కారడవిలో కూలిపోయిన విమానంలో ప్రయాణిస్తున్న పిల్లల తల్లి, పైలట్, గైడ్ అందరూ చనిపోయారు. కాని అదే విమానంలో ప్రయాణిస్తున్న 11, 9, 4 సం॥ల వయసున్న పిల్లలు క్షేమంగా బయటపడడం విశేషం.. మరొక అద్భుతం ఏమిటంటే.. వారిలో 11 నెలల చిన్నారి కూడా ఉండడం. వీరందరూ దట్టమైన కారడవిలో 40 రోజుల పాటు క్షేమంగా, సజీవంగా ఉన్నారు. ఇది మరింత అద్భుతం.
నిజానికి మనందరికీ ఈ సంఘటన చాలా అద్భుతంగా కనిపించవచ్చు. కాని, జాగ్రత్తగా ఆలోచిస్తే... ప్రకృతిలో ఇవన్నీ సహజమే అని తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కోట్ల జీవులు వున్నాయి. అవన్నీ ప్రకృతికి అతి దగ్గరగా జీవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ ప్రకృతిలో కలిసిపోయి వున్నాయి. సృష్టి మొత్తం మీద అత్యంత తెలివైన జీవిని అని విర్రవీగే మనిషి మాత్రం రోజు, రోజుకీ ప్రకృతి నుండి దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోవడం వలన తనకు కలిగే కష్టాలు, ఆకలి, అనారోగ్యాలు, ప్రకృతి విపత్తులు... వీటన్నిటికీ ప్రకృతి కారణమని నిందిస్తున్నాడు. అన్ని జీవులు తమకు కలిగే అనారోగ్యాలకు, వ్యాధులకు ప్రకృతిలోనే మందులను వెతుక్కుంటాయి. వాటి ఆహారంలో మార్పులు చేసుకుంటాయి. ఆయా కాలాలకు తగ్గట్టుగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ, అనారోగ్యం బారిన పడకుండా ఆనందంగా జీవిస్తున్నాయి.కాని మనిషి మాత్రం ఆధునిక నాగరికత పేరుతో ప్రకృతి దూరం అవ్వడమే కాకుండా, ప్రకృతిని నాశనం చేసి, సమస్త సృష్టికి ద్రోహం చేస్తున్నాడు. వేళకు నిద్రపోకుండా, వేళకు లేవకుండా, సహజంగా దొరికే ఆహారాన్ని తినకుండా, దానిలో అడ్డమైన కెమికల్స్ కలిపి తింటూ, తన ఆరోగ్యానికి తానే తూట్లు పొడుచుకొంటున్నాడు. తిరిగి ఆరోగ్యవంతుడు కావడానికి కూడా అదే ప్రకృతిని పాడు చేస్తున్నాడు. నిజానికి మనకు వచ్చే అనారోగ్యాలలో 90 శాతం వరకు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వలనే వస్తాయి. మన జీవన అలవాట్లను మర్చుకోవడం ద్వారా చాలా వరకు అనారోగ్యాలను దూరం చేసుకుని, ఆనందంగా జీవించవచ్చు. భారతీయ జీవన విధానం ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో మంది మహర్షులు, శాస్త్రవేత్తలు ఈ దేశంలో అత్యుత్తమ జీవన విధానాన్ని రూపొందించి ఇచ్చారు. ఆధునికత పేరుతో ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని ఆహారపు అలవాట్లని, వింత వింత జీవన విధానాలను అవలంబించి, మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాము.
పై సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే... పసిపిల్లలు ఎంత అమాయకంగా ప్రకృతికి దగ్గరగా, అడవి అమ్మ ఒడిలో సురక్షితంగా ఉన్నారో, అదే విధంగా మనం కూడా సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఎటువంటి చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి పీలుస్తూ, సహజ జలవనరుల్ని కలుషితం చేయకుండా, అదే నీటిని తాగుతూ, ప్రతి రోజు కొద్దిసేపైనా సూర్యకాంతిని శరీరమంతా తగిలేలా వ్యాయామం, ఆసనాలు వేస్తూ, చక్కటి శాకాహారం తీసుకుంటూ ఉంటే మనం కూడా ఆ పిల్లల్లాగా సురక్షితంగా ఉంటాం. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ఆ ప్రకృతి మనల్ని అమ్మలా రక్షిస్తుంది.. తన చల్లటి ఒడిలో పసిపాపల్లా మనల్ని పోషిస్తుంది.. కాపాడుకుంటుంది.... సర్వేజనా స్సుఖినో భవంతు...