిలు నరక యాతన పడుతున్నారు.

అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలంటే వారు ప్రాణం లేని బొమ్మలు కారు. ఏడిపించుకు తినడానికి, బ్లేడ్‌పెట్టి కోయడానికి దేవుడిచ్చిన ప్రాణులు కాదు అమ్మాయిలంటే.. వారికీ ఒక మనసుంటుంది. మనకు మల్లే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కాని ఖచ్చితంగా అమ్మాయిలు మగవారంత నీచంగా వారు ఆలోచించరు. మగవారికున్న ఫాంటసీలు ఉండవు. అది మాత్రం నిజం. మనకున్న బరితెగించే తత్వం వారి కుండదు. ఆడపిల్లలు సున్నిత మనస్కులు. నిజం చెప్పాలంటే ఆడపిల్లల్ని పువ్వులతో పోల్చవచ్చు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘పుష్ప విలాప కావ్యం’లో చెప్పినట్లు పువ్వులు మొక్కకి ఉన్నంత సేపు ఎంతో అందంగా, ఆనందంగా ఉంటాయి. పువ్వుల్ని చూసి ఆనందించాలే తప్ప, వాటిని కోసి, నునులేత రేకల్ని తెంపేసి, వాటిని నలిపి వాసన చూడాలనే ఆలోచన సరైనది కాదు. అమ్మాయిలకి ఇవ్వాల్సిన గౌరవం  ఇవ్వకపోయినా పర్వాలేదు గాని వారిని అగౌరపరచకుండా ఉంటే చాలు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించనక్కర్లేదు. మన సపోర్ట్‌ వారికి అక్కర్లేదు. కనీసం వారి దారికి అడ్డం రాకుండా ఉంటే చాలు. వారే తమ దారిని తామే వేసుకోగలరు. భువన శిఖరాలను అందుకోగలరు.