ఈ శతాబ్దంలోనే అద్బుతమనదగిన సంపూర్ణ సూర్య గ్రహణం ఈ రోజు చోటు చేసుకుంది. ఈ గ్రహణం సామాన్య ప్రజల నుండి, శాస్త్రవేత్తల వరకు అందరి లోనూ అలజడి కలిగించింది. శాస్త్రవేత్తలు తమకు ఎంతో కాలం తరువాత చేతి నిండా పని దొరికింది, సూర్యుడి గురించి మరిన్ని కొత్త విషయాలు పరిశోధన చేయవచ్చని అనుకుంటే, సామాన్య ప్రజలు తమ తమ విశ్వాసాలననుసరించి తగు జాగ్రత్తలు పడ్డారు.
ఈ సందడి చాలదన్నట్లు మద్యలో జన విజ్ఞాన వేదిక వారు ఈ అరుదయిన సంఘటన ద్వార జనాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలనుకున్నారో ఏమో తెలీదు కాని, కొత్త వివాదాలని తెరపైకి తీసుకు వచారు. గ్రహణం రోజున దేవాలయాలు మూయవద్దని, తెరిచేవుంచమని, గ్రహణం జరిగే సమయంలో భోజనాలు చెయ్యమని ఇలా కొత్త ప్రయోగాలు చెయ్యమని జనాలకి ఊదరగొడుతున్నారు. గ్రహణం వలన ఎటువంటి ప్రమాదము లేదని
చెప్పడం వీరి వుద్దేశం కావచ్చు. వీటివల్ల వుపద్రవాలు, యుద్దాలు, సునామీలు, వుప్పెనలు వస్తాయనే అపోహలనించి సామాన్య ప్రజల్ని బయట పడేయాలనుకోవడం మంచిదే. కాని ఈ సారి మాత్రం కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనబడుతుంది. మానవ శరీరంపై కూడా గ్రహణాల వల్ల ఎటువంటి ప్రభావం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసారు. పూర్తిగా ౠజువుకాని, పరిశోధనలు జరగని, ప్రజల విశ్వాసాలకి సంబందించిన ఇటువంటి విషయాలలో తలదూర్చే ముందు కొంచెం ఆలోచించుకుని వుండాల్సింది.
గ్రహణం వల్ల మనిషిపై ఎటువంటి ప్రభావం లేదని అంటున్నారు. అది నిజమే అయితే గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడవద్దని చెబుతున్నారు? కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందనే కదా. అంటే ఆ సమయంలో ఏర్పడిన కిరణాల రేడియేషన్ ప్రభవం మన మీద పడినట్లే కదా? మరి అలాంటి సున్నితమయిన అవయవాలు శరీరంలో ఎన్ని వున్నాయో మీకు తెలుసా? వాటి మీద రేడియేషన్ ప్రభావం ఎంత ఉందో ఎవరయినా అధ్యయనం చేసారా? వాటి వివరాలు మీ దగ్గర వున్నాయా? గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను బయటకి రావద్దనడానికి కూడా వెనుక ఇటువంటి శాస్త్రీయ కారణం వుండొచ్చు కదా? ఇప్పుడు గొప్ప కోసం, మీ ప్రాచుర్యం కోసం సామాన్య ప్రజల్ని గ్రహణం సమయంలో భోజనం చెయ్యమని చెబుతున్నారు. మీరు తింటున్నారు. దీర్ఘ కాలంలో ఆ ఆహారం వల్ల ఏదయినా జరగరానిది జరిగితే మీరు దానికి బాధ్యత వహిస్తారా?
సూర్యుడి నుంచి గ్రహణం సమయంలో వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని మన పూర్వీకులు సరిగ్గానే అంచనా వేసారనే విషయాన్ని మర్చిపోవద్దు. పూర్వం నుంచి ఒక జాతి మొత్తం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించే ముందు మనం దానికి సమర్దులమా కాదా అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. గ్రహణ సమయాన్ని, సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆర్యభట్టు మన దేశానికి చెంది వాడేనని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ అంశాలపై భారతీయులు పట్టు సాదించారని మరచిపోతే ఎలాగ?
ప్రజలలో మూడ నమ్మకాలని పారద్రోలాలనుకుంటే మంచిదే. దొంగ బాబాలు, స్వాముల నుంచి, గుడ్డిగా అనుసరిస్తున్న మూఢ నమ్మకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకోవడం మంచి ప్రయత్నమే. దాన్ని అందరూ స్వాగతిస్తారు కూడా. కాని, జీవన విధానంలో అనుసరించే ప్రతీ విశ్వాసాన్ని, ప్రతీ ఆలోచనని తప్పు పడుతూ కూర్చుంటే, సామాన్య ప్రజలు తాము అనుసరిస్తున్నది ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని చిక్కుల్లో పడతారు.