Pages

Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Monday, June 27, 2022

మాతృభాషను మరవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారు


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, మన తెలుగువాడు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గారు విదేశీ గడ్డపై తనకున్న తెలుగు భాషాభిమానాన్ని చాటిచెప్పారు. ఆయన గతంలో కూడా ఎన్నో సార్లు ఎన్నో వేదికలపై తెలుగు భాష గొప్పదనాన్ని ఉటంకించారు. ప్రతి మనిషికి కన్నతల్లి, పుట్టినగడ్డ, అమ్మభాషపై మమకారం అత్యంత సహజం. కాని దానిని కాదనుకుని పరభాషపై మమకారాన్ని పెంచుకోవడం కన్నతల్లిని కాదని సవతి తల్లి పంచన చేరడం వంటిదే. 

ఎన్నో సొబగులు, అలంకారాలు, నుడికారాలు, పలకడంలో కమ్మదనం వంటివి తెలుగు భాషకు ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టాయి. కేవలం శబ్ద సౌందర్య పరంగానే కాక, అక్షరాలు కూడా ఎంతో పొందికగా, బింకంగా ఉంటూ పలికేవారితో పాటు, చూసేవారికి కూడా చవులూరిస్తాయి తెలుగు అక్షరాలు. ‘‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’’ అంటారు ప్రముఖ కవి మన్నెంకొండ బాలగంగాధర్‌ తిలక్‌. ఆధునిక కవులతో పాటు, తెలుగు కన్నడ నేలల్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కవి రాజు ‘‘శ్రీకృష్ణదేవరాయలు’’ చక్రవర్తి మాత్రమే కాక స్వయంగా కవి కూడా. ఆయన రాసిన ‘‘ఆముక్త మాల్యద’’ కావ్యం అజరామరమైనది. అటువంటి మహారాజు నోటివెంట ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని వినడమే ప్రతి తెలుగు వాడికి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషకున్న గొప్పదనాన్ని గ్రహించినందువల్లనే తెలుగులో విశేష కృషి సలిపి, మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువును వెలువరించాడు. ఆయన నిఘంటువుని పరిశీలిస్తే, కేవలం తెలుగుకు ఆంగ్లపదాన్ని చెప్పడమే కాకుండా, ఆయా పదాలు రామాయణ, భారత పురాణాలు, వేమన, సుమతీ శతకాలలో ఏఏ సందర్భాలలో ప్రస్తావించబడ్డాయో సోదాహణగా తెలియజేసారు. అటువంటి బ్రౌణ్య నిఘంటువును తిరిగేస్తే చాలు, తెలుగు భాష కరతలామలకమవుతుంది. తెలుగు అజంత భాష. అంటే తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. దాని వలన తెలుగుని రాగయుక్తంగా పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అందుకే యూరోపియన్‌ భాషల్లో మరో అజంత భాష అయిన ‘‘ఇటాలియన్‌’’తో పోల్చి ‘‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’’ అని యూరోపియన్‌ పండితులచే కీర్తించబడిరది. పోతన పద్యాలు, అన్నమయ్య పదకవితలు తెలుగుకున్న సహజసిద్దమైన అందాన్ని మరింత ఇనుమడిరపజేసాయి అనడంలో సందేహం లేదు. అక్షర సేద్యం చేసే కవులకు, అవధానం చేసే పండితులకు, రాగాలు తీసే గాయకులకు అత్యంత అనువైన మనోహరమైన భాష తెలుగు మాత్రమే. అందుకే జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు తెలుగుని పల్లకిలో పెట్టుకుని, ప్రపంచమంతా మోస్తున్నారు. ఒక తెలుగు వాడిగా ప్రతి ఒక్క తెలుగు వాడికి అనుసరణీయుడు అవుతున్నారు.

ఇటీవలి కాలంలో అమ్మభాషను నిదారించడం ఒక సరికొత్త పోకడగా మొదలయింది. పొట్టకూటి కోసం అయితేనేమి, నలుగురిలో గొప్పగా చెలామణి అయ్యే పేరుతోనేమి పరభాషా మోజు పట్టి, తెలుగును భ్రష్టుపట్టిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ప్రజలకు మాతృభాషను దూరంచేసే పనిలో పోటీ పడుతున్నారు. అసలు తెలుగు నేర్చుకొంటేనే అదేదో నేరం అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు నేటి పాలకులు. పరాయి భాషను నేర్చుకుంటేనే అభివృద్ధి అని, మనం బ్రతకాలి అంటే అమ్మభాషను చంపేయాలని సుద్దులు చెబుతున్నారు. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు మాతృభాషలోనే చదువుకుని అత్యున్నత స్థానాల్ని అలంకరించారనేది విస్మరించరాదు. వీధి బడిలో చదువుకుని రాష్ట్రపతులు అయినవారు ఉన్నారు. గొప్ప శాస్త్ర వేత్తలుగా అనేక ఆవిష్కరణలు చేసిన వారు కూడా ప్రభుత్వ బడిలోనే ఓనమాలు దిద్దిన వారు అనేది మరువకూడదు.

ప్రపంచంలో ఎన్నో నాగరిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మాతృభాషలో చదవడం వల్లనే గొప్ప దేశాలుగా మారాయి. జర్మనీ, జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌ వంటి చాలా దేశాల్లో ఇప్పటికీ మాతృభాషకే అగ్రతాంబూలం. ఆంగ్లాన్ని కేవలం అవసరం వరకే నేర్పుతారు. అంతే గాని, పరాయి భాష నేర్చుకొన్నంత మాత్రాన గొప్పవారయి పోతారు అనేది ఒట్టి అపోహ మాత్రమే. పిల్లల్ని ఇంట్లో తాము మాట్లాడే భాష నుండి దూరం చేసి, ఇంగ్లీష్‌లో చిలుకపలుకులు నేర్పితే, వారు బానిస బుద్దితో బయటకు వస్తారు తప్ప, స్వతంత్ర ఆలోచనా పరులై దేశాన్ని ఉద్దరించేది ఏదీ ఉండదు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఒక వేళ బయట బళ్ళో ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదువు నేర్పినప్పటికీ ఇంట్లో తెలుగులో మాట్లాడడం, తెలుగు సంస్కారాన్ని గరపడం, తెలుగు బంధాల్ని అల్లుకోవడం వంటివి పిల్లలకు నేర్పడం తమ బాధ్యతగా చేసుకోవాలి. మాతృభాషని మరిచిన సమాజం చుక్కాని లేని నావలాగా దిక్కులేనిదిగా మారుతుంది. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి భాష ఒక మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి, తెలుగుని పరిరక్షించుకుని, మంచి సమాజం వైపు అడుగులు పడాల్సిన అవసరాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు మరొక్క సారి గుర్తు చేసారు.

Thursday, June 10, 2021

ప్లే బ్యాక్‌ మూవీ రివ్యూ

     కరోనా కాలంలో ‘ఆహా’ ఒ.టి.టి.లో రిలీజైన ఒక చక్కటి మూవీ ‘ప్లే బ్యాక్‌’. సాధారణంగా తెలుగు సినిమాలలో ఉండే 3 ఫైట్లు, 6 పాటలు అనే రొటీన్‌కి భిన్నంగా చక్కటి కథతో, మరింత చక్కటి స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని తీసారు. ఈ మూవీ కథ కూడా మన ఊహకి అందకుండా ఉంటుంది. ఇటువంటి భిన్నమైన జోనర్‌లో సినిమా చూసిన తరువాత తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్దపెద్ద డైలాగులు, భారీ సెట్టింగులు... ఇటువంటి హడావుడి ఏదీ లేకుండా, కేవలం కథతోనే కట్టిపడేసాడు దర్శకుడు హరిప్రసాద్‌. హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే టైమ్‌ ట్రావెల్‌, టైమ్‌ మెషీన్‌ వంటి కాన్సెప్ట్‌లతో తెలుగులో కూడా చాలా మూవీస్‌ వచ్చాయి. ఆదిత్య 369, 24 వంటి మూవీస్‌లో టైమ్‌ ట్రావెల్‌ గురించి తెలుసుకున్నాం. కాని, గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ టైమ్‌, స్పేస్‌ కంటిన్యూయమ్‌లో ఒక చిన్న క్రాక్‌

ఏర్పడి, అప్పటి వారితో ఇప్పటి వారికి కమ్యూనికేషన్‌ ఏర్పడితే ఏమవుతుందో అనే ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీసాడు దర్శకుడు.

ఇప్పటి వరకు నేను తెలుగు మూవీస్‌కి రివ్యూలు రాయలేదు. నేను తెలుగు సినిమాలు చూడడమే తక్కువ. ఒక వేళ చూసినా, రివ్యూ రాయవలసినంత కంటెంట్‌ ఉన్న చిత్రాలు ఇప్పటి వరకు నేను చూడలేదు... బహుశా తీయలేదు. కాని ఈ మూవీ చూసిన తరువాత, ఇటువంటి మంచి మూవీని, మంచి అభిరుచి ఉన్న వారు ఎవ్వరూ మిస్‌ అవ్వకూడదు అనిపించింది. 

కథ విషయానికి వస్తే, 1993లో ఉన్న యువతికి, ప్రస్తుతం 2020లో ఉన్న యువకుడికి మధ్య ఒక పాత టెలిఫోన్‌ ద్వారా కమ్యూనికేషన్‌ ఏర్పడుతుంది. అంటే టైమ్‌ లైన్‌లో గతంలో ఉండే వ్యక్తులు, ప్రస్తుతం ఉన్న వారు మాట్లాడుకోగలుగుతారు. నిజానికి గతంలో ఉండే యువతి ప్రస్తుతం చనిపోయి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉన్న యువకుడు ఆ విషయం తెలుసుకుని, గతంలో ఉన్న యువతికి సహాయం చేసి, ఏ విధంగా తన ప్రాణాలు కాపాడాడు అన్నది సినిమా కథాంశం. ఆ యువతికి, తన ప్రాణాలు కాపాడిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెబితే సినిమాలో థ్రిల్‌ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది అమ్మ సెంటిమెంట్‌. అమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం కొడుకు ఎంత రిస్క్‌ చేసాడు అనేది కూడా అంతర్లీనంగా చాలా బాగా చూపించారు. 

కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. చక్కటి ప్రెజెంటేషన్‌ చేసాడు. ఎక్కడా ఎటువంటి తికమక లేకుండా గతానికి, వర్తమానానికి మధ్య తేడాని చూపిస్తూ, సాధారణ ప్రేక్షకుడికి కూడా కష్టమైన ఫిజిక్స్‌ సూత్రాలని అర్ధమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. నటీనటుల్లో ‘వకీల్‌సాబ్‌’లో నటించిన అనన్య చాలా చక్కటి అభినయం కనబరిచింది. 1993 నాటి ఆమ్మాయిలు ఎంత అమాయకంగా ఉండేవారో అంతే అమాయకంగా నటించింది. నటనా పరంగా తనకి చక్కటి భవిష్యత్తు ఉంది అనిపించేలా చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో చక్కగా నటించారు. కెమెరా పనితనం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాకి హైలైట్‌ గా ఉంది. మంచి అభిరుచి గల ప్రేక్షకులు తప్పని సరిగా చూడతగిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన మూవీగా ఈ ‘ప్లే బ్యాక్‌’ ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Monday, January 12, 2015

కొత్తా దేవుడండీ... కొంగొత్తా దేవుడండీ... ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండీ...

    ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్‌మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, చూడలేక తల బొప్పికట్టి వాచిపోయింది.

    అర్థరాత్రి దాటింది. బ్లాగులు చదువుతూ, ఆలోచిస్తూ, బుర్రకి ఓపిక లేక, అలాగే ఒక కునుకు పట్టింది.... అంతలో... కంప్యూటర్‌ నుండి 'టింగ్‌' మని ఫేస్‌బుక్‌ మెసేజ్‌లా ఒక వింత శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఇంత అర్థరాత్రి ఎవరా అని ఆలోచిస్తూ, బద్దకంగా కళ్ళుతెరిచి చూసే సరికి... నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్‌పై లెటర్స్‌ వాటంతట అవే టైప్‌ అవుతున్నాయి. అది కూడా వర్డ్‌ డాక్యుమెంట్‌ ఓపెన్‌ చేసి మరీను. ఫేస్‌బుక్‌లో అయితే అవతల ఎవరో టైప్‌ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదాయే. సరే ఏమిటో చదువుదామని చూసాను. దాంట్లో ఇలా టైప్‌ అవుతూ ఉంది.

    ''మీరందరూ లేని దేవుళ్ళ గురించి దేవుళ్ళాడుతున్నారు. మూర్ఖులారా! నేనే మీ నిజమైన దేవుడిని'' అని ప్రత్యక్షమయ్యింది.

    ''నేను అంటే ఎవరు'' అని నా మనసులో అనుకున్నానో లేదో, దానికి సమాధానం టైప్‌ అవ్వడం మొదలెట్టింది.

    ''నా పేరు క్రిస్లా. నేనే మీ దేవుడిని. ఈ సమస్త సృష్టిని ఒక్క ప్రోగ్రామ్‌తో రన్‌ చేసిన వాడిని. నేనే అసలైన దేవుడిని'' అని టైప్‌ అయింది. ''మరి ఇప్పుడు వరకు తమరు ఎక్కడ ఉన్నారో'' అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

    ''అందుకే నిన్ను నా దూతగా పంపాను. నా గురించి నీకే చెప్పింది కూడా అందుకే. నువ్వు నా గురించి ప్రపంచంలో అందరికీ చెప్పి, అందరినీ నా అనుచరులుగా చెయ్యి'' అని కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద వచ్చింది.

    నన్ను దూతగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ''మరి నేనేమి చేయాలి'' మనసులోనే ప్రశ్నించుకున్నాను.

    ''నేను కంప్యూటర్‌ దేవుడిని. ప్రపంచంలో కంప్యూటర్‌ జ్ఞానులు, కంప్యూటర్‌ అజ్ఞానులు అని రెండు రకాలు ఉన్నారు. కంప్యూటర్‌ జ్ఞానులందరికీ నేనే దేవుడిని. నేను తప్ప మీ ఎవ్వరికీ మరో దేవుడు ఉండరాదు. ఎవ్వరినీ పూజించరాదు. కంప్యూటర్‌లో నా బొమ్మలే స్టోర్‌ చేసుకోవాలి. నా కీర్తనలే ఎమ్‌పి3 సాంగ్స్‌గా ఉండాలి. మరో దేవుడి గురించి మీ ఎవ్వరి కంప్యూటర్‌లో అయినా కనబడిందా.. ఖబడ్దార్‌... లోకంలోని అన్ని కంప్యూటర్‌ వైరస్‌లు మీ కంప్యూటర్‌లోనే చొరబడేలా చేసి, మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాను. మీ గ్రంధాలు, పురాణాలు అన్నీ వట్టి ట్రాష్‌, నేను చెప్పేదే ఇకమీదట నీకు పవిత్ర గ్రంధం. మిగిలిన ఫైల్స్‌ అన్నీ వెంటనే డిలీట్‌ చేసెయ్‌. అది నీ నుంచే మొదలవ్వాలి.'' అని టైప్‌ అయ్యింది.

    ''మరి దానికి నేనేమి చేయాలి'' అని మనసులో అనుకున్నాను.

    దానికి సమాధానం కూడా వెంటనే ప్రత్యక్షం.. ''ఈ టపాను ఎవరైతే చదివారో వారు తమకు తెలిసిన వారందరి చేతా చదివించాలి. నా గురించి మంచి వార్తను అన్ని ఛానళ్ళలో వెంటనే ప్రసారం చేయించాలి. నన్ను నమ్మని వాడెవడైనా ఏమిటి అని ప్రశ్నిస్తే, వాడి కంప్యూటర్‌లోకి వైరస్‌ పంపుతాను. అది నా దృష్టికి ఎంతో విలువ కలది. మీరు కూడా నన్ను నమ్మని వారి కంప్యూటర్‌లోకి వైరస్‌పెట్టి, చెత్త కామెంట్లను పోస్ట్‌ చేయండి. అలా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది''.

    ఒక్క సారి బుర్ర గోక్కున్నాను. ఇదేమిటి? ఇప్పటి వరకు మానవత్వమే మన మతం కదా... ఏదో చిన్న చిన్న ఫైల్స్‌ అందరితోను ఇచ్చిపుచ్చుకుంటున్నాము కదా. ఎవరైనా వైరస్‌ బారిన పడినా మనమే సహాయం చేస్తున్నాము కదా. ఈ దేవుడేమిటి? తనను నమ్మకపోతే చాలు నీ శత్రువుగా ఎంచి, వారిని నాశనం చేయమంటున్నాడు? పైగా అలా చేస్తే స్వర్గంలో సీటు గ్యారంటీ అంటున్నాడు? నా మట్టి బుర్రకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఏదో టైప్‌ అవుతుంటే, నా కెందుకొచ్చిన గొడవ అని ఆ ఫైల్‌ని క్లోజ్‌ చేసేసాను. అంతే... ఒక్కసారిగా నా సిస్టమ్‌ ఆగిపోయింది. మెరుపులు మెరిసి, నవ్వుతున్న పుర్రె బొమ్మ ప్రత్యక్షం  అయింది. అంటే... దేవుడు నిజమే నన్న మాట. ఈ మాటను ఇప్పుడే అందరికీ తెలియచెప్పాలి. ఈ కొత్త మతానికి నేను దూతను అన్న విశ్వాసం నాకు బలపడిపోయింది. ఆనందంతో ఎగిరి గంతేద్దామని అనుకున్నాను. ఎవరో గట్టిగా కుదిపినట్లయింది. ఎదురుగా మా ఆవిడ. లేచి చూస్తే తెల్లగా తెల్లారిపోయి ఉంది. రాత్రి నుండి పడుకోకుండా కంప్యూటర్‌ దగ్గర ఏమిటా పనులు? ఇలాగయితే ఆరోగ్యం ఏమి కాను అంటూ మందలిస్తోంది. ''నయమే, ఇదంతా నిజమని నమ్మి, అందరికీ చెప్పాను కాను...'' అనుకుంటూ స్నానానికి బయల్దేరాను.

Friday, September 5, 2014

నేను - నాన్న - సోవియట్‌ పుస్తకాలు

        సోవియట్‌ పుస్తకాల గురించి గుర్తు చేసుకోవడమంటే బాల్యాన్ని తట్టిలేపడమే. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, అన్నింటినీ మించి, ఎంతో విజ్ఞానం - వినోదం - ఆహ్లాదం. ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు గాని, పాత తరంలో పుస్తకాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా రష్యా సాహిత్యంతో సాన్నిహిత్యం ఉండే తీరుతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రచ్చన్న యుద్దం మొదలైంది. అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరులో భారత్‌ ఎవరివైపు మొగ్గు చూపాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితిలో అప్పటి ప్రధాని నెహ్రూ, రష్యాతో మైత్రి చేసుకున్నాను. నవ భారత్‌ను నిర్మించడానికి వీలుగా రష్యా మనకు పొరుగుదేశంగాను, అప్పట్లో కమ్యూనిజం వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగాను, ఆ దేశంలో స్నేహ బంధం కొనసాగింది. అదిగో... అప్పుడే రష్యన్లు మాయ చేసారు. ఇక్కడి వారిలో తమ భావజాలాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలతో పాటు, బాల సాహిత్యాన్ని కూడా పరిచయం చేసారు. అలా వచ్చినవే తెలుగులో రష్యన్‌ పుస్తకాలు. అవన్నీ అద్భుతమైన రంగుల్లో ముద్రించబడి, సాంకేతికంగా గాని, సాహిత్యపరంగా గాని, అత్యున్నత స్థాయిలో ఉండేవి.

        నాకు ఆరేళ్ల వయసులో అనుకుంటా - మా నాన్న గారు - మొట్టమొదటి రష్యన్‌  పుస్తకాన్ని పరిచయం చేసారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ''మాయ గుర్రం - మేటి గుర్రం''. ఆ బొమ్మలతోనే మంత్ర ముగ్దుణ్ని అయిపోయేను. ఆ బొమ్మలలో ఉన్న కథ కోసం ప్రతీ అక్షరాన్ని కూడబలుక్కునే వాడిని. నాన్న సాయం చేసేవారు. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరమూ నాకు గుర్తే. ఎంతలా ఆ పుస్తకం నచ్చేసిందంటే, ఇప్పటికీ నా పెర్సనల్‌ లైబ్రరీలో ఆ పుస్తకం పదిలంగా ఉంది. నా రెండవ తరగతిలో నేను క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినపుడు నాకు వచ్చిన బహుమతి ''ఉన్నారు ఇలాంటి అబ్బాయిలు''. ఎంత అందమైన పుస్తకం అది... నా తమ్ముడికేమో ''వర్థిల్లాలి సబ్బు నీళ్ళు'' వచ్చింది. దాన్ని చూసి అందరం ఏడిపించే వాళ్ళం. వీడెప్పుడూ శుభ్రంగా ఉండడు. అందుకే వీడికి ఇలాంటి పుస్తకం బహుమతిగా వచ్చింది అని. నాన్నారి చిన్నతనంలో కథతో పాటుగా ఎన్ని నీతులు నేర్చుకున్నామని? నొప్పి డాక్టరు కథని ఎన్నిసార్లు చదివామో, ముసలి వర్వారాను అన్నే సార్లు తిట్టుకొనే వాళ్ళం - జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. రంగు రంగుల చేపలతో పాటు అక్వేరియంలో విహరించేవాళ్ళం. ఆకుపచ్చని ద్వీపం, మొసలి కాజేసిన సూర్యుడు, మత్స్య మిత్రుడి మంత్ర మహిమ వంటి ఎన్నో పుస్తకాల్లో మునిగి తేలేవాళ్ళం. వెర్రి వెంగళాయ ఇవానుష్క అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా తన లాగా జార్‌ చక్రవర్తి కూతురు - అందాల భరిణెలాంటి అమ్మాయిని మాయ గుర్రం ఎక్కి వెళ్ళి పెళ్ళాడకపోతామా అని ఆశ.

        కొంచెం పెద్దయ్యాక ''భూమి ఇలా ఉందని ఎలా కనిపెట్టారు'' చదువుతూ, భూ ప్రపంచం చివరి అంచుల దాకా వెళ్ళి వచ్చేసాను. ''టెలిస్కోప్‌ చెప్పిన కథలు''లో అయితే సూర్యుడి దగ్గర నుండి ప్లూటో వరకు ప్రయాణం కొనసాగింది.  ప్రాచీన ప్రపంచ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల చరిత్రను బొమ్మల్లో చూడడం ఎవరు మరిచిపోగలరు? మానవుడే మహాశక్తి సంపన్నుడు'' లో కొన్ని లక్షల సంవత్సరాలుగా మానవుడు ఎలా పరిణామం చెంది, ఇప్పటి స్థితికి చేరుకొన్నాడో అనే విషయాన్ని ఎంత ఆసక్తి కరంగా చదివానో, ''ఖగోళ శాస్త్రం- వినోదం, విజ్ఞానం''లో కాల్పనిక కథల్నీ అంతే ఆసక్తికరంగా గుక్కతిప్పుకోకుండా చదివాను. కాల్పనిక కథలంటే గుర్తుకు వచ్చింది - ఇకతియాండర్‌, గులాబీ మేఘాలు, ప్రతిబింబాలు ఈ పుస్తకాలన్నీ ఎన్ని సార్లు చదివానో ఊహా ప్రపంచంలో విహరించానో, వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యమంతా రష్యన్‌ పుస్తకాలతోనే గడిచిపోయింది  - నిండిపోయింది. ప్రపంచ చరిత్ర నుండి అణు విజ్ఞానం వరకు, చిన్న పిల్లల కథల నుండి సైన్స్‌ ఫిక్షన్‌ వరకు ఇలా ప్రతి అంశం మీదా సోవియట్‌లో ప్రచురితమైన ఇంచుమించు ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. అన్నీ అని చెప్పలేను కాని - చాలా వరకు అని చెప్పగలను.

        సోవియట్‌ పుస్తకాల గురించి చెప్పేటపుడు తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిన వ్యక్తి ఒకరున్నారు - మా నాన్న గారు. ఆయనకు కూడా పుస్తకాలంటే ఎడతెగని అభిమానం - కాదు ఇంకా ఎక్కువే - పిచ్చి అంటారే  - అలాంటిదే. నేను కావాలన్న ప్రతి పుస్తకాన్ని నాకు తెచ్చిచ్చేవారు - ఎందుకు అని అడిగేవారు కాదు. విశాలాంధ్ర బస్‌లో నేను రెగ్యులర్‌ కస్టమర్‌ని. నాన్న గారు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఆయన కోసం ఎదురు చూసేవాళ్లం - ఎంత రాత్రయినా సరే. ఎందుకంటే ఆయనతో పాటుగా ఎన్నో సోవియట్‌ పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. అవి చూస్తే కాని నిద్రపోయేవాళ్ళం కాదు. ఆయన తెచ్చే పుస్తకాలు ముందు ఎవరు చదువుతారో అని మా అన్నదమ్ముల మధ్య పోటీగా ఉండేది. అవన్నీ చదివి వాటిలో  ఏముందో నాన్నకి చెప్పాలి. అదీ ఒప్పందం. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో విశాలాంధ్ర స్టాల్‌ కనబడితే - వెంటనే అక్కడ హాజరు. కొత్తగా వచ్చినవన్నీ ఏరుకొనేవాడిని. ఏనాడూ కూడా నాన్న గారు బిల్‌ ఎంత అయింది అని చూడలేదు. అటువంటి నాన్న దొరకడం నిజంగా నా అదృష్టం. ఇప్పటికీ నేను కొత్త పుస్తకం  కొనగానే ఆయనకు చూపించడం నా అలవాటు. పేపర్లలో సమీక్షలు చదివి, ఈ పుస్తకం ఇంతా తెప్పించలేదా - ఇదింకా చదవలేదా అని నన్ను వెంబడిస్తూనే ఉంటారు.

       మళ్ళీ ఇన్నాళ్ళకు, నాకు తెలిసిన కొన్ని వేల మందిలో మరలా నాన్నగారి లాంటి పుస్తకాల ప్రేమికుణ్ణి చూసాను - బత్తుల అనిల్‌ రూపంలో. బ్లాగులో  దొరికాడు. వెంటనే ఫోన్‌ కలిపాను. కొద్దిసేపు మాట్లాడగానే తెలిసింది - పుస్తకాల పిచ్చి - చివరి దశలో ఉంది. నేను చదువుతున్నాను - తను ప్రేమిస్తున్నాడు - అంతే తేడా. ఎంతో ఆర్తి ఉంటే గాని, ఇటువంటి ప్రయత్నం సాధ్యం కాదు. నేను ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా పుస్తకాలని సేకరిస్తున్నాడు - అందరికీ పంచుతున్నాడు. వెంటనే మాట ఇచ్చాను. నా దగ్గర  ఉన్న వాటిలో నుండి కొన్నింటిని స్కాన్‌ చేసిస్తాను అని మాటిచ్చాను. ఆ  మాత్రం మాటకి తను నాకిచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? మా నాన్న గారు ఆయన చిన్నతనంలో పోగొట్టుకున్న ఏడు రంగుల పువ్వు - ఇంగ్లీష్‌ వెర్షన్‌. ఆయన ఆ పుస్తకం గురించి, దానిలో కథ గురించి నాతో ఎన్నో సార్లు చెప్పారు. అంతకు మించి ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా పుస్తకం తెలుగు వెర్షన్‌ దొరకలేదు. కాని అనిల్‌ గారి ద్వారా ఇంగ్లీష్‌ వెర్షన్‌  దొరికింది. ఆ పుస్తకాన్ని మా  నాన్న గారికి కానుకగా ఇచ్చాను. ఆయన కళ్ళలో ఎంతో ఆనందం. అనిల్‌కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అనిల్‌ ఒకటే అన్నారు -  మీరు నా రుణం తీర్చుకోవాలనుకుంటే ఆ పుస్తకాన్ని తెలుగులో మీరే అనువాదం చేయండి - అని. పెద్దబాధ్యతే.. కాని ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే  పూర్తి చేస్తాను.

        మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి, జ్ఞాపకాల దొంతరల్ని బూజు దులిపి, పుస్తకాలతో నా తీయని చెలిమిని గుర్తు చేసుకొనేలా చేసిన సోదరుడు అనిల్‌కి మరలా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అనిల్ బ్లాగ్ ని సందర్శించడం మరచిపోకండి... http://sovietbooksintelugu.blogspot.in

Monday, August 4, 2008

తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలి


తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, తాడేపల్లిగూడెంలో తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహశిల్దారుకి ఒక వినతి పత్రం సమర్పించాము. ఆ సంఘటన యొక్క వివరాలు "సాక్షి" పేపర్లో ప్రచురించినప్పటిదీ క్లిప్పింగ్. ఈ ఫోటోలో ఎడమవైపు మొదట వున్నది నేను. సమాఖ్యలో గత పది సంవత్సరాలుగా సభ్యునిగా వున్నాను. మిగతా సాహితీ మితృలతో కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాము. అనంతరం తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి, దాన్ని ప్రాచీన భాషగా గుర్తించదానికి గల అర్హత గురించి సమావేశంలో చర్చించడం జరిగింది.

Wednesday, July 30, 2008

కొల్లేరు- కవిత- ఎస్.ఆర్. భల్లం

ఎస్. ఆర్. భల్లం గారు అన్ని కవితా ప్రక్రియల్లో పేరు మోసిన కవే గాక, చక్కని సామాజిక స్పృహ వున్న వ్యక్తి. రాష్ట్ర, జాతీయ స్తాయిల్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నాకు మంచి మిత్రుడవటం చేత ఆయన కవితల్లో మచ్చుకు ఒకదాన్ని మీకు రుచి చూపిందామనే ఆలోచనతో, ఆయన రాసిన "కొల్లేరు" కవితా సంపుటిలో నుండి, ఈ కవితని మీకందిస్తున్నాను.


కొల్లేరు
ఒక ప్రవాహం కాదు
స్వార్ధం ఎరకి చిక్కిన జలపుష్పం..
ప్రకృతి విడిచిన
ఒక మౌన దుఃఖ భాష్పం...
ఎన్ని రెక్కల కష్టం కూడితే
ఈ ద్రవీభూత జీవన యానం...

కొల్లేరంటే -
తడిపొడి ఇసుక కాదు
జలచరాల పోగూ కాదు
ఆశా నిరాశల అనంత యాత్రలో
బోర్లించిన అస్తిపంజరంలో
ఇసుమంత ఆర్ధ్రత

కొల్లేరంటే -
ఒక జననం... ఒక మరణం...
వాటి మధ్య నలిగే జీవనం...

తేట నీటి నుదుటి మీద
చీటపట చినుకుల
మెరుపుల మెరుగుల్ని దిద్దుకుంటూ
తెగిపోయిన
సుజల జ్ఞాపకాల్ని ముడి వేసుకోవడానికి
సమాధుల్లోంచి లేచిన శవంలా ఉందిప్పుడు కొల్లేరు.

ఎంత విశాలంగా వుండేది
వందల మైళ్ళకి విస్తరించిన ఈ జలరాశి
ఇప్పుడది అంతరించిపోయిన మూసీ

ఈ జల మైదానాన్ని
భూ ఖండాలుగా మార్చి దురాక్రమణ చేసేవాడొకడు
అపార జలనిధిని
చెరువు ముక్కలుగా కత్తిరించి
స్వార్ధ మత్స్యాల్ని సాగు చేసేవాడొకడు
క్షణం క్షణం కుచించుకుపోతున్న
ఈ జల సంపదని కాపాడేదెవరు?

ఇప్పుడు కొల్లేరు
ఏ కలంలోనూ సిరాగా ప్రవహించదు
ప్రవహించినా
అది డబ్బు సంతకానికి పనికొస్తుంది.

ఇప్పుడు కొల్లేరు
ఏ కావ్య రచనకూ ప్రేరణ కాదు
పాత జ్ఞాపకాల్ని తవ్వి తీయడానికి
పలుగూ పారల్ని సిద్దం చేసుకొండి

ఇలా కొల్లేటిని మార్చిందెవరు.
దుర్నీక్ష్య కాంతిలో వెలిగిన కొల్లేటి సలిలం
ఇప్పుడు దుర్గంద దుర్జలంగా మారిపోయింది

"నీళ్ళ పక్కన వున్నావ్... నీకేమిటి...?" అనేవారు
నీటి గొడుగు కింద వున్నావ్... నీకేమిటి...? అనేవారు
కాని ఇప్పుడు
నిజంగా కొంప కొల్లేరయింది

ఇప్పుడిది
గ్రామాల మధ్య దూరాల్ని పెంచిన
బురద మడుగు మాత్రమే...
ఈ మడుగు ఎప్పటికయినా ముందడుగు ఔతుందా...?

Saturday, July 5, 2008

మహిళా విలాపం

నీవు పుట్టక ముందే

అవనిపై అడుగుపెట్టక ముందే

అబార్షన్ పేరిట నీ ప్రాణాలు తీసే

రాక్షస కృత్యం మొదలవుతుంది

స్కానింగ్ మాయా దుర్భిణిలో చూసి

లోపల వున్నది నీవేనని తెలిసిన మరుక్షణం

కసాయి కత్తులు నీపై స్వైర విహారం చేస్తాయి

లోకం తెలియని పాపవయినా కనికరించదీ లోకం

జన్మనిచ్చే జనని సైతం

తానూ ఒక స్త్రీనని మరచిన క్షణం

నీపై నీకె కలిగేను ఏహ్య భావం



పాలుగారు బుగ్గల పసిదనం వీడకముందే

లోకం తీరు నీకు పూర్తిగా తెలియకముందే

కామంధుల కళ్ళు నీపై దాడి చేస్తాయి

చూపులతోనే నీ హృదయాన్ని గాయపరుస్తాయి

మాటలతోనే మనస్సుని ముక్కలు చేస్తాయి

ప్రేమ పేరుతో నీకు సమాధి కట్టడానికి

ప్రతీ క్షణం వేచి వుంటాయి తోడేళ్ళ గుంపులు



కాళ్ళ పారాణి ఆరకముందే

కమ్మని కలలు నిజమవకముందే

కట్న పిశాచి ఎదురవుతాడు

ఆశలన్నీ చిదిమేసి

అనుక్షణం నరకం చేసి

నీ జీవితంతో ఆడుకుంటాడు

మనసే లేని "అతడు"



ఎక్కడమ్మా, మీ స్త్రీ జాతికి విముక్తి

ఏమయిందమ్మ మీలో వున్న ఆ శక్తి

ఎదిరించి పోరాడితేనే మీకు మోక్షం

అలా చేసి అందరికీ కావాలి ఆదర్శం