Pages

Wednesday, December 31, 2008

నా కానుక... నూతన సంవత్సర పంచాంగం కాలండర్.

తెలుగు వారందరికీ, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగ్రవాదం లేకుండా ఉండాలని, ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు చెయ్యకుండా ఉండాలని, అవినీతి లేని రోజు రావాలని, మరీ ముఖ్యంగా ధరలు పెరగకుండా ఉండాలని, ఇలా చాలా కోరికలున్నాయి గాని, ప్రస్తుతానికి అవి తీరకపోయినప్పటికి, ఎప్పటికయినా తీరాలని, దానికి ఈ సంవత్సరమే నాంది కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

ఇక, నేను ఇవ్వబోయే కానుక విషయం... చక్కటి తెలుగు పంచాంగం కాలండర్. తిరుమల తిరుపతి దేవస్తానం ఆస్తాన సిద్దాంతి అయిన బ్రహ్మశ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన నూతన సంవత్సర పంచాంగం కాలండర్ PDF ఫైల్ ని మీకు కానుకగా అందిస్తున్నాను. మల్టి కలర్‌లో డిజైన్ చేసిన ఈ కాలండర్, దేశ, విదేశాలలో వున్న తెలుగు వారికి నచ్చుతుందని, వుపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆ ఫైల్‌కి సంబందించిన లంకెలు ఈ క్రింద ఇచ్చాను. మీ వీలుని బట్టి ఎక్కడినుంచయినా download చేసుకోవచ్చు.

rapidshare

mediafire

Tuesday, December 30, 2008

మరలా మీ అందరి ముందుకు... కొత్త సంవత్సర కానుకతో

అందరికీ హాయ్,
మళ్ళీ చాలా కాలం తరువాత, మీ ముందుకు వచ్చాను. మధ్యలో ఎవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీతో నా మనసులో మాట పంచుకోలేక పోయినందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఏమీ బ్లాగక పోయినా, మధ్య మధ్యలో అందరి గురించి కూడలి లో తెలుసుకుంటూనే వున్నాను లెండి. నూతన సంవత్సరం సందర్భముగా మీ అందరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆ గిఫ్ట్ ఏమిటో మీలో ఎవరయినా ఊహించగలరా. ఒక ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా నేనివ్వబోయే కానుక ఏమిటో ఊహించండి. లేకపోతే రేపటి దాకా ఎదురుచూడండి.

మరో చిన్నమాట, అందరికీ వీలుగా వుండే File sharing site ఎమన్నా వుంటే చెప్పగలరు. PDF వంటి ఫైల్స్ వంటివి. ఇక నుంచి మళ్ళా ఎప్పటిలాగానే మీ ముందుకు వస్తూ వుంటాను. మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటూ... మీ జగదీష్.

Thursday, August 28, 2008

నైతిక విలువలతో కూడిన లైంగిక విద్య అవసరం.

లైంగిక విద్య గురించి తాడేపల్లి వారు రాసిన టపా చదివాను. చాలా చక్కగా పాజిటివ్ గా రాసారు. ఆయన అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. భారతీయులు లైంగిక విషయాలలో గోప్యతగా ఉంటారని ఎందుకు అంటారో నాకు అర్ధం కాదు. మన సాహిత్యమంతా శృంగార మయమే కదా. శ్రీ కృష్ణుని భక్తి శృంగారం గురించి తెలియని వారుండరు. శ్రీనాధుని శృంగార నైషధం గానివ్వండి, అన్నమయ్య కీర్తనల్లో వర్ణించి సరస శృంగార కీర్తనలు కానివ్వండి, దేవాలయాల్లో కనిపించే బొమ్మలు కానివ్వండి. ఇవన్నీ స్త్రీ పురుష సృష్టి కార్యాన్ని చక్కగా వర్ణిస్తాయి. అయితే మధ్య యుగాల్లో వచ్చిన సామాజిక మార్పుల వల్ల కానివ్వండి, లేదా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడ్డ విక్టోరియన్ ఆలోచనా ధోరణి వల్ల కానివ్వండి, మన దేశంలో లైంగికత అనేది బూతుకి ప్రత్యామ్నాయంగా స్తిరపడిపోయింది. నిజానికి శృంగారం వేరు, బూతు వేరు, భార్యా, భర్తల మధ్య ఉండేది శృంగారమయితే, పబ్లిక్‌గా నలుగురిలోను వెకిలిగా మాట్లాడేది బూతు అనవచ్చు.


ఇక లైంగిక విద్య విషయానికి వస్తే, లైంగిక విద్యని పాఠశాల స్తాయిలో నేర్పవలసిన అవసరంలేదని నా ఉద్దేశ్యం. ఇంటర్ స్తాయి నుండి నేర్పించవచ్చు. అది కూడా సురక్షితమయిన లైంగిక విద్య గురించి చెపుతూనే, నైతికతని కూడా బోధించాలి. మన సాహిత్యంలో వున్న ఎన్నో ఉదాహరణలను, కధలను విద్యార్ధులకి బోధించి, పర స్త్రీ పట్ల పురుషులు ప్రవర్తించవలసిన తీరు, పర పురుషుడి పట్ల స్త్రీలు ప్రవర్తించవలసిన తీరు గురించి కూడా చెబితే, పిల్లలు ధర్మ బద్దమయిన లైంగిక జీవితానికి, విచ్చలవిడితనానికి మధ్య గల తేడా తెలుసుకుంటారు. నిజానికి వేదాల్లో మానవ జీవితానికి అతి ముఖ్యమయిన పురుషార్ధాలను గురించి చెప్పారు. అవి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. వైదిక జీవనం ప్రకారం, మానవులు ముందుగా ఆచరించవలసింది ధర్మం. ఆ ధర్మాన్ని తప్పకుండా , మిగిలిన అర్ధాన్ని, (బ్రతకడానికి అవసరమయిన డబ్బుని,), అదే ధర్మాన్ని తప్పకుండా, వివాహమాడిన స్త్రీ ద్వారా కామన్ని (సంతానం పొండనికి మత్రమే కామం ఉద్దేశించబడింది), మోక్షాన్ని కూడా సాధించమని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో చెప్పినట్లు కేవలం స్త్రీ పురుష బాహ్య అవయవాల గురించి అసహ్య కరమయిన వర్ణనలు , అవి పనిచేసే విధానం, తప్పు చేసేటప్పుడు (అంటే ఎవరితోనయినా శృంగారం చేయండి, కాని ఫలాని జాగ్రత్తలు తీసుకోండి) అనే పిచ్చి ఆలోచనలు పిల్లల మనసులపై దుష్ప్రభావం చూపుతాయి. తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది. ఇప్పటి వరకు లైంగిక విద్యని వ్యతిరేకించే వాళ్ళు ముఖ్యంగా చెప్పే విషయం ఇదే. దాని కన్నా, నైతికత, సమాజంపట్ల బాధ్యతగా వ్యవహరించడం, పర స్త్రీ లేదా, పురుషుల పట్ల మర్యాదగా వ్యవహరించడం వంటి వాటికి కూడా లైంగిక విద్యలో స్తానం కల్పించడం వంటివి చేస్తే, అది ఆరోగ్యకరమయిన సమాజానికి దోహదం చేస్తుంది. ప్రజల్లో లైంగికత పట్ల వుండే వ్యతిరేకత కూడా పోతుంది.

Monday, August 4, 2008

తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలి


తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, తాడేపల్లిగూడెంలో తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహశిల్దారుకి ఒక వినతి పత్రం సమర్పించాము. ఆ సంఘటన యొక్క వివరాలు "సాక్షి" పేపర్లో ప్రచురించినప్పటిదీ క్లిప్పింగ్. ఈ ఫోటోలో ఎడమవైపు మొదట వున్నది నేను. సమాఖ్యలో గత పది సంవత్సరాలుగా సభ్యునిగా వున్నాను. మిగతా సాహితీ మితృలతో కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాము. అనంతరం తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి, దాన్ని ప్రాచీన భాషగా గుర్తించదానికి గల అర్హత గురించి సమావేశంలో చర్చించడం జరిగింది.