Pages

Sunday, June 23, 2019

గోదారమ్మకి దిక్కెవరు...?



వేసవి కాలం సెలవులకి పిల్లలతో కలిసి రాజమండ్రి విహార యాత్రకు వెళ్ళాము. ముందుగా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర కొంత సేపు ఆగాము. గోదావరి అందాల్ని ఆస్వాదించి, అక్కడి నుండి రాజమండ్రి వెళ్ళాము. గోదావరి గట్టు వెంబడి కార్పొరేషన్‌ వాళ్ళు పెంచిన అందమైన గార్డెన్స్‌ చూడడానికి రోడ్‌ పక్కన కార్‌ పార్క్‌ చేసి, లోపలికి వెళ్ళాము. చాలా అందంగా తీర్చిదిద్దారు. తీరా లోపలికి వెళ్ళాక, మురుగు కంపు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందా అని రైలింగ్‌ నుండి కిందకి చూస్తే, పట్టణంలో ఉన్న మురుగునీటి కాలువని డైరెక్ట్‌గా గోదావరి నదిలోకి పెట్టేసారు. ఎక్కడెక్కడి మురుగు, ప్లాస్టిక్‌, చెత్త అంతా గోదావరిలోకి ప్రవహిస్తుంది. చూసి చాలా బాధేసింది. గోదావరిని తల్లిలా, దైవంలా భావిస్తూనే మురుగు నీటితో కలుషితం చేయడం సబబు కాదు. ఆ నీటినే గోదావరి కింద ఉన్న కొన్ని వందల గ్రామాల వారు త్రాగు నీటిగా, సాగు నీటిగా వాడుతూ ఉంటారు. అటువంటి పవిత్రమైన నదిలోకి ఇలా నిర్దాక్షిణ్యంగా మురుగు నీటిని వదలడం చాలా తప్పు. 

నదులను దేవతలుగా పూజించే సంప్రదాయం మనది. ఒక పక్క పూజలు చేస్తూనే మరో పక్క నదులను కలుషితం చేయడం మనకే చెల్లింది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌ దేశాలలో నదులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. లండన్‌ మధ్య నుండి ప్రవహిస్తున్న థేమ్స్‌ నది కానివ్వండి, పారిస్‌ నగరంలో ప్రవహిస్తున్న డాన్యూబ్‌ నదిని కాని, అక్కడి ప్రజలు చాలా గౌరవంగా చూసుకుంటారు. మనలాగా పూజలు, పండుగలూ చేయకపోయినా, నదుల్ని కలుషితం కానివ్వరు. నీరు స్వచ్ఛంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ నీటిలో ఉండే జలచరాలకు కూడా ఎటువంటి హాని కలుగనివ్వరు. 

ఇదే శ్రద్ధ మనమెందుకు తీసుకోలేము. గోదావరి, కృష్ణాతో పాటుగా రాష్ట్రంలో ప్రవహించే జలవనరుల్ని జాగ్రత్తగా కాపాడుకుని, ముందు తరాలకి అందించవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రభుత్వం, అధికారులు దీని మీద శ్రద్ద వహించి, మురుగు నీటిని ఆధునిక పద్దతుల ద్వారా శుద్దిచేసి, దాన్ని మొక్కలు పెంచడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నీరు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా, ప్రజల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.