కరోనా కాలంలో ‘ఆహా’ ఒ.టి.టి.లో రిలీజైన ఒక చక్కటి మూవీ ‘ప్లే బ్యాక్’. సాధారణంగా తెలుగు సినిమాలలో ఉండే 3 ఫైట్లు, 6 పాటలు అనే రొటీన్‌కి భిన్నంగా చక్కటి కథతో, మరింత చక్కటి స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని తీసారు. ఈ మూవీ కథ కూడా మన ఊహకి అందకుండా ఉంటుంది. ఇటువంటి భిన్నమైన జోనర్‌లో సినిమా చూసిన తరువాత తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్దపెద్ద డైలాగులు, భారీ సెట్టింగులు... ఇటువంటి హడావుడి ఏదీ లేకుండా, కేవలం కథతోనే కట్టిపడేసాడు దర్శకుడు హరిప్రసాద్. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే టైమ్ ట్రావెల్, టైమ్ మెషీన్ వంటి కాన్సెప్ట్‌లతో తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చాయి. ఆదిత్య 369, 24 వంటి మూవీస్‌లో టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకున్నాం. కాని, గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ టైమ్, స్పేస్ కంటిన్యూయమ్‌లో ఒక చిన్న క్రాక్
ఏర్పడి, అప్పటి వారితో ఇప్పటి వారికి కమ్యూనికేషన్ ఏర్పడితే ఏమవుతుందో అనే ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీసాడు దర్శకుడు.
ఇప్పటి వరకు నేను తెలుగు మూవీస్‌కి రివ్యూలు రాయలేదు. నేను తెలుగు సినిమాలు చూడడమే తక్కువ. ఒక వేళ చూసినా, రివ్యూ రాయవలసినంత కంటెంట్ ఉన్న చిత్రాలు ఇప్పటి వరకు నేను చూడలేదు... బహుశా తీయలేదు. కాని ఈ మూవీ చూసిన తరువాత, ఇటువంటి మంచి మూవీని, మంచి అభిరుచి ఉన్న వారు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అనిపించింది.
కథ విషయానికి వస్తే, 1993లో ఉన్న యువతికి, ప్రస్తుతం 2020లో ఉన్న యువకుడికి మధ్య ఒక పాత టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అంటే టైమ్ లైన్‌లో గతంలో ఉండే వ్యక్తులు, ప్రస్తుతం ఉన్న వారు మాట్లాడుకోగలుగుతారు. నిజానికి గతంలో ఉండే యువతి ప్రస్తుతం చనిపోయి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉన్న యువకుడు ఆ విషయం తెలుసుకుని, గతంలో ఉన్న యువతికి సహాయం చేసి, ఏ విధంగా తన ప్రాణాలు కాపాడాడు అన్నది సినిమా కథాంశం. ఆ యువతికి, తన ప్రాణాలు కాపాడిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెబితే సినిమాలో థ్రిల్ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది అమ్మ సెంటిమెంట్. అమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం కొడుకు ఎంత రిస్క్ చేసాడు అనేది కూడా అంతర్లీనంగా చాలా బాగా చూపించారు.
కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. చక్కటి ప్రెజెంటేషన్ చేసాడు. ఎక్కడా ఎటువంటి తికమక లేకుండా గతానికి, వర్తమానానికి మధ్య తేడాని చూపిస్తూ, సాధారణ ప్రేక్షకుడికి కూడా కష్టమైన ఫిజిక్స్ సూత్రాలని అర్ధమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. నటీనటుల్లో ‘వకీల్‌సాబ్’లో నటించిన అనన్య చాలా చక్కటి అభినయం కనబరిచింది. 1993 నాటి ఆమ్మాయిలు ఎంత అమాయకంగా ఉండేవారో అంతే అమాయకంగా నటించింది. నటనా పరంగా తనకి చక్కటి భవిష్యత్తు ఉంది అనిపించేలా చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో చక్కగా నటించారు. కెమెరా పనితనం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంది. మంచి అభిరుచి గల ప్రేక్షకులు తప్పని సరిగా చూడతగిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన మూవీగా ఈ ‘ప్లే బ్యాక్’ ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Thursday, June 10, 2021
ప్లే బ్యాక్ మూవీ రివ్యూ
Subscribe to:
Posts (Atom)